Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ నల్లత్రాచును అంబానీ ఒడుపుగా పట్టి… పాతాళానికి తొక్కేశాడు ఇలా… (పార్ట్-2)

February 1, 2023 by M S R

స్టాక్ మార్కెట్లో బేర్ & బుల్ అన్న రెండు పేర్లతో వ్యాపారం నడుస్తూ ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాభపడినప్పుడల్లా బాంబే స్టాక్ ఎక్స్చేంజి ముందున్న ఎద్దుని చూపిస్తుంటారు మన వార్త చానెల్స్ వారు. దళారుల్లో పైన చెప్పిన రెండు రకాలు ఉంటారు. మను మానెక్ బేర్ కూటమికి (Bear Cartel) అధిపతి. స్టాక్ మార్కెట్లో ప్రవేశం ఉన్న అందరూ కూడా బుల్స్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే షేర్ ధరలు పెరిగినప్పుడు అందరూ లాభపడతారు.

బేర్స్ ప్రధానంగా షేర్ ధరలు పడడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. షేర్ ధరలు పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్ని అని విశ్లేషించి చెప్పడం అంత సులభం కాదు. ప్రకృతి వైఫల్యాలు, రాజకీయ అనిశ్చితి, యుద్ధాలు, కంపెనీల మధ్య అంతర్గత పోటీలు, కంపెనీలు తీసుకునే తప్పుడు నిర్ణయాలు, కంపెనీల ప్రదర్శన, లాభనష్టాలు, ప్రధాన బ్యాంకులు నిర్ణయించే వడ్డీ ధరలు, ముడిసరుకు సరఫరా, ఎక్కడో ఎదో దేశంలో జరిగే పరిణామాలు ఇలా ఎన్నో కారణాల చేత షేర్ ధరలు ప్రభావితమౌతాయి.

ఇవే కాకుండా మనుషుల దురాశ వల్ల కూడా షేర్ ధరలు పడిపోతాయి. అందుకు రెండు ఉదాహరణలు. రామలింగరాజు తమ కంపెనీ బాలన్స్ షీట్లలో తప్పుడు సమాచారం ప్రకటించి షేర్ ధర పెరిగేటట్టు చేసినట్టు వెల్లడించినప్పుడు సత్యం కంప్యూటర్స్ షేర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండో ఉదాహరణ నాలుగు రోజుల క్రితం అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ కంపెనీ అదానీ గ్రూప్ కంపెనీల మీద విడుదల చేసిన రిపోర్ట్ వల్ల షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన ఆదాని గ్రూపుకు చెందిన షేర్స్ ఒక్కసారిగా నేల మొహం చూసే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అందులో నాలుగు కంపెనీలు యథా స్థాయికి చేరుకున్నాయి, అది వేరే విషయం కనుక ఇక్కడ ప్రస్తావించట్లేదు.

Ads

ఈ రెండో ఉదాహరణనే తీసుకుంటే ఊహాజనిత పుకార్లు షేర్ ధరలు ఎలా ప్రభావితం అవుతాయో ఇప్పుడు అందరికి తెలుసు. మను మానెక్ లాంటి బేర్స్ డబ్బు సంపాదించడానికి షార్ట్ సెల్లింగ్ పద్ధతిని ఎన్నుకున్నప్పుడు, కొన్నిసార్లు లేనిపోని పుకార్లు సృష్టించి షేర్ ధరలు పడిపోయేటట్లు చేస్తారు లేదా తమకున్న ధన వనరులతో మార్కెట్లో లభ్యమయ్యే తాము ఎన్నుకున్న ఫలానా కంపెనీ షేర్లను అధికసంఖ్యలో కొని అమ్మడం వల్ల కూడా షేర్లను ఒడిదుడుకులు గురిచేస్తారు.

