అదుగో ఆ ఆశ్రమంలో స్వామి రేపిస్ట్… ఇదుగో ఈ ఆశ్రమంలో అంతా వ్యభిచారం… కబ్జాలు, వసూళ్లు, పాదపూజలు, కుట్రలు… అన్నీ అక్రమాలే… కేసుల నమోదు… అరెస్టు… బెయిల్ నిరాకరణ… ఎన్ని వార్తలు చదివాం, చదువుతూనే ఉన్నాం..? అసలు ఒక ఆశ్రమం అనగానే ఓ నెగెటివిటీ ధ్వనించేంతగా మీడియా ప్రసారం… ప్రచారం… పోలీసు కేసులు… వాటికితోడు రాజకీయ నాయకులతో అక్రమ బంధాలున్న కార్పొరేట్ సన్యాసులు సరేసరి… నిజానికి కొన్ని వేల ఆశ్రమాలున్నయ్ ఈ దేశంలో… హిమాలయ ప్రాంతాల్లో అనేకం… చాలా ఆశ్రమాల ఉనికి కూడా బయటికి రాదు… వేల మంది సన్యాసులు…
నిజంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకుంటూ… ఆత్మశోధన వైపు అన్వేషణ సాగించే ఆశ్రమాలు బోలెడు… 2019లో శివైక్యం పొందిన కర్నాటక వీరశైవ లింగాయత్ శివకుమారస్వామి తన సిద్ధగంగ మఠం ద్వారా లక్షల మందికి గురుకుల విద్యను అందించిన తీరు చదివాం, ఈ ఒక్క మెతుకు చాలదా..? ఆయనకు ప్రభుత్వమే పద్మభూషణ్ ఇచ్చి సత్కరించుకుంది… నడిచే దేవుడు అని కర్నాటక సమాజం ఆరాధించింది… ఇలాంటివాళ్లు బోలెడు మంది… ఎటొచ్చీ అవి పత్రికల్లో రాయబడవు, టీవీల్లో చూపబడవు… ఎవరో కొందరి పైత్యాన్ని మొత్తం ధార్మిక సమాజానికి ఆపాదించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం సాగుతోంది… ఎందరో విదేశీయులు సైతం ఈ దేశ ఆధ్యాత్మిక పంథా, అందులోని మార్మికత పట్ల ఆకర్షితులై ఇక్కడికి వచ్చేసి, స్థిరపడిపోతున్నారు కదా… కనీసం కొందరి గురించైనా మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం…
Ads
ఇదే వ్యాసం ఎక్కడో చదువుతూ ఉంటే అనుకోకుండా ఓ మహిళ కథ కనిపించింది… ఆమె ఓ మధ్యతరగతి యూదు మహిళ… హాలీవుడ్ ఉన్న లాస్ ఏంజిల్స్‌లో నివాసం… పెళ్లయింది… లైంగిక దాడికి గురైంది… మానసికంగా కుంగుబాటు వంటి దుష్ప్రభావాలు వేధిస్తున్నయ్… పలు దేశాలు తిరిగింది… భర్త వెకేషన్ కోసం ఇండియాకు వెళ్దాం అన్నప్పుడు కూడా తనకు ఇష్టమైన శాకాహారం మీద ధ్యాసతో సరేనని తలూపింది… దేవుడు, ఆధ్యాత్మికత వంటి భావాలేవీ లేకుండా ఇండియాకు వచ్చింది… ఒక్కసారి గంగలో స్నానానికి అడుగుపెట్టాక ఏవో అవ్యక్త భావనలు చుట్టుముట్టాయి… ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఆమె సైకాలజీలో పీజీ చేసి, పీహెచ్‌డీ స్టార్ట్ చేసింది… అలాంటిది ఆమెకే అర్థం కాని ఏదో మార్మిక భావన ఆమెను ఆవాహన చేసుకుంది…
ఆమెలో ఏదో ఆత్మచలనం… నా జీవితానికి కావల్సిందేమిటో ఇక్కడే ఉందని ఫిక్సయిపోయింది… తరువాత భర్తకు విడాకులు ఇచ్చేసింది… రుషీకేష్‌లో పరామర్థ నికేతన్ అనే ఆశ్రమం చేరింది… అక్కడ స్వామి చిదానంద సరస్వతి కొన్నాళ్లు ఆమె నడవడిక గమనించి, సన్యాస దీక్ష ఇచ్చాడు… ఆమెకు ఇక ఇదే లోకం… మానసిక స్వాస్థత చేకూరింది… సత్సంగ్ సమావేశాలు, యోగ, ధ్యానం, వ్యక్తిత్వ వికాస పాఠాలు, ప్రసంగాలు, పర్యటనలు… దేశవిదేశాల నుంచి కూడా అనేకమంది ప్రముఖులు అక్కడికి వచ్చారు… ఇంటరాక్ట్ అయ్యేది, నేర్చుకునేది, నేర్పించేది…
ఆ ఆశ్రమం ‘ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం’ పేరుతో 11 భాగాల్ని పబ్లిష్ చేయాలని తలపెట్టింది… ఆ ప్రాజెక్టుకు ఈమె మేనేజింగ్ ఎడిటర్… ఆమధ్య ఓ పుస్తకం రాసింది… హాలీవుడ్ టు హిమాలయాస్… జర్నీ ఆఫ్ హీలింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్… లాస్‌ఏంజెల్స్ నుంచి రుషీకేష్ వరకు తన జర్నీ ఏమిటో రాసుకుంది… చాలా అప్లాజ్ వచ్చింది ఈ పుస్తకానికి… నెట్‌లో వెతికితే ఆమె గురించి బోలెడు వార్తలు, ఫోటోలున్నయ్… ఆమె బోధనల వీడియోలు కూడా… అవన్నీ ఇక్కడ రాయలేం గానీ… ఒక్కసారి ఆలోచించండి… ఆమెను ఇక్కడికి ఏం లాక్కొచ్చింది..? ఏం కట్టిపడేసింది..?! అనేకమంది విదేశీయులు ఆ గుట్టల్లో, గుహల్లో పడి రోజుల తరబడీ ఏదో అన్వేషిస్తున్నారు… వాళ్లకు ఏం కావాలి..?!
Share this Article