అప్పట్లో మరాఠీలో ఓ చిత్రం వచ్చింది… పేరు హిర్కానీ… నిజానికి అది రియల్ స్టోరీయే… కాకపోతే కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కథను ఇంకాస్త బరువుగా మలిచారు… ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో దొరుకుతుంది… విషయం ఏమిటంటే, అందరూ అమ్మ దినం గురించి, సారీ, ఇది కటువుగా ధ్వనిస్తోంది కదా, మాతృదినోత్సవం, మదర్స్ డే సందర్భంగా చాలా రాస్తున్నారు కదా… ఇది కూడా గుర్తు చేయాలనిపించింది…
హిర్కానీ… పాలమ్ముకునే ఓ పల్లె పడతి… రాయగఢ్ కోట సమీపంలో ఉండేది… ఈ కోటను ఛత్రపతి శివాజీ స్వాధీనం చేసుకున్నాడు… 1674లో రాజధానిని చేసుకున్నాడు… ఈ కోట పశ్చిమ కనుమలలో, చుట్టూ కొండలతో దుర్బేధ్యంగా ఉండేది… కోట చుట్టూ ప్రాకారాలు, మస్తు బందోబస్తు ఉండేది…
లోపలకు రావడానికి, బయటికి వెళ్లడానికి నానా ఆంక్షలూ ఉండేవి… శివాజీకి ఉన్న శత్రు బెడద వల్ల ఇవన్నీ తప్పకపోయేవి… కొండి దిగువన ఉన్న గ్రామంలో హిర్కానీ ఉండేది… వాళ్లకేమో కోటలోకి వెళ్లకుండా రోజువారీ అమ్మకాలు కుదరవు… అందుకని గ్రామస్థులు తమ వస్తువులను తీసుకొచ్చి, తిరిగి త్వరగా వెళ్లిపోవాలనే షరతుతో ఒకవైపు ఉదయమే కోట తలుపులు తెరిచేవాళ్లు… సాయంత్రం కాగానే ఠంచనుగా మూసేసేవాళ్లు… దేవుడొచ్చినా సరే, మరుసటి రోజు ఉదయం వరకూ తలుపులు తెరవబడవు ఇక…
Ads
అందరిలాగే హిర్కానీ కూడా పాలు తీసుకుని పొద్దున్నే ప్రధాన ద్వారం వద్ద నిలబడేది… త్వరత్వరగా పాలమ్ముకుని త్వరగానే బయటికి వెళ్లిపోయేది… ఓరోజు కోటకు వెళ్లడం ఆలస్యమైంది, కారణం, పిల్లాడు ఏడుస్తుంటే బుజ్జగించి రావడానికి ఆలస్యం… అందరికీ పాల వాడుక… తన వినియోగదారులందరికీ పాలు పోసి తిరిగి ద్వారం వరకు చేరుకోవడానికి కూడా జాప్యం అనివార్యం అయిపోయింది…
ఆమె అక్కడికి చేరేలోపు ద్వారపాలకులు తలుపులు మూసేశారు, ఇంట్లో కొడుకు ఏడుస్తుంటాడు, ఈ పాల అమ్మకాలు సరే, సకాలానికి వాడికి తన పాలుపట్టాలి… ఏడ్చినా, బతిమిలాడినా, మొత్తుకున్నా ద్వారపాలకులు తలుపులు తెరవలేదు, తెరిస్తే, ఆ విషయం తెలిస్తే శివాజీ తమ తలలు తీయిస్తాడని భయం…
ఆమెలోని అమ్మతనం ఊరుకోనివ్వలేదు… తలుపులు మూస్తేనేం, తల్లితనం ఆగుతుందా..? ఆమె ఓ తోవ కనుక్కుంది… కొండకు ఎవరూ ఎక్కలేని, దిగలేని వైపు నుంచి దిగడానికి నిర్ణయించుకుంది… ఆమెకు శివాజీ గట్రా ఎవరూ గుర్తు లేరు, ఇంట్లో కొడుకు ఏడుస్తున్న దృశ్యమే కళ్ల ముందుంది…
నిజానికి అది చాలా దుర్గమం… చెట్లు, పొదలు, రాళ్లతో ఒళ్లు గీరుకుపోయింది పలుచోట్ల… గాయాలు… ఐతేనేం, ఇంటికి వెళ్లిపోయింది… తెల్లవారి మామూలుగానే ద్వారం ఎదుట పాలతో నిలబడింది… ద్వారపాలకులు ఆమెను చూసి ఆశ్చర్యపోయారు… రాత్రి అంతలా ఏడ్చింది కదా, మరి ఇంటికెలా వెళ్లివచ్చింది..?
ఆమెను శివాజీ ఎదుట హాజరుపరిచారు… రాత్రి జరిగింది చెప్పిందామె ధైర్యంగా, నా పిల్లాడు పాలుమరిచేదాకా ఆగి, ఎలాగైనా శిక్షించండి అని వేడుకుంది… అసలు ఆ కొండ నుంచి ఎవరైనా దిగి, ఎక్కగలిగే అవకాశం ఉందనే నిజాన్ని శివాజీ గ్రహించాడు… అంటే శత్రువులకు ఆ వైపు నుంచి ఒక అవకాశం ఉందన్నమాట…
ఆమె అమ్మతనాన్ని, ఆమె తనకు ఓ వైపు నుంచి పొంచిన ప్రమాదాన్ని తెలిసేలా చేసిన ధైర్యాన్ని ఆశ్చర్యంతో గమనించిన శివాజీ ఆమెను ప్రశంసించాడు… వదిలేశాడు… ఆమె కొండ దిగిన వైపు ఓ బురుజు కట్టించాడు… గోడ కూడా… దానికి ఆమె పేరే పెట్టాడు… అదే హిర్కానీ బురుజు… అమ్మ అంటే… అమ్మే… అంతకు మించిన నిర్వచనం లేదు..!
Share this Article