అది అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్… 24వ తేదీ, మంగళవారం ఉదయం 11 గంటలకు ఇద్దరు వ్యోమగాముల నడుమ చర్చ… ఒక వ్యోమగామి దిగువన కనిపిస్తున్న ఇండియా వైపు దిగులుగా చూస్తూ తోటి వ్యోమగామితో అంటున్నాడు… ‘అదుగో కనిపిస్తున్న సముద్రం పక్కనే తీరంలో ఆంధ్రప్రదేశ్… చుక్కలా కనిపిస్తున్నది కదా, అదే రాజమహేంద్రవరం… చంద్రబాబు ఉన్న ఊరు అదే…
ఆయనను అక్రమంగా అరెస్టు చేసి ఇక్కడి జైలులోనే పెట్టారు… దుర్మార్గం కదా… ఇప్పుడే శాటిలైట్ టీవీ ట్యూన్ చేస్తుంటే ఈ వార్త, ప్రజలందరూ నిద్రాహారాలు మాని ఉవ్వెత్తున ఆందోళనలు చేస్తున్నారట, ప్రపంచం ఈ స్థాయి విప్లవాన్ని మునుపెన్నడూ చూడలేదట…’ తోటి వ్యోమగామి కూడా బదులిస్తూ ‘అవునవును, ఇప్పుడే గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌తో మాట్లాడుతుంటే అక్కడా ఇదే చర్చనట…’ అన్నాడు…
ఈలోపు ఇతర వ్యోమగాములు తేలుతూ వచ్చారక్కడికి… ఆ గ్రూపులో చాలాసేపు ఇదే చర్చ… గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ సిబ్బంది కూడా ఈ చర్చలో ఇన్వాల్వ్ అయ్యారు… నాసా, ఇస్రో తదితర అంతరిక్ష ప్రయోగ, పరిశోధన కేంద్రాలన్నింటిలోనూ ఈ చర్చ హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఎప్పుడూ లేనిది ఏవో భీకరమైన రేడియో ధ్వనులు వినిపిస్తున్నాయి, బహుశా గ్రహాంతరజీవులు ఎవరో తమ నిరసనను ప్రకటిస్తున్నారేమో అన్నాడు ఒకాయన…
Ads
‘ఓసారి నాసా ఉనికికే ప్రమాదం ఏర్పడే సాంకేతిక సమస్య వస్తే మా చీఫ్ హైదరాబాద్‌కు ఫోన్ చేశాడు… మొబైళ్లు, కంప్యూటర్లు, సాఫ్ట్ వేర్ సృష్టికర్త చంద్రబాబు… చిటికెలో పరిష్కారం చెప్పాడు… ఈరోజు ఇన్ని శాటిలైట్లు తిరుగుతున్నాయంటే ఆయన చలవే…’ అని నాసా సీనియర్ శాస్త్రవేత్త కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా చెప్పాడు… అందరూ తమ తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు… ఆయన్ని అరెస్టు చేసిన పాపం ఊరకే పోదని అందరూ శాపనార్ధాలు పెట్టారు… ఉసురు తగులుతుందనీ తేల్చిచెప్పారు… అందరూ కలిసి ఇక చివరకు ఈ అరెస్టుపై అంతరిక్ష సమాజం తరఫున ఓ బలమైన ఖండన ప్రకటనను జారీచేయాలని తీర్మానం చేశారు…
అరెరె, ఏమిటీ పైత్యం అనుకుంటున్నారా..? ఒక టీవీ5 సాంబశివరావో, ఒక మహాన్యూస్ వంశీయో పూనితే ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు కూడా ఇలాంటివి బోలెడు రాయగలరు… ఆంధ్రజ్యోతి ఏమీ వెనకబడిపోలేదు… ఈ నయా పాత్రికేయ పైత్యానికి అదే మార్గదర్శి… ఏం.. ఇలాంటి వార్తలు మనం రాయలేమా ఏమిటి..? అనుకుని, కాసేపు అంతరాత్మను నిద్రపుచ్చి, అదే తరహాలో రాసుకొచ్చిన వార్త అది… ఆంధ్రజ్యోతి అసలు ఏం రాసిందీ అంటారా..? ఇదుగో…
ఈరోజు ఉదయం నుంచే నెట్‌లో వైరల్ అయిపోయింది ఈ క్లిప్పింగ్… వెటకారాలు, ఎకసక్కేలు ఈ వార్త మీద జోరుగా నడుస్తున్నయ్… కాస్త జూమ్ చేసుకుంటే చాలు, మొబైల్‌లో కూడా ఈ వార్తను ఎంచక్కా మీరూ చదువుకోవచ్చు… హాయిగా నవ్వుకోవచ్చు… ఈరోజు మీకు బీపీ టాబ్లెట్ కూడా అవసరం లేదు… అంతరిక్షం దాకా ఎగిసిన మన పాత్రికేయ ప్రమాణాలను తలుచుకుని మీరు గర్వంగా కూడా ఫీల్ కావచ్చు… శుభం…
Share this Article