సామాన్య ప్రజలకు ఎందుకు ఆ షేర్ అంతగా ఒడిదొడుకులకు గురవుతుందో అర్ధంకాక ఈ బేర్స్ కు సహకరిస్తారు… పరోక్షంగా తమ వద్ద ఉన్న షేర్స్ అమ్మి… ఈ మను మానెక్ లాంటివారు తమకున్న పరపతితో ₹100 ఉన్న షేర్ ని ఒక్కవారంలో ₹1 స్థాయికి దిగజార్చగలరు. సామాన్యులకు అర్ధమయ్యేసరికి వారి పెట్టుబడి అవిరైపోయి ఉంటుంది. ఇలా నలభై ఏళ్ల క్రితం జరిగేందుకు ఆస్కారం ఉండేది. కారణం మన షేర్ మార్కెట్లు అప్పటికింకా పూర్తిగా ఎదగక పోవడమే. ఇప్పుడు మహా అయితే ఒక రోజులో ఏదైనా అనూహ్య పరిస్థితులు ఏర్పడితే షేర్ ధర ఇరవై శాతం దాటి పడకుండా ఆ షేర్లలో ట్రేడింగ్ ఆ రోజుకు నిలిపి వేస్తారు. 1980లలో మను మానెక్ శాసించినట్టు దలాల్ స్ట్రీట్ డాన్స్ చేసేది అంటే అతిశయోక్తి కాదు. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రతి బ్రోకర్, సబ్ బ్రోకర్ ఆయన చెప్పినదాన్ని పాటించేవారు. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉండేవికావు. అందుకు ప్రధాన కారణం ఆయన తెలివితేటల వల్ల అందరూ లబ్దిపొందడమే.

మను మానెక్ ను “స్టాక్ మార్కెట్ నల్ల త్రాచు” అని పిలవడానికి కారణం ఆయన వేసే ఖచ్చితమైన అంచనాలు మాత్రమే కాకుండా ఆయన తెలివిగా చేసే మోసాలు, స్కాంలు ఆయన్ను దోషిగా నిలబెట్టే అవకాశం లేకపోవడం వల్ల. హర్షద్ మెహతా స్కాం బహిర్గతం చేసిన సుచిత దలాల్  అభిప్రాయం ప్రకారం తెరవెనుక మను మానెక్ ఉన్నారని అంటారు కాని ఆధారాలు దొరికితే ఆయన పేరు నల్ల త్రాచు ఎందుకవుతుంది!

మను మానెక్ అన్నివిధాలా బలమైన స్థితిలో ఉన్నప్పుడు రిలయన్స్ అప్పుడే స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. రిలయన్స్ కంపెనీ ప్రాధమికంగా బలమైన పునాదుల మీద నిర్మింపబడుతోంది. మను మానెక్ మార్కెట్లో లభ్యమయ్యే రిలయన్స్ షేర్స్ మీద షార్ట్ సెల్లింగ్ తీసుకున్నారు. ధీరుభాయి అంబానికి ఈ విషయం తెలిసి తమ కంపెనీ షేర్ ధర పడిపోకుండా ఉండడానికి పెద్దకొడుకు సహవిద్యార్థి అయిన ఆనంద్ జైన్ ను నియమించారు. మను మానెక్ అమ్మకానికి పెట్టిన రిలయన్స్ షేర్లను ఆనంద్ జైన్ అతని టీం కొనడం ప్రారంభించింది.

ఆనంద్ జైన్ రిలయన్స్ షేర్లు కొనడం మొదలు పెట్టగానే రిలయన్స్ షేర్ ధర పెరగడం మొదలైంది. మను మానెక్ కు తెలిసిన ప్రతి బ్రోకర్/ సబ్ బ్రోకర్ వద్దనున్న రిలయన్స్ షేర్లను కొని రిలయన్స్ షేర్ల ధర పడిపోవాలని విశ్వప్రయత్నం చేశారు బేర్ కూటమి. కానీ ఆనంద్ జైన్ ఎన్ని లక్షల షేర్లు షార్ట్ సెల్లింగ్ కు వచ్చినా కొనడంతో మను మానెక్ అతని కూటమి సభ్యులు షేర్లను ఫిజికల్‌గా అప్పగించాల్సిన సమయం వచ్చినప్పుడు, అధిక ధర పెట్టి, రిలయన్స్ షేర్స్ కొని ఇవ్వాల్సి వచ్చేసరికి, వాళ్ల నష్టాలు వాళ్ళను అధః పాతాళానికి చేర్చే పరిస్థితి ఏర్పడింది. ధీరుభాయి అంబానీ ధాటికి తట్టుకోలేక మను మానెక్ తెల్ల జెండా ఊపాల్సి వచ్చింది…… సుబ్రహ్మణ్యం వల్లూరి…. 

(స్టాక్ మార్కెట్ అంటేనే ఇలాంటి దందాలు… హిండెన్ బర్గ్ కూడా షార్ట్ సెల్లింగులో దిట్టలు… అదానీకే గురిపెట్టింది ఆ కంపెనీ… ఈ కథనానికి అదే నేపథ్యం…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions