.
ముంబైలోని ఓ చిన్న హోటల్… ఓ మనిషి వచ్చాడు, విపరీతంగా తిన్నాడు… మనిషి తిండి మొహం చూడక ఎన్నాళ్లయిందో అన్నట్టున్నాడు… అలాగే తింటున్నాడు… మళ్లీ ఎన్నిరోజులకు తిండి దొరుకుతుందో ఏమో మరి…
తన దగ్గర నయాపైసా లేదు… ఆ తిండి తీరు చూసి ఆశ్చర్యపోయిన ఆ వెయిటర్ చివరకు బిల్లు తీసుకొచ్చాడు… ఈ మనిషి ఆ బిల్లు తీసుకుని నేరుగా కౌంటర్ మీద కూర్చున్న సేటు వద్దకు వెళ్లాడు… ఆకలి అన్నీ చంపేస్తుంది… అభిమానం ఎట్సెట్రా…
Ads
‘‘సేటూ, నా దగ్గర పైసా లేదు, రెండు రోజులుగా ఏమీ తినలేదు, ఇలాగే ఉంటే ఏమైపోతానో అని భయమైంది… అందుకే వచ్చి తిన్నాను… ప్రాణాలు నిలుస్తాయి కదా… నీకివ్వాల్సిన సొమ్ము బాకీ… ఏదైనా పని చెప్పు, చేస్తాను.., కానీ బాకీ కింద రాసుకో, ఖచ్చితంగా చెల్లిస్తా… ఇద్దరికీ గౌరవం’’ అన్నాడు సూటిగా… దేనికైనా రెడీ అన్నట్టుగా… అంతకుమించి తనకు గత్యంతరం లేదు కూడా…
ఇది మళ్లీ ఆ పరిసరాల్లో కనిపించే కేరక్టర్ కాదులే అనుకుని నవ్వుకున్నాడు సేటు… ఐనాసరే.., ‘సరే, వెళ్లు’ అన్నాడు… ఇదొక ముష్టి అనుకుని బిల్లు వసూలు వదిలేశాడు జాలిగా చూస్తూ… ఆ మనిషి వెళ్లిపోయాడు… వెయిటర్ వచ్చి, అలా వదిలేశారేం సేటు గారూ అనడిగాడు… ‘పోనీలేరా… ఇదొక బుడితి ఖాతా… సరే, వెళ్లు, నీ పనిచూసుకో’ అన్నాడు సేటు…
కథ ఇక్కడ ముగిసిపోలేదు… నిజంగానే మూడునాలుగు నెలల తరువాత ఆ మనిషి హోటల్‌కు వచ్చాడు… తన బాకీ చుక్తా చేశాడు… థాంక్స్ చెప్పాడు సేటుకు… సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు… ఓహ్, అచ్చీ బాత్ హై అంటూ సేటు ఓ చాయ్ తెప్పించి, తాపించాడు… తను సినిమా నటుడు అయినందుకు కాదు, నిజాయితీగా తన పాత బాకీ గుర్తుంచుకుని, వచ్చి, చెల్లించినందుకు… ఆ నీతి నచ్చి..!
ఆయనకు సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నాయి… ఎప్పుడూ అటువైపు రావడం, ఆ సేటుతో కలిసి చాయ్ తాగడం, ఏవో ముచ్చట్లు… దోస్తీ పెరిగింది…
ఆయనకు ఆదాయం పెరిగింది, బంగళా కొన్నాడు… ఓ కారు, దానికి డ్రైవర్… కాలం మారిపోతోంది… కానీ ఆ మనిషి హోటల్‌కు వస్తూనే ఉంటాడు… ఆ సేటుతో కాసేపు మాట్లాడకుండా, ఆ చాయ్ మర్యాద తీసుకోకుండా తిరిగి వెళ్లడు…
ఒకవేళ ఆరోజు బిల్లు కట్టలేదనే కోపంతో సదరు సేటుగారు అందరి ఎదుట కొట్టి ఉంటే..? అవమానించి ఉంటే..? కొన్ని వందల పాత్రలు చేసి అలరించిన ఓంప్రకాష్ అనే హిందీ నటుడు మనకు కనిపించేవాడు కాదు…!! దీన్నే డెస్టినీ అంటాం…
నమక్ హలాల్ చూసినవాళ్లకు ఓంప్రకాష్ గుర్తురావడం ఈజీ… అమితాబ్ ప్రతి సినిమాలోనూ ఉంటాడు దాదాపుగా… 1919లో కశ్మీర్‌లో పుట్టిన ఆయన 78 ఏళ్ల వయస్సులో, అంటే 1998లో మరణించాడు…
Share this Article