పేరుకు రెండు వేర్వేరు పత్రికలు… అనగా వేర్వేరు దేహాలు… కానీ గోత్రం ఒకటే… ఆత్మ ఒకటే… ‘‘హలో బ్రదర్’’ తరహాలో ఒకే ఫ్రీక్వెన్సీలో, ఒకే వేవ్‌లెంత్‌పై, ఒకే ఎమోషన్‌తో…. కాదు, ఒకే బుర్రతో స్పందిస్తుంటాయి… అక్షరాలు కూడా అచ్చుగుద్దిన కవలసోదరుల్లా అచ్చులోకి వచ్చేస్తుంటయ్… అర్థమైపోయింది కదా… ఆ దేహాల నామవాచకాలు ఆంధ్రజ్యోతి, ఈనాడు…
ఉదయమే రెండు పత్రికలూ తిరగేసినవాళ్లకు మరోసారి అర్థమైంది అదే… అఫ్‌కోర్స్, ఇదేమీ కొత్త కాదు… ఒక సెక్షన్ ప్రయోజనం కోసం రాయబడే ప్రతి వార్త రెండింట్లోనూ ఒకేతరహాలో సాగుతుంది… ప్రత్యేకించి వైఎస్ కుటుంబం, జగన్మోహన్‌రెడ్డి వ్యతిరేక వార్తలు అనేసరికి రెండు గుండెలూ ఒకేరకంగా కొట్టుకుంటాయి… పల్స్ రేటు కూడా సేమ్… కాకపోతే కొన్నిసార్లు ఆంధ్రజ్యోతి చిక్కటి పచ్చటి చొక్కా వేసుకుంటుంది… ఈనాడు పచ్చటి బనియనే, కానీ చొక్కా కలర్ కాస్త డైల్యూటెడ్, లైట్ కలర్…
Ads
చూశారుగా… రెండూ ఫస్ట్ పేజీ వార్తలే… వార్త దాదాపు సేమ్, కట్ అండ్ పేస్ట్ తరహాలో… విషయం ఏమిటయ్యా అంటే… చంద్రబాబు ఢిల్లీలో జరిగిన ఆజాదీ అమృత మహోత్సవ కమిటీ భేటీకి హాజరయ్యాడు… అది అధికారిక సమావేశం… రాజకీయ నాయకులే కాదు, సొసైటీ ప్రముఖుల్ని చాలామందిని పిలిచారు… అక్కడికి వచ్చిన మోడీ అందరినీ పలకరించాడు… పనిలోపనిగా చంద్రబాబును కూడా పలకరించాడు…
అదొక చరిత్రాత్మక భేటీ అన్నట్టుగా… ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసేసుకున్నాయి… చంద్రబాబు గుణం అర్థమయ్యాక మోడీ, షా కిలోమీటర్ల దూరం ఉంచుతున్నారు తనను… గత ఎన్నికల ముందు… దేశంలో చంద్రబాబు స్థాయిలో మోడీని అన్నిరకాలుగా అవమానించి, వ్యతిరేకించిన నాయకుడు ఇంకొకరు లేరు… అడ్డగోలుగా ఓడిన తరువాత గానీ బాబుకు తత్వం బోధపడలేదు… సారీ, ఆ తత్వమే అది కదా… ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా పోలేడు… జడుపు… మోడీ ఇక జన్మలో నమ్మడు…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు… ఆ సమీకరణంలోనైనా మోడీ చంద్రబాబు పట్ల సానుకూలత చూపలేదు… ఇదే చంద్రబాబు క్యాంపు మోడీతో గ్యాప్ తగ్గించడానికి నానా వేషాలూ వేసింది, ప్రయత్నాలు చేసింది… అసలు చంద్రబాబు తన పరిసరాల్లోకి రావడమే ఇష్టం లేనట్టుగా మోడీ వ్యవహరించాడు… చంద్రబాబు ఆత్మీయ సోదరుడు వెంకయ్య నాయుడినీ మోడీ, షా దెబ్బకొట్టేశారు… ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి బీజేపీకి ఓ దశ, ఓ దిశ లేదు కాబట్టి, అంతగా భ్రష్టుపట్టించబడింది కాబట్టి, ఉద్దరించే నేతలు కూడా ఎవరూ ఏపీబీజేపీలో లేరు కాబట్టి… ప్రస్తుతానికి ఏపీపై బీజేపీకి ఆశలేమీ లేవు… బాబుతో కలిసి సాగే రాజకీయ అవకాశవాదమూ ప్రస్తుతానికి అక్కర్లేదు…
ఢిల్లీ భేటీకి చంద్రబాబు హాజరవుతున్నాడని తెలియగానే జగన్ కట్ చేసుకున్నాడు… కానీ నీతిఆయోగ్ మీటింగ్‌కు వెళ్తాడు… అక్కడ ఎలాగూ చంద్రబాబుకు ఎంట్రీ లేదుగా… ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు వార్తల విషయానికి వస్తే… చంద్రబాబును మోడీ పలకరించడమే మహద్భాగ్యం అన్నట్టుగా సంబరపడిపోయాయి… నిజమే, చంద్రబాబు పొడకూడా గిట్టని మోడీ ‘‘ఆప్ కైసా హై బాబూ’’ అని పలకరిస్తే అది విశేషమే… మోడీ పట్ల చంద్రబాబు కనబరిచిన వ్యతిరేకత మామూలుది కాదు కదా…
ఈ స్థితిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి గుండెలు ఒకే ఫ్రీక్వెన్సీలో కొట్టుకుని ఏదేదో రాసేశారు… ప్రత్యేకంగా మోడీ చంద్రబాబును పక్కకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడాడట… మీరు మమ్మల్ని మరిచిపోయారు, ఇలాగైతే మేం ఏమైపోవాలి, దేశం కోసమైనా మీరు అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తుండాలి… మీ ఇల్లు అనుకొండి, మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, ప్లీజ్ అని మోడీ పదే పదే మొహమాటపెట్టేశాడట… సర్లె, మరీ అంతగా బతిమిలాడకు, అప్పుడప్పుడూ వస్తుంటాలే అని చంద్రబాబు మోడీకి అభయహస్తం చూపి, ధైర్యాన్నిచ్చాడు అన్నట్టుగా ఉన్నాయి రాతలు… థాంక్ గాడ్, చంద్రబాబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు కారు దాకా నడిచివచ్చి వీడ్కోలు పలికాడని రాయలేదు..!!
Share this Article