.
సత్వర న్యాయం దొరక్కపోవడం అన్యాయం… న్యాయసాయం అందకపోవడం ఇంకా అన్యాయం… విచారణకే నోచుకోని నిర్బంధం మరింత అన్యాయం… బాధ్యత వహించి, పరిష్కారాలు ఆలోచించి, అమలు చేయాల్సిన న్యాయవ్యవస్థకు ఏమాత్రం పట్టకపోవడం తీవ్ర అన్యాయం…
ఒక నివేదిక మన న్యాయవ్యవస్థ డొల్లతనాన్ని… లక్షలాది మందికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపింది… నిజానికి దీనిపైన సమాజంలో మంచి చర్చ జరగాలి… అదీ లోపించింది… వివరాల్లోకి వెళ్తే…
Ads
భారతదేశ జైళ్లలో ఉన్న ఖైదీలలో 70 శాతానికి పైగా మంది ఇంకా విచారణ ఎదుర్కొంటున్న వారే… వీరు దోషులుగా తేలకముందే జైళ్లలో మగ్గుతుండటం, అత్యధిక శాతం మందికి తమకున్న ఉచిత న్యాయ సహాయం (Legal Aid) హక్కు గురించి కూడా తెలియకపోవడం అత్యంత ఆందోళనకరమైన పరిస్థితిని సూచిస్తోంది…
ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, NALSAR యూనివర్శిటీకి చెందిన ఫెయిర్ ట్రయల్ ప్రోగ్రామ్ (FTP) నివేదిక విడుదల సందర్భంగా వెల్లడించారు… 74 శాతం అండర్‌ట్రయల్స్‌లో కేవలం 7.91 శాతం మంది మాత్రమే అందుబాటులో ఉన్న న్యాయ సహాయాన్ని వినియోగించుకున్నారని ఆయన తెలిపారు…
కారు చీకట్లో మగ్గుతున్న ‘అండర్ ట్రయల్స్’
అండర్ ట్రయల్స్ జైలులో గడిపే సమయం, కొన్నిసార్లు వారు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరానికి గరిష్ట శిక్ష కంటే కూడా ఎక్కువగా ఉంటోందని జస్టిస్ నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు… ఓ ఉదాహరణ…
న్యాయం అందక ఆలస్యం అవుతున్న వందలాది మందిలో ఒకరు 36 ఏళ్ల అనిత దేవి (పేరు మార్చబడింది)… 2017లో తన ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె, ఐదేళ్లకు పైగా జైలులో గడిపింది. బాల్యంలోనే వివాహం, జీవితాంతం గృహ హింస ఎదుర్కొన్న ఆమెకు, తాను చేయని నేరానికి కుటుంబం కూడా దూరమైంది. చివరకు 2022లో NALSAR యూనివర్శిటీలోని స్క్వేర్ సర్కిల్ క్లినిక్ బృందం సహాయంతో ఆమె బెయిల్ పొందగలిగింది. ప్రస్తుతం మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఒక క్లినిక్‌లో రోగులకు సహాయం చేస్తూ ఆశ్రయం పొందుతోంది…
నివేదికలో ఆందోళనకర అంశాలు
NALSAR స్క్వేర్ సర్కిల్ క్లినిక్ 2019 నుండి 2024 వరకు నిర్వహించిన ఫెయిర్ ట్రయల్ ప్రోగ్రామ్ (FTP) నివేదికలోని ముఖ్యాంశాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి….
- న్యాయవాది లేనివారు…: వారు డీల్ చేసిన 5,783 కేసులలో, 41.3% మంది నిందితులకు విచారణ కోసం న్యాయవాదిని నియమించలేదు…
- పత్రాలు లేనివారు…: 51% మంది వద్ద విచారణను కొనసాగించడానికి అవసరమైన పత్రాలు లేవు…
- వెనుకబడిన వర్గాలు…: ఈ ప్రోగ్రామ్ పరిధిలోకి వచ్చిన అండర్‌ట్రయల్స్‌లో 67.6% మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారు….
- అసంఘటిత రంగం…: 79.8% మంది అసంఘటిత రంగంలో పనిచేసేవారు….
- వైకల్యాలు…: 58% మంది కనీసం ఒక వైకల్యంతో బాధపడుతున్నారు…
ఈ క్లినిక్ ఐదేళ్లలో 1,834 కేసుల్లో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసింది, 777 కేసులను పరిష్కరించింది, మొత్తం 2,542 కేసుల్లో 1,388 మంది క్లయింట్లు విడుదలయ్యారు.
సంస్కరణల ఆవశ్యకత
నివేదికలోని ఈ “కలవరపరిచే అంశాల”పై స్పందించిన జస్టిస్ నాథ్, అండర్‌ట్రయల్స్‌కు న్యాయ సహాయం అందించే విధానంలో తక్షణ సంస్కరణలు చేయాలని పిలుపునిచ్చారు…
న్యాయవాదులు బెయిల్ దరఖాస్తులను యాంత్రికంగా దాఖలు చేయడం, నిందితులు సమర్పించలేని పత్రాలు లేదా పూచీకత్తు (Sureties) కోరడం వంటి వాటిని ఆయన విమర్శించారు… “నిందితులు బెయిల్ మొత్తాన్ని భరించలేక, పూచీకత్తులు కనుగొనలేక మళ్లీ మొదటికే వస్తున్నారు” అని జస్టిస్ నాథ్ అన్నారు…
ఉచిత న్యాయ సహాయం అనేది కేవలం చట్టంలో ఉన్న హక్కు మాత్రమే కాదు, పేద, అట్టడుగు వర్గాలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కలిగించే ప్రాథమిక అవసరం… దేశ న్యాయవ్యవస్థలో మానవతా దృక్పథంతో కూడిన సంస్కరణలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఈ నివేదికతో మరోసారి స్పష్టమైంది…
Share this Article