Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణే గెలిచింది… అరాచకాన్ని చీరి చింతకు కట్టింది…

December 3, 2023 by M S R

కాలం చాలా గొప్పది… ఎవరికివ్వాల్సింది వాళ్లకు సరైన సమయంలో ఇచ్చేస్తుంది… కేసీయార్‌ అతీతుడు ఏమీ కాదుగా… తనకూ ఇచ్చేసింది… నిర్దయగా… మొహం పగిలిపోయేలా…

నిజానికి ఇక్కడ కేసీయార్ పరాభవానికి, పరాజయానికి పూర్తి కారణాల ఏకరువులోకి వెళ్లడం లేదు… కాలమెంత బలమైందో తనకు ఓసారి గుర్తుచేసే ప్రయత్నమే… తనకు తెలియదని కాదు… 80 వేల పుస్తకాలు చదివానంటాడు కదా… తనకన్నీ తెలుసు… ఐనా తెలిసీ చేస్తాడు తప్పులు… చేశాడు… ఫలితాన్ని చవి చూస్తున్నాడు…

ప్రజలు గొర్రెలు, వాళ్లను మాయ చేయడం అత్యంత సులభం అని కళ్లుమూసుకుపోయిన ప్రతి నియంత కాలగతిలో కొట్టుకుపోయారు… అలా కేసీయార్ ఓటమి పెద్ద విశేషమేమీ కాదు… నిజానికి ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించలేదు… కేసీయార్‌ను ఓడించారు… ఇది కాంగ్రెస్ పట్ల పాజిటివ్ వోటు కాదు… ఖచ్చితంగా కేసీయార్ పట్ల నెగెటివ్ వోటు… ఇదంతా కేసీయార్ స్వయంకృతం… చివరికి గజ్వేల్ మీద డౌటు తో కామారెడ్డి వెళ్తే మరీ మూడో స్థానమా…!?

Ads

ఒకప్పుడు ఉపఎన్నికల్లో కేసీయార్ ఓడిపోతాడేమో, అయ్యో, తెలంగాణవాదం ఓడిపోతుందేమో అని ప్రతి తెలంగాణవాది గుండె పీచుపీచుమనేది… విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు కరీంనగర్ వెళ్లి, ఊరూరూ తిరిగి, ఇల్లిల్లూ కలిసి ప్రయాసపడ్డారు… అలాంటిది ఇప్పుడు పొరపాటున కేసీయార్ మళ్లీ గెలుస్తాడేమో అని తెలంగాణ ప్రేమికుల గుండెలు పీచుపీచుమన్నాయి… అదీ తేడా…

నిజమే, గులుగుడు గులుగుడే… కానీ వోట్లు గుద్దుడు కేసీయార్ ప్రత్యర్థి చిహ్నం మీద… ఈ కసి గుద్దుడు తన మీద…! అంతా అయిపోయాక, చివరకు ప్రజాతీర్పు ఈవీఎంల్లో భద్రమయ్యాక కూడా 3.0 హేట్రిక్, 60 సీట్లతో గెలుస్తున్నాం, మళ్లీ మనమే అనే కారు పెద్దల వ్యాఖ్యలతో కూడా తెలంగాణవాదం ఒకింత టెన్షన్ పడింది… సరే, ఎలాగైతేనేం, నయా నిజాం నవాబు తలవంచాడు… నయా గడీలు బద్దలయ్యాయి… కారు తుక్కయిపోయింది…

ఏమంటిరి ఏమంటిరి… నాకింకా ఏం కాావాలె, తెలంగాణ తెచ్చిన గొప్ప పేరొచ్చింది… సంపుకుంటరో సాదుకుంటరో మీ ఇష్టం అని ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసేదాకా వచ్చింది స్థితి… ఐనా జనం వినలేదు… మరి తెలంగాణ తెచ్చిన తనను జనం ఎందుకు ఛీత్కరించింది..? ఆ గొప్ప పేరు ఎందుకు మట్టిలో కలిసిపోయింది..? స్వయంకృతం… దొరతనం…

చెప్పుకోవడానికి ఏముంది..? అబద్ధాలు అన్ని వేళలా వెలగవు… నెగ్గవు… అబద్ధాలతోనే కాలం నడవదు… ధరణి, మేడిగడ్డ, టీఎస్పీయెస్సీ, కౌలు రైతులు, జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అప్పులు, గొప్పలు… ఎన్ని వైఫల్యాలు… ఎందరి ఉసురు…!! మాట్లాడితే దాడి, ప్రశ్నిస్తే కేసు… నయా దేశ్‌ముఖ్‌ల్లాగా మారిన నాయకులు… అక్రమాలు, అవినీతి, కబ్జాల నాయకుల్ని తెలంగాణ సమాజం మీద రుద్దిన ఫలితం ఇది…

ఎవరైనా సరే, కేసీయార్ మాత్రం వద్దు… ఇదీ జనసంకల్పం… ఆ కుటుంబం పట్ల ప్రజల విస్పష్ట తిరస్కృతి… అరయగ కర్ణుడీల్గె ఆర్వురి చేతన్… అన్నట్టుగా ఈ ఓటమికి బోలెడు కారణాలు… ప్రచార పటాటోపాలు, మైకు మోతల అట్టహాసాలు, అసత్యాల ఆడంబరాలు కూడా కాపాడలేదు… ఏ కేసీయార్ తమ పార్టీని బజారుకీడ్చి, గాయిగత్తర చేయాలనుకున్నాడో ఆ కేసీయార్‌తోనే లాలూచీ పడ్డ బీజేపీ కథ విడిగా చెప్పుకుందాం…

తను స్థిరంగా నిలబడి ఉంటే ఈ కేసిఆర్ వ్యతిరేకతతో బీజేపీ ఇంకా బాగా బలపడేది… దిక్కుమాలిన స్ట్రాటజీలతో చెడగొట్టుకుంది… టీఆర్ఎస్‌లోని తెలంగాణ ఆత్మను కత్తిరించుకున్నప్పుడే ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుంది… ఈ సరికొత్త గాయిగత్తర పార్టీని జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఇప్పుడు విశ్వసించదు, సొంత ప్రజలూ విశ్వసించరు… మరేమిటి కర్తవ్యం..?

ఐతే… అది ఫీనిక్స్… మళ్లీ రెక్కల్లో బలం తెచ్చుకుని ఎగురగలదు… అపారమైన సా’ధన’ సంపత్తి ఉంది… అది కొత్త అధికారాన్ని నిలువునా చీల్చగలదు… కాంగ్రెస్ కొంప కాల్చగలదు… తిరిగి జడలు విరబోసుకుని మళ్లీ తెలంగాణ పైన పడగలదు… సో, కాంగ్రెస్ గణమా… బహుపరాక్… బహుపరాక్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions