Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ సుమక్క మొగడే… తెలంగాణ యాస పలకబోయి అభాసుపాలు…

April 5, 2025 by M S R

.

[ Ashok Pothraj ] …….. రాజీవ్ కనకాల అలియాస్ సుమ మొగుడు… ప్రధాన పాత్రలో రూపొందిన ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. అనేది ’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ తర్వాత శేఖర్ మేడారంతో కలిసి నవీన్ మేడారం నిర్మించిన సిరీస్ ఇది. ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, యానీ కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ (నిన్న) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

 

Ads

కథ ఏమిటంటే..
తెలంగాణలోని ఓ పల్లె హన్మంతుల గూడెంలో ప్రసాద్ (రాజీవ్ కనకాల)కు ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. దానిపై వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని ముందుకు వెళ్లదీస్తుంటాడు. కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ )ను పై చదువుల కోసం ఫారిన్ పంపించాలనేది అతని కోరిక. విదేశాల్లో చదివిస్తే జీవితంలో బాగా సెటిల్ అవుతాడని ఆశ పడతాడు. స్కూల్ నుంచి కాలేజ్ వరకు… ప్రతి క్లాసులో శ్రీకాంత్ మార్కులు తక్కువే. అతని కంటే తర్వాత పుట్టిన జ్యోతి (యానీ) బాగా చదువుతుంది.

 

చెల్లెలు చదువులో దూసుకు వెళితే… శ్రీకాంత్ బీటెక్ ఫెయిల్ అవుతాడు. మరి తండ్రి కోరిక ఎలా నెరవేరింది? కుమారుడిని ఫారిన్ పంపించాలనే ప్రసాద్ కల తీరిందా? లేదా? కొడుకు కెరీర్ విషయంలో గొప్ప కలలు కన్న తండ్రి, కుమార్తెకు పెళ్లి చేయాలనుకుంటే… చివరకు ఏం జరిగింది? చెల్లెలి విషయంలో శ్రీకాంత్ ఏం చేశాడు? అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి.

అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు కానీ అది జరిగిన తర్వాత దాన్ని ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు – అని ‘ఖలేజా’ సినిమాలో డైలాగ్. తెలుగు ఓటీటీ వరకు ’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అటువంటి అద్భుతం.

‘ఈటీవీ విన్’లో విడుదల అయ్యేవరకు దానిని ఎవరూ గుర్తించలేదు. విడుదలైన తర్వాత ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఏర్పడలేదు. మధ్య తరగతి కుటుంబంలో పరిస్థితులు ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా తెలంగాణ యాసలో ఆ సిరీస్ తీశారు. ఇప్పుడు ఆ సిరీస్ గురించి ఎందుకు? అంటే… అద్భుతం ఒక్కసారే జరుగుతుంది. అటువంటి అద్భుతమే మళ్లీ చేయాలని ప్రయత్నిస్తే కాపీలా ఉంటుంది. ‘హోమ్ టౌన్’ విషయంలో అదే జరిగింది అని నేను అనుకుంటున్నాను.

కథ, క్యారెక్టర్లు, సన్నివేశాల పరంగా ’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’, ‘హోమ్ టౌన్’ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండూ వేర్వేరు అని చెప్పాలి. కానీ…! ‘హోమ్ టౌన్’తో వీక్షకులకు ’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సిరీస్ మేకర్స్ ట్రై చేశారు. ఆ ప్రయత్నంలో ఒరిజినాలిటీ మిస్ అయింది.

అన్నయ్య కంటే బాగా చదివే చెల్లెలు, కూతురు కంటే కుమారుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు, టీనేజ్ వచ్చేసరికి కోరికల గురించి తెలుసుకోవాలని ఆరాటపడే అబ్బాయిలు, సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ కారణంగా మోసపోయే అమాయకులు ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సినిమాలో చూసే ఉంటాం. వాటినే మళ్ళీ తెలంగాణ పల్లెను, 2003 – 2004 కాలానికి తీసుకువెళ్లాడు దర్శకుడు.

కథా నేపథ్య కాలం వల్ల కొన్ని కామెడీ సీన్లు నవ్వించాయి. గిల్ క్రిస్ట్ వాడిన బ్యాట్ స్ప్రింగ్‌తో చేయడం వల్ల ఎక్కువ స్కోరు చేశారని, ఆ కారణం చేత ఆస్ట్రేలియా 2003 వరల్డ్ కప్ నెగ్గిందని అప్పట్లో చాలా మంది నమ్మారు. ఆ సీన్, దాంతో పాటు స్వాతి బుక్ సీన్స్ కూడా కొంత మంది ప్రేక్షకులను నవ్విస్తాయి. మిడిల్ క్లాస్ నేపథ్యంలో భార్య భర్తల మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, కామెడీతో మూడు ఎపిసోడ్స్ సరదాగా ముందుకు వెళ్లాయి.

ఇక Abhaai B R కనబడతాడు. ఇంటర్నెట్ కెఫే నుంచి బిట్లు డౌన్ లోడ్ చేసుకుని వెళ్లి ఇంట్లోనే చాటుగా అదీ సౌండు మ్యూట్ లో పెట్టుకుని పాప్ కార్న్ వీడియోలు చూస్తూ ఆ తర్వాత పక్కింటికి వెళ్లి ప్రయోగాలు చేస్తుంటాడనుకోండి అది వేరే విషయం .

అలాగే Anji Valguman టీచర్ గా, ఎల్ఐసి ఏజంటుగా మెప్పించారు. అయితే ఫేస్ బుక్ అంటూ నాలుగో ఎపిసోడ్‌తో నీరసం తెప్పించారు. ఒక్క సన్నివేశంలో చెప్పే విషయాన్ని ఎపిసోడ్ అంతా సాగదీశారు. ఇక ఐదో ఎపిసోడ్ ఊహించడం వీక్షకులకు పెద్ద కష్టం ఏమీ కాదు. క్లైమాక్స్ ట్విస్ట్ సగటు ప్రేక్షకుల ఊహకు అందే విషయమే.

సురేష్ బొబ్బిలి అందించిన స్వరాలలో ‘ఏదో ఏదో…’ చాలా బాగుంది. మళ్లీ మళ్లీ వినేలా ఉంది. ఓటీటీలో ఇటువంటి మెలోడియస్ హిట్ సాంగ్స్ రావడం చాలా అరుదు. నేపథ్య సంగీతంలోనూ తన మార్క్ చూపించారు. కొన్ని సీన్లలో కామెడీ వర్కౌట్ కావడంలో ఆయన ఆర్ఆర్ కూడా హెల్ప్ చేసింది. ప్రొడక్షన్ వేల్యూస్ ఓటీటీకి తగ్గట్టు ఉన్నాయి. కెమెరా క్వాలిటీ లోపించిందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

కథతో సంబంధం లేకుండా తమ నటనతో రాజీవ్ కనకాల, ఝాన్సీ ఇచ్చిపడేశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయి. మిషన్ కుట్టడం ద్వారా వచ్చిన డబ్బును ఆదా చేసిన భార్య… పాలసీ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న భర్త చేతిలో పెడుతుంది. ఆ సన్నివేశంలో రాజీవ్ కనకాల వెనక్కి తిరిగి చూస్తారు. ఆ ఒక్క చూపు చాలు ఆయనలో నటుడిని మరోసారి మనకు గుర్తుచేస్తుంది‌.

దర్శకుడు Srikanth Reddy Palle ఆ సన్నివేశాన్ని బాగా తీశారు కూడా! ప్రజ్వల్ లో పల్లెటూరి కుర్రాడు కనిపించలేదు. ఆ అబ్బాయి మోడ్రన్ కిడ్ లాగ ఉన్నాడు. కొన్ని సన్నివేశాల్లో అతని నటన ఓకే. చెల్లెలుగా యానీ చక్కగా నటించింది. ప్రజ్వల్ స్నేహితులుగా నటించిన ఇద్దరు యువకులు బాగా నవ్వించారు. వాళ్లలో మంచి కామెడీ టైమింగ్ ఉంది.

’90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ‘హోమ్ టౌన్’ స్ట్రీమింగ్ స్టార్ట్ చేస్తే డిజప్పాయింట్ అవుతారు. దాంతో కంపేర్ చేయకుండా ఎటువంటి అంచనాలు లేకుండా చూస్తే, రాజీవ్ కనకాల – ఝాన్సీ గార్ల మధ్య సన్నివేశాలు మరికొంత మెప్పిస్తాయి.

ముఖ్యంగా రాజీవ్ కనకాల గారి ద్వారా తెలంగాణ యాసను పలికించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ యాసను ఆ పాత్రలతో పలికించడం కత్తి మీద సాము లాంటిది. దాన్ని సరిగ్గా వాడుకునుంటే ఒక రేంజ్ హిట్ టాక్ తో ముందుకు సాగిపోయేది. గతంలో “లగ్గం” అనే సినిమా కూడా అదీ తెలంగాణ కొన్ని పాత్రలతో ఈ యాసను పలికించలేకపోయింది. ఇది మన తెలంగాణ యాస భాషాభిమానులకు ఇట్టే అర్థం అవుతుంది.

ఇక పల్లెల్లో సాగే కథనాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. నిజానికి ఈ సినిమా మా పక్క ఊరు చందాయిపేటలో షూటింగ్ జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా అనిపించింది. పర్వాలేదు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions