Amarnath Vasireddy… ఆధునిక వెట్టి చాకిరి : ఎన్నో ఏళ్ళ క్రితం అంతరించి పోయిన వెట్టి చాకిరి వ్యవస్థ అక్కడ ఇప్పుడు సరికొత్త రూపంలో వేళ్ళూనుకొంటోంది . దూర ప్రాంతాల నుంచి, కొండంత ఆశతో వచ్చిన యువతీ యువకులు, అక్కడ సరికొత్త వెట్టి బానిసలుగా మారిపోతున్నారు .
యువకులు… గ్యాస్ స్టేషన్లు , హోటళ్లు , మాల్స్ మొదలయిన చోట లో- స్కిల్ లేబర్ గా పని చేస్తున్నారు . అతి తక్కువ జీతం . పని గంటలు అధికం . ఇన్సూరెన్సు ఉండదు . కార్మిక చట్టాలు వర్తించవు . కొన్ని సార్లు అవమానాలు . ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు .
యువతుల పరిస్థితి మరీ దారుణం . అక్కడి స్కిన్ ఇండస్ట్రీ , తార్పుడు గత్తెలు వారిని టార్గెట్ చేసి ఊబిలోకి లాగుతున్నారు . విథి లేని పరిస్థితుల్లో అనేక మంది అమ్మాయిలు డర్టీ వర్కర్లుగా , అలాంటి సైట్ల నటీమణులుగా మారిపోతున్నారు . బతకడానికి ఏదో చేయాలి అనే నిస్పృహలో ఉన్నారు.
Ads
ఆ దేశం పేరు తెలుగులో కె తో మొదలవుతుంది . అక్కడికి ఉన్నత విద్య కోసం వెళ్లిన కొందరు భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది . అక్కడి కాలేజీల్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు మన దేశ విద్యార్థులే . అక్కడి ఉన్నత విద్యా సంస్థలు బతుకుతున్నది మన దేశ విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజుల వల్ల. ఇప్పుడు ఆ దేశంలో నెంబర్ వన్ ఇండస్ట్రీ విదేశీ విద్యార్థులకు విద్యనందించడమే . మన దేశంలో మొదలయ్యే రాష్ట్ర విద్యార్థులే అక్కడ ఎక్కువ .
ప్రతి కాలేజీ, ఏజెంట్లను నియమించుకొంది. వారికి ఒక్కో అడ్మిషన్ కు ఇంత చొప్పున కమిషన్ అందుతుంది . తమ కమిషన్ కోసం వీరు తిమ్మిని బమ్మిని చేస్తారు . నిజం చచ్చినా చెప్పారు . మాయ చేసి.. మోసం చేసి విద్యార్థులను తెస్తారు . చెప్పే చదువు అంతంత మాత్రం . ఫీజులు అధికం . దోపిడీ . అడిగే వాడుండడు . అడిగినా సమాధానం రాదు .
ఆ దేశంలో మొత్తం వ్యవస్థలు ఈ విషయంలో కుమ్మక్కయ్యాయి . ప్రభుత్వాలు , రాజకీయ నాయకులు పట్టించుకోరు . పట్టించుకొంటే కాలేజీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి . అసలే కరోనా కాలంలో దివాలా ఎత్తాయి. ఏమీ జరగనట్టు చూస్తుంటే కాలేజీలకు ఆదాయం . తమకూ లంచాలు . ఉభయ కుశలోపరి.
అక్కడ చదువుతున్న ప్రతి పది మంది భారతీయ విద్యార్థుల్లో ఆరుగురు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు . అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి . ప్రతి నెల కొన్ని డెడ్ బాడీస్ ఇండియాకు పార్సెల్ వెళుతాయి. ఇక్కడి పత్రికల్లో ఇలాంటి వార్తలు రావు . కారణం ఇవన్నీ తల్లితండ్రులకు నచ్చవు . వారికి తమ పరువు ముఖ్యం . విదేశీ విద్య పేరుతో నడుస్తున్న కన్సల్టెన్సీలకు నష్టం . వారికి తమ ఆదాయం ముఖ్యం .
దొంగ సర్టిఫికెట్ లేదా మరొకటి .. విమానం ఎక్కారా? అక్కడ దిగారా? అనేది చాలా మంది తల్లితండ్రులకు ముఖ్యం . నలుగురితో గొప్పలు చెప్పుకోవాలి . లేకపొతే తలతీసేసినట్టు ఫీల్ అవుతారు .
