కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌ల గురించి ఏమీ రాయలేదెందుకు..? ఓ మిత్రుడి ప్రశ్న… అధికార ప్రతిపక్షాలు పడికట్టు పదాలతో తిట్టుకుంటారు, మెచ్చుకుంటారు… అంతే… అంతకుమించి ఏమీ లేదు… నిజానికి చట్టసభల్లోని సభ్యుల్లో చాలామంది బడ్జెట్‌ను చదవరు… వాళ్లకు అర్థం కాదు… అర్థం చేసుకోవాలనే తాపత్రయమూ ఉండదు… ఏదో నోటికొచ్చిన నాలుగు పొలిటికల్ మాటలు చెప్పడం తప్ప…
రాష్ట్ర బడ్జెట్లు దాదాపు అన్నీ అంతే… నిజానికి బడ్జెట్ అంటేనే జస్ట్, వచ్చే ఆదాయం, ఖర్చుల రఫ్ అంచనాలు… దేనికి ఎంత ఖర్చు..? అంతే… దానికి కట్టుబడి ఉండే ప్రసక్తే లేదు… కాకపోతే ప్రభుత్వాల ప్రాధాన్యాలేమిటో రఫ్‌గా ఆ అంకెలు తెలియజెబుతాయి… జీఎస్టీ శకం వచ్చాక రాష్ట్రాలు పెంచే పన్నుల్లేవు, తగ్గించే ప్రసక్తి అసలే లేదు… పేరుకు భారీగా బడ్జెట్ అంచనాలు పెంచి చూపిస్తారు, తీరా, రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో 20- 30 శాతం తగ్గిపోతుంది… ఆడిటెడ్ అకౌంట్స్ విషయానికొచ్చేసరికి మరింత కత్తెర…
అప్పుల మీదే మనుగడ… వాటి మిత్తీలు కట్టడానికి, వాయిదాలు కట్టడానికి మళ్లీ అప్పులు… ఇదే సైకిల్… అన్నింటికీ మించి ఉద్యోగుల జీతభత్యాలు వర్తమాన సమాజానికి పెనుభారం… కానీ ఒక్కరికీ వాటికి కత్తెర వేయడానికి ధైర్యం ఉండదు… అదీ ఒకింత విషాదం… కొంతలోకొంత చంద్రబాబు వైఎస్ హయానికి ముందు (ప్రపంచబ్యాంకు నిర్దేశించినట్టు)… బోలెడు నిరర్థక కార్పొరేషన్లను మూసేశాడు… దిక్కుమాలిన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించాడు… సరైన మార్గంలో వెళ్లింది ఆర్థిక రథం… తరువాత తనూ ఓ టిపికల్ ఇండియన్ పొలిటిషియన్ అయిపోయాడు, వోట్ల కోసం, అధికారం కోసం…
Ads
తరువాత అన్నీ రివర్స్… మరీ మొన్నటి జగన్ పాలనలో లెక్కకుమిక్కిలి కార్పొరేషన్లు, సిబ్బంది… సలహాదార్లు, జీతాలు ప్లస్ వశపడని అప్పులు… అచ్చు కేసీయార్ కూడా అంతే… వెరసి రుణఊబిలో రాష్ట్రాలు… అసలు పనిలేకుండా ఉన్న కార్పొరేషన్లు, సిబ్బందిని తొలగించే ధైర్యం ఉందా ఏ పాలకుడికైనా…! పైగా వాళ్ల డిమాండ్లకు లొంగిపోవడం తప్ప..!
మోడీ మోడీ అంటారు గానీ… మోడీ బడ్జెట్లు గత పదేళ్లలో అప్పులు, ఖర్చులు తగ్గించుకునే దిశలో ఉన్నాయా..? నెవ్వర్… తనకు ఆర్థిక వ్యవహారాలు అర్థం కావు… అర్థమై ఉంటే నోట్ల రద్దు చేసేవాడే కాదేమో… పోనీ, ప్రజోపయోగ పథకాలు ఏమైనా ఉంటాయా..? అదీ లేదు… నిజానికి కొన్ని పథకాలు అత్యంత గందరగోళం… ఉదాహరణకు ప్రజాపంపిణీ వ్యవస్థ… కేంద్రం లెక్కలకూ, రాష్ట్రం లెక్కలకూ పొంతన ఉండదు… కేంద్రం ఇచ్చే ఫ్రీ రేషన్ బియ్యం రాష్ట్ర పథకానికి సర్దుబాటు…
ఆయుష్మాన్‌భవ, కేంద్ర పక్కా ఇళ్ల నిధులు… అన్నీ అలాంటివే… కేంద్రం తన ఆదాయాన్ని రాష్ట్రాలకు సరైన రీతిలో పంచేసి, సంక్షేమ పథకాల్ని పూర్తిగా రాష్ట్రాలకే అప్పగించి… తను ప్రధాన రంగాలపై కాన్సంట్రేట్ చేస్తే సరిపోదా..? రిపిటీషన్లు దేనికి..? మొన్నటి బడ్జెట్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు లక్షల కోట్లు అని గప్పాలు… క్షేత్ర స్థాయిలో అదెంతటి డొల్ల వ్యవహారమో, ఎంత దుర్వినియోగమో వాటి గురించి తెలిసిన వాళ్లకు బాగా ఎరుక…
ప్రైవేటు రంగంలో సృష్టించబడే కొత్త ఉద్యోగులకు మొదటి జీతం ఇస్తారట… అసలు ఉద్యోగ కల్పన పూర్తిగా ప్రైవేటు రంగంలోనే ఉన్నప్పుడు మొదటి జీతం ఎవరు కడితే ఏమిటిట..? పైగా ఆయా కంపెనీల దగ్గర డార్మిటరీలు కడతారట… ఈ సత్రాలు కాదు, ఉద్యోగి కాలరెగరేసుకుని, పనిచేసి, గౌరవంగా బతికే ఏర్పాటు చేయడం కదా కావల్సింది…
ఒకవైపు కార్పొరేట్ సెక్టార్ మీద రకరకాల భారాలు వేస్తూ… మరోవైపు కోట్ల కొలువుల్ని సృష్టిస్తాం అంటుంది నిర్మలమ్మ… కొన్నేళ్లుగా విఫల ఆర్థిక విన్యాసాలు ఆమెవి… అంతెందుకు..? గతంలో మీడియా హౌజులు ప్రత్యేక డిబేట్లలో ఆర్థిక నిపుణులతో బడ్జెట్లను విశ్లేషించేవి… ఇప్పుడదీ పెద్దగా లేదు… జస్ట్, అవీ పొలిటికల్ కలర్ పూసుకుని వెలువడుతున్నాయి…
ప్రణాళికేతర వ్యయం, ప్రణాళిక వ్యయం, రెవిన్యూ వ్యయం, కేపిటల్ వ్యయం, లోటు బడ్జెట్, అప్పుల పరిమాణం, డెట్ మేనేజ్‌మెంట్ భారం… వీటి తేడాలు, అర్థాలు మీడియా హౌజులు నడిపేవాళ్లలోనే చాలామందికి తెలియవు..!!
Share this Article