.
నిజం నిలకడగా గడప దాటేలోపు అబద్ధం ప్రపంచమంతా తిరిగొస్తుందంటారు కదా… దీన్ని బీఆర్ఎస్ క్యాంపు బలంగా నమ్ముతుంది… నమస్తే తెలంగాణలో ఉద్దేశపూర్వకంగా ఓ వార్త అచ్చేస్తారు… దాన్ని బీఆర్ఎస్ క్యాంపు సోషల్ మీడియా పోస్టులు, వీడియోలతో జనంలోకి తీసుకుపోతుంది…
గౌలిగూడ బస్టాండును 400 కోట్ల హడ్కో రుణం కోసం తాకట్టు పెట్టారని వార్త… హవ్వ, ఇంత అన్యాయమా..? ఓ చరిత్రాత్మక కట్టడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెడుతుందా..? ఇంకేముంది..? రేపో ఎల్లుండో దాన్ని అమ్మేస్తారు, అసలు తెలంగాణ ఉనికికే ప్రమాదం అన్న రేంజులో ప్రచారాలు స్టార్ట్ చేస్తారు…
Ads
పైగా మొదటి నుంచీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం మీద వ్యతిరేకతతో ద్వేష విషాన్ని కక్కుతూనే ఉంది… ఇప్పటికే 6700 కోట్ల మేరకు ఆర్టీసీకి ప్రభుత్వం సమకూర్చడం, ఆర్టీసీ కొత్త బస్సులు కొంటుండటం అనే విషయాలను పక్కన పెడితే… ఇదే బీఆర్ఎస్ అధినేత కేసీయార్ ఒక దశలో సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగుల మీద కోపంతో అడ్డంగా ఆర్టీసిని ప్రైవేటీకరిస్తానని తనే స్వయంగా ప్రకటించిన నిజాన్ని మరిచిపోయినట్టున్నారు ఫాఫం…
అక్కడికి ఆ గౌలిగూడ బస్టాప్ నుంచి ఇప్పటికీ బస్సుల రాకపోకలు సాగుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చింది నమస్తే తెలంగాణ పత్రిక అలియాస్ బీఆర్ఎస్ పత్రిక… ఓసారి చరిత్రలోకి వెళ్దాం…
దీన్ని సీబీఎస్ హ్యాంగర్ అనీ పిలిచేవాళ్లు… ఏడో నిజం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1930లో నిర్మించాడు దీన్ని… అప్పట్లోనే అమెరికా, బట్లర్ మాన్యుఫాక్చరింగు కంపెనీ నుంచి, సముద్రం- రోడ్డు రవాణా ద్వారా ప్రిఫాబ్రికేటెడ్ మెటీరియల్ తెప్పించి, మరీ అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఈ మిసిసిపి హెలికాప్టర్ హ్యాంగర్‌ను నిజాం తన వ్యక్తిగత ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ డిపోగా వాడేవాడు… 350 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తు…
దాదాపు 88 ఏళ్లపాటు సేవలందించిన ఈ బస్టాపు సమీపంలోనే మూసీ ద్వీపకల్పంలో 1994లో ఓ ఆధునాతన బస్టాండ్ (ఎంజీబీఎస్- ఇమ్లీబన్) కట్టాక, ఈ హ్యాంగర్‌ను సిటీ బస్సుల రాకపోకలకు కొన్నేళ్లు వాడారు… కేసీయార్ హయాంలో సరైన మెయింటెనెన్స్, రిపేర్లు లేక… అప్పటి సర్కారు నిర్లక్ష్యంతో 2018 జూలై 5న కుప్పకూలింది… అప్పటికే దాాన్ని ఖాళీ చేసి, దుకాణాలను కూడా ఖాళీ చేయించి,, వదిలేశారు కదా, ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు… ఇదీ ఆ ఫోటో…
కూలడానికి ముందు వారం క్రితం వరకూ… ఈ డిపో నుండి దాదాపు 2,500 బస్సు ట్రిప్పులు నడిచేవి… 85 బస్సులు హ్యాంగర్ వద్ద స్టాండ్‌బైలో ఉంచబడేవి… డిపోలో 250 బస్సుల ఇంటర్-చేంజ్ జరుగుతుండేది… హ్యాంగర్ ముందు ఉన్న రెండు బస్ షెల్టర్లను గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఉంచడానికి ఉపయోగించేవాళ్లు…
తరువాత ఇక దాన్ని పట్టించుకున్నదీ లేదు… అక్కడే ఓ పెద్ద భవనం నిర్మించి, కమర్షియల్‌గా వాడి, ఆర్టీసికి అదనపు ఆదాయం సంపాదించాలనే ప్రతిపాదనల్ని కూడా కేసీయార్ ప్రభుత్వం పట్టించుకోలేదు… ఒకవేళ ఈ స్థలాన్ని గనుక ఆర్టీసీ హడ్కో రుణం కోసం తాకట్టు పెడితే, ఆ తాకట్టు వార్తలే నిజమైతే… ఆ రుణాన్ని ఆర్టీసీ అవసరాలకు వినియోగిస్తే… అదెలాగూ ఆర్టీసీ స్థలమే కదా… అందులో తప్పేమిటో, ఈ గాయిగత్తర ప్రచారం ఏమిటో అర్థం కాదు…!!
Share this Article