ఓ మిత్రుడి సోషల్ వాల్ మీద కనిపించింది… సారాంశం ఏమిటంటