.
చదువులు చట్టు బండలేనా ..? ఎనభయ్యవ దశకంలో రెండు సినిమాలు వచ్చాయి … ఆకలి రాజ్యం సినిమాలో నిరుద్యోగుల జీవితాలను ఒక్క పాటలోనే కళ్ళకు కడతాడు దర్శకుడు. ఈ చదువులు మాకొద్దు.. అనే మరో సినిమాలో… ఉద్యోగాలు ఇవ్వలేని.. ఉపాధి చూపలేని.. ఎందుకూ కొరగాని చదువులు అని యవత నిరాశ.. నిస్పృహలతో.. ప్రాణత్యాగానికి సిద్ధపడతారు..
సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఈ పరిస్థితి మారలేదు. మారే సూచనలు కూడా కనిపించడం లేదు.. 90వ దశకం వరకు కూడా బీఏ చదువుతున్నానంటే.. ఏం.. అది చదివి.. బియ్యం కుంటలో వేలు పెట్టడానికా.. అని పెద్దలు ఎగతాళి చేసేవారు.. ఒక రకంగా 90 వ దశకం వరకు సర్కారు బడుల్లో చదివిన వాళ్ళే ఎన్నో రెట్లు మేలు. సుస్థిర ఉద్యోగ, వ్యాపార రంగాలలో రాణిస్తున్నారు.
Ads
21 వ శతాబ్దంలోనూ డబుల్ పట్టాలు పుచ్చుకుని చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క.. వేలాదిమంది బతుకులు భారంగా వెళ్లదీస్తున్నారు. మరి ఇపుడు కోర్సులు, కాలేజీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి, గొడ్ల చావిళ్ళ నుంచి ఏసి గదుల్లోకి, మన పల్లె, జిల్లా రాష్ట్రం దాటి ఒకే గదిలో ఇద్దరు, నలుగురు, ఏడుగురు, పదిమంది విద్యార్ధులుగా పెరిగి కార్పొరేట్ సంస్కృతిగా రూపాంతరం చెందింది.
కానీ నాణ్యమైన, జీవితానికి పనికివచ్చే విద్య కన్నా 120, 150 ప్రశ్నలకు ఎ, బి. సి, డి బట్టీయంకే రూ. లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. స్కూళ్ళు అయితే ఎవడి సిలబస్ వాడిదే. పుస్తకాలు, ఇతరత్రా అమ్మకాల మీద ఉండే శ్రద్ధ చదువుల మీద లేదననేది కాదనలేని వాస్తవం.
జూనియర్ కాలేజీ దాటగానే విద్యార్ధుల ధోరణి ఎలా మారుతుందో ఓ మూడు ఉదాహరణలు చూద్దాం.
డిగ్రీ మెదటి సంవత్సరం విద్యార్ధిని ఫ్రెండ్ తో ఫోన్ సంభాషణ : ఏయి, పరీక్ష ఎలా రాశావు.. బాగానే రాశాను .. 10 ప్రశ్నలు.. ఒక్కో దానికి ఏడు మార్కులు.. అయిదు బాగా రాశాను .. మిగిలినవి.. సో .సో .. మరి ఎలా.. ఏమోనే.. చదివింది గుర్తుండడం లేదు.. ఏ ప్రశ్నకు ఏ జవాబు రాయాలో తెలియడం లేదు.. 24 మార్కులు వస్తే పాసవుతాను .. వాడు.. రాసిన వాటికి నాలుగు.. నాలుగు.. మార్కులు వేయడా.. ముందే బాగా చదివి ఉండొచ్చు కదే .. ఏమోనే .. చదవాలనిపించడం లేదు .. చదివినా బుర్రకెక్కడం లేదు.
ఇంజినీరింగ్ మెదటి సంవత్సరం విద్యార్ధుల ముచ్చట రేయ్ .. రేపు ఎక్జామ్ రా .. సి .. ప్రోగ్రామ్ రాయలేను రా .అరే .. ఒక పని చేద్దాం .. నువ్వు 15 స్లిప్పులు పట్టుకురా.. నేను 15 పట్టుకు వస్తా.. గీకి పడేద్దాం.. అది కాదు రా. ఒక ఐడియా .. ఆ …. గాడు .. (లెక్చరర్ని ఉద్దేశించి ఇక్కడ ఒక బూతు పదం వాడాడు) .. వెయ్యి రూపాయలిస్తే పాస్ చేస్తానంటున్నాడు.. అదే ఆలోచిస్తున్నా.. సరే ..రా. అయితే మాట్లాడు .. నేను మా బాబును.. చెప్పులు కొనుక్కుంటానని డబ్బులు అడుగుతా..వాడికి ఇచ్చేద్దాం..
