రీసెంటుగానే మాటీవీ కామెడీ స్టార్స్ షోలో ఒక స్కిట్… ఎక్స్‌ప్రెస్ హరి అనే కమెడియన్ స్కిట్ అది… తను ‘‘వరుసగా సెలబ్రిటీల ఇళ్లల్లో చోరీ’’ అని చదువుతాడు, మరో కమెడియన్ ‘‘వాళ్ల ఇళ్లకు సెక్యూరిటీ బాగా ఉంటుంది, పెద్దగా ఉంటయ్ ఇళ్లు, చోరీ అంత సులభం కాదు కదరా’’ అని అడుగుతాడు అమాయకంగా… దానికి ఆ హరి ‘‘ఏముందిలేరా..? ఈమధ్య అందరూ హోం టూర్స్ అంటూ వీడియోలు పెట్టేస్తున్నారు కదా యూట్యూబులో… మా తలుపులు ఇవీ, మా ద్వారాలు ఇవీ, ఇక్కడ కిచెన్, ఇక్కడ బెడ్‌రూం, ఇక్కడ బాత్రూం అని మొత్తం వివరాలన్నీ చెప్పేస్తున్నారు కదా… దొంగలకు ఈజీ అయిపోయింది’’ అని సెటైర్ వేస్తాడు…
నిజమే… ఇప్పుడు ట్రెండ్ హోం టూర్స్… కాస్త సెలబ్రిటీ అయితే ఏదో దిక్కుమాలిన యూట్యూబ్ చానెల్ తనే హోం టూర్ అని వీడియో రిలీజ్ చేస్తుంది… లేకపోతే సదరు సెలబ్రిటీలే సొంతంగా వీడియోల్ని సొంత యూట్యూబ్ చానెళ్లలో పెట్టేసుకోవాలి… మరీ కాదంటే ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో వీడియోలు పోస్ట్ చేసుకోవాలి… వాళ్ల వైభవాన్ని ప్రదర్శించుకోవడం అన్నమాట… పర్లేదు, ఎంతమందిని ఇంటికి పిలిచి మర్యాదలు చేయగలం, ఇవైతే అందరికీ ఇళ్లు చూపించినట్టు ఉంటుంది…
అయితే ఇప్పుడు కాస్త నవ్వొచ్చింది ఏమిటంటే..? జబర్దస్త్ జడ్జి రోజా హోం టూర్… ఆగండాగండి… చెన్నైలోని హోం మీద టూర్ వీడియోలు చాలా వచ్చినయ్… అంతెందుకు, హైదరాబాద్ ఇంటి మీద కూడా చాలామంది వీడియోలు చేశారు… కానీ ఏదీ ఆమె రేంజ్ ఆదరణను పొందలేదు… ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు… ఇక ఇలా కాదని ఈసారి ఏకంగా జబర్దస్త్ షోలోనే హోం టూర్ ప్లాన్ చేసింది… అదేమిటి..? ఇందులో కామెడీ ఏముంది..? జబర్దస్త్‌లో చూపించడానికి అని హాశ్చర్యపోయి, కిందపడిపోకండి…
Ads
ఆ మల్లెమాల కంపెనీ, ఆ ఈటీవీ కంపెనీ కలిసి… ఏదైనా సరే, కామెడీ పేరిట ప్రేక్షకుల నెత్తికి రుద్దగలవు… సవాల్ చేస్తారా, భీకరమైన హారర్ సీన్లను కూడా కామెడీ పేరిట అంటగట్టగలవు… పైగా రోజా అడిగాక కాదంటాయా అవి..? మామూలుగా ఇల్లు చూపిస్తే మజా ఏముంది..? హైపర్ ఆది, లేడీ గెటప్ శాంతి, పరదేశి, అజహర్, ఇంకెవరో లేడీ కమెడియన్‌తో ఓ టీం ఏర్పాటు చేసి (అందరూ ఆమె జడ్జిగా ఉన్న జబర్దస్త్ కమెడియన్లే) వాళ్లు తన ఇంటికి వచ్చినట్టుగా, వాళ్లకు తను ఇల్లు చూపించినట్టుగా ఓ వింత స్కిట్ రూపొందించారు… పైగా ఫస్ట్ టైమ్ హోం టూర్ ఆన్ టెలివిజన్ అని తాజా ప్రోమోలో టాంటాం కూడా మొదలెట్టేశారు… హతవిధీ అనకండి… కొన్ని… అవంతే…
కానీ ఏమాటకామాట… ఈ జబర్దస్త్‌లో హోం టూర్ ఏమిట్రా బాబోయ్ అన్నట్టు హైపర్ ఆదిలో కుతకుత ఉడికిపోయినట్టుంది… రోజా మీద భలే పంచులు వేశాడు… ఆమె మొదటిసారి కిచెన్‌లోకి వెళ్లడం, వీళ్ల కోసం టీ పెట్టడం, సాల్ట్ టీ పెట్టివ్వడం… ఎలా ఉంది అనడుగుతుంది… బాగుంది, కానీ టీ అయితే ఇంకా బాగుండేది అని ఆది పంచ్… కృష్ణ గారు కొడుకు మహేశ్ బాబుతో యాక్ట్ చేయాలని ఉంది అని రోజా దేవుడిని అడగడం, హాయిగా కృష్ణా రామా అనుకోకుండా మనకెందుకండీ ఈ కృష్ణ గారి కొడుకు, యాక్షన్ అని మరో సూపర్ పంచ్ ఆది నుంచి…
వంట గ్యాస్ వెలిగించి, ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు ఆనందపడుతోంది అని ఇంకో పంచ్… ఏమో చెప్పలేం, మరో జడ్జి మనో ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితే, పాపులర్ కమెడియన్ ఇంట్లో ఏ వోణీయో, ఏ పంచె కట్టించే ఫంక్షనో జరిగితే కూడా రేప్పొద్దున కామెడీ స్కిట్లుగా జబర్దస్త్‌లో కనిపించవచ్చు… కొన్ని అంతే…!! నాగబాబుతో, శేఖర్ మాస్టర్‌దో హోంటూర్ మాటీవీ కామెడీ స్టార్స్‌లో వచ్చే అవకాశం ఉందంటారా..? ఏమో, చెప్పలేం..!!
Share this Article