అక్కడ .. గ్యాస్ స్టేషన్ లో పని చేస్తున్నారా? లేక టాయిలెట్లు కడుగుతున్నారా ? అనేది అనవసరం . నోరు తిరగని యూనివర్సిటీ / కాలేజీ పేరు చెప్పి గొప్పలు పోవాలి . ఎంతో మంది గతంలో పోయారు . ఏదో విధంగా సెటిల్ అయిపోయారు . ఇప్పుడు మన వాడూ ఇంతే అనుకొంటారు . నలుగురితోటి నారాయణ .
ఇక్కడుంటే తమ గుండెలపై భారం . ఇరుగు పొరుగు వారు ” ఫారిన్ కు పోలేదా ? క్యాంపస్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ కాలేదా ? ప్యాకేజీ ఎంత?” అనే ప్రశ్నలతో పీక్కు తింటారు . ఇక్కడి వ్యవస్థలకు కూడా ఇదే కావాలి . ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు . నిరుద్యోగ యువత ఇక్కడుంటే అశాంతి, అలజడి . వెళ్ళిపోతే వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత తప్పుతుంది .
మరో దేశం గురించి …
ఆ దేశ రాజధాని రాత్రి పూట అందమయిన సుందరిలా కన్పిస్తుందట . అక్కడో పెద్ద టవర్ ఉంది. ప్రపంచ ఫాషన్ రాజధాని అది . ఇదంతా గతం .. ఇప్పుడు … అయ్యా .. వీధి కుక్కలు వీధిలో బతకడానికి అలవాటు అయివుంటాయి . వాటి బాడీలు రఫ్ అండ్ టఫ్ . ఒకటి రెండు రోజులు తిండి దొరక్కపోయినా తట్టుకుంటాయి .
మైనం బొమ్మలాంటివి హైబ్రిడ్ కుక్కలు . తమని అలా పుట్టించమని అవి కోరుకోలేదు . వాటిని కొని ఇంట్లో పెంచుకొంటారు . అవి ఇంటి నుంచి బయటకు వెళితే కనీసం ఒక పూట బతక లేవు . పసి పిల్లలతో సమానం .
అలాంటి పెంపుడు కుక్కల్ని ఎక్కడో వీధిలో వదిలేసి పారిపోయి వస్తే ? అంతకంటే పాపం , దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా ? ఏదో ఒకరో పది మందో అలా చేసారంటే ఏదోలే.. అనుకోవచ్చు . ఏటా ఆ దేశంలో లక్ష పెంపుడు కుక్కలని వీధిలో వదిలేస్తున్నారు . పెరిగిన ధరలకు తట్టుకోలేక సొంత బిడ్డల్లా సాకుతున్న కుక్కల్ని వీధిలో వదిలేసే వచ్చే దౌర్బగ్య పరిస్థితి వారిది . వారి పా నగరం ఇప్పుడు అందమయిన అమ్మాయిలాగా లేదు . చెత్త సుందరి కుళ్ళి కంపు కొడుతోంది . ఎక్కడ చూచినా చెత్తాచెదారం.. మరోపక్క సామజిక అలజడులు .
మనల్ని ఏలిన దొరల రాజ్యం కూడా ఈ దేశం పక్కనే ఉంది . అక్కడ వున్నవారు రెండు మూడు ఉద్యోగాలు చేసినా పూట గడవని స్థితి . విదేశీ విద్యార్థులు కొంత మంది అద్దెలు చెల్లించలేక ఫుట్ పాత్ లపై గడుపుతున్న పరిస్థితి . తమకే దిక్కు దివాణం లేక అల్లాడుతున్న దేశాల్లో ఉపాధిని వెదుక్కొంటూ పోవడం ఏంటి ?
దీని అర్థం విదేశీ విద్య పనికి రాదు అని కాదు . అత్యుత్తమ విద్య నందించే సంస్థలున్నాయి . విదేశీ విద్య అయిపోయాక .. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉండాలి . విద్య కోసం విదేశీ సంస్థలు . అటుపై ఉద్యోగం… విద్యార్ధి ప్రతిభ, ఆసక్తి బట్టి . అంతే కానీ “వారు పొయ్యారు .. వీరు పొయ్యారు . నువ్వు ఎన్ని అడ్డదార్లయినా తొక్కు. దొంగ సర్టిఫికెట్లు అయినా పెట్టు . అక్కడ ఏమైనా చెయ్యి . నాకు ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం ముఖ్యం” అనే తల్లి తండ్రులు .. ఇంకా విదేశీ విద్య మాఫియా చేతుల్లో యువత నలిగిపోతోంది . రక్షించడం సరే . కనీసం వారి బాధలు నలుగురికీ తెలిసే అవకాశం లేదా ?
Share this Article