డిగ్రీ రెండో సంవత్సర విద్యార్ధుల మాటా మంతి : ఒరేయి.. ఆ.. .. గాడు ఏంటిరా .. క్లాస్.. ఏం చెప్పినా అర్ధం కాదు …బోర్డు మీద ఏదో గీకి పోతాడు.. డౌట్ అడుగుదామంటే.. అందరి ముందు సెటైర్లు ఏస్తాడు.. హెచ్ఒడి ముందు పోజు కొడతాడు.. వీళ్ళు క్లాస్ సరిగ్గా వినరంటాడు.. ఆడికి సబ్జెక్ట్ రాదని తెలిసి మన ముందు షో చేస్తాడు.. ఆ సబ్జెక్ట్ ఎలా రా పాసయ్యేది..
మూడు విభిన్న కోర్సులు చదువుతున్న విద్యార్ధుల మనోగతాలు తెలుసుకున్నాం కదా… బీటెక్ చివరి సంవత్సరంలో అంటుకోవాల్సిన జాడ్యం మొదటి ఏడాది రెండో సెమిస్టర్ కే వంటబట్టిందంటే ఆ కాబోయే ఇంజినీర్లు బయటకు వచ్చి ఏం వెలగబెడతారో, ఆ డిగ్రీలు చేతబట్టుకుని వచ్చి ఏం చేస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అలాగే చాలా కాలేజీల్లో కాలక్షేపం చదువులు సాగుతున్నాయనడానికి ఈ సంభాషణలే నిదర్శనాలు.
ఇంజినీరింగే కాదు రూ. కోట్లు పోసి కొనుక్కుంటున్న వైద్య విద్యలోనూ ఇలాంటి తమాషాలు ఎన్నో..
మరో వైపు విషయ పరిజ్ఞానం, నైపుణ్యం, అంకితభావం ఉన్నవాళ్ళు దొరకడంలేదని.. నియమకాల్లో రాజీ పడాల్సి వస్తోందని వివిధ సంస్థలు చెబుతున్నాయి.
ఇంకో వైపు రైల్వేలో నాలుగో తరగతికన్నా చిన్న ఉద్యోగాల వంటి వాటికి కూడా ఎంబీఏలు.. బీటెక్కులు.. వందల సంఖ్యలో పోటీపడుతున్నారు.. ఏమంటే సర్కారీ కొలువంటారు.. అంటే అక్కడైతే పెద్దగా పని చేయక్కర్లేదని భావన కావచ్చు. సరయిన ఉద్యోగాలు దొరక్క పోవడం.. మరి ప్రభుత్వాలు ఇచ్చే నైపుణ్య శిక్షణలు.. ఉపాధి మేళాలు ఏమవుతున్నాయి.
మన దేశంలో నిరుద్యోగిత రేటు (15- 29 ఏళ్లల్లోపు) 7.2 శాతంగా ఉందని కేంద్ర ఉపాధి కల్పన శాఖ మంత్రి పార్లమెంటులోనే సెలవిచ్చారు. రానున్న సంవత్సరంలో ఇది తగ్గే అవకాశం ఉందని కూడా ఊరించారు..
పదహారేళ్ల వరకు సెల్ ఫోన్లు నిషేధించాలి.. అంత కాదూ కూడదనుకంటే కాల్స్ కే పరిమితమయ్యే ఫోన్లు ఇవ్వాలి. (అసలు ఈ సౌకర్యం లేనట్టుంది. అయినా మొబైల్ కంపెనీలు ఒప్పుకోవు కదా. వాటి ఆదాయం భారీగా పడిపోదూ…)
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధం విధించినట్టు మన దేశంలోనూ కట్టడి చేస్తేనే ఈ తరం కొంతయినా బాగుపడుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులనే మొదటి బాధ్యులుగా గుర్తించాలి…… హరగోపాలరాజు వునికిలి
Share this Article