.
BIG ALERT: పూర్తిగా చదవండి. ఇది ముఖ్యమైన అంశం… నీళ్లు తాగొస్తానని వెళ్లి.. పోలీసులను పిలిచింది …
(An Inspiring incident of a House Wife)… జహీరాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి నిన్న ఉదయం ‘ప్రభుత్వ బ్యాంకు అధికారి ఆకాశ్‌శర్మ’ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ బ్యాంకు అకౌంట్ నుంచి ముంబయిలో రూ.1.68 లక్షల చెల్లింపులు అక్రమంగా జరిగాయి’ అన్నారు.
Ads
ఇటు వైపున్న ఈ ఉద్యోగికి ఏమీ అర్థం కాలేదు. ‘ఈడీ, పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. మాకు సహకరించండి’ అంటూ కాల్ కట్ చేసి, వాట్సప్ ద్వారా వీడియో కాల్ చేశారు. అవతల ‘ముంబయి ఎస్పీ ప్రదీప్’ అని ఓ వ్యక్తి లైన్‌లోకి వచ్చాడు.
‘మీరు కదలకుండా కూర్చోవాలి. మీ భార్యను కూడా పిలవండి. ఇంటి తలుపులు మూసేయాలి. మీరు ఎక్కడికీ వెళ్లకూడదు. ఎవరికీ ఫోన్ చేయకూడదు’ అని కొన్ని షరతులు విధించాడు. అదేం విచారణో వారికి అర్థం కాలేదు. కానీ పోలీసులు అనగానే నరరూపరాక్షసులన్న అభిప్రాయం బలంగా ఉండి, విచారణ అంటే ఇలాగే ఉంటుందనుకొని ఆ భార్యభర్తలు సరే అన్నారు.
అరగంటపాటు అవతలున్న ఎస్పీ ప్రదీప్ రకరకాల ప్రశ్నలు వేశాడు. ఏవేవో అడిగాడు. వీళ్లను దాదాపు అరెస్టు చేస్తాననే స్థితికి తెచ్చాడు. ఆ ఉద్యోగికి చెమటలు పట్టాయి. కానీ భార్యకు మాత్రం అవతలున్న వ్యక్తి మీద అనుమానం కలిగింది. కళ్లు తిరుగుతున్నట్లు నటించి, నీళ్లు తాగొస్తానని చెప్పి, ఇంటికున్న మరో డోర్ నుంచి బయటకు వచ్చి 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది.
పట్టణ ఎస్సై, సైబర్ టీం వెంటనే వారింటికి వచ్చారు. ఆ ఇంటికి ఎవరో వచ్చారన్న విషయాన్ని కాల్‌లో ఉన్న ప్రదీప్ గమనించి, టక్కున తన ముఖం దాచుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు. పోలీసులు పక్క నుంచి ఆ బ్యాంకు ఉద్యోగికి పలు సూచనలు చేస్తూ సైబర్ మోసగాళ్ల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు.
ఇది పసిగట్టిన ఆ ప్రదీప్ వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ ఫోన్ ఎవరు చేశారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇల్లాలి చాకచక్యం భారీ సైబర్ మోసాన్ని తప్పించింది. ఇలాంటివి మనకు కూడా జరగొచ్చు. సైబర్ మోసాల కారణంగా దేశంలో రోజుకు రూ.8 కోట్ల డబ్బును ప్రజలు నష్టపోతున్నారు.
ఏ అధికారీ ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి విచారణ చేయరు. అలాంటివి చేయాలంటే ముందస్తు నోటీసులు, పర్మిషన్లు, ప్రొసీజర్లు చాలా ఉంటాయి. కాబట్టి మేం అధికారులం అని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడకుండా వివరాలన్నీ కనుక్కోవాలి. వారి మాటల్ని రికార్డు చేయాలి.
వారు డబ్బు పంపమన్నా, ఇంట్లో వాళ్లను అరెస్టు చేస్తామన్నా భయపడకూడదు. గట్టిగా మాట్లాడితే ‘మా లాయర్‌కి ఫోన్ చేస్తాం.. మా లీగల్ టీం చూసుకుంటుంది’ అని చెప్పాలి. దాంతో వాళ్లు బెదిరిపోతారు.
ముఖ్యంగా పోలీసులతో మాట్లాడే పని ఇంట్లో మగవాళ్లదేనన్న అభిప్రాయాన్ని, అనుమానాన్ని దూరం చేసుకోవాలి. ఎందుకంటే దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాల బాధితుల్లో మహిళలే అధికం. కాబట్టి పోలీసులతో మా ఆయన మాట్లాడతాడు, మా నాన్న మాట్లాడతాడు.. లాంటి పాత మాటలు ఇక కట్టిపెట్టాలి.
PS: ‘ఎక్కడెక్కడో జరిగే ఇన్ని విషయాలు నీకెలా తెలుస్తాయి’ అని ఈ మధ్య బయట కలిసినప్పుడు ఇద్దరు, ముగ్గురు అడిగారు. న్యూస్ పేపర్, రెండు, మూడు న్యూస్ వెబ్‌సైట్లు చదివితే మీకైనా తెలుస్తాయి. ఈ రోజుల్లో కాస్త ఓపిగ్గా చదివి, ఆ విషయాలు నలుగురికి చెప్పేవాడు కరువవుతున్నాడు.
మనందరం జబర్దస్తుల్లో, బిగ్‌బాసుల్లో, హీరోల ఫ్యాన్స్ వార్‌లలో, ఇన్‌స్టాగ్రామ్‌లో అందాల భామలను, కండల వీరులను, బూతు జోకులను చూడ్డంలో బిజీగా ఉంటే, ప్రపంచంలో జరిగేవన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. – విశీ (వి.సాయివంశీ)
Share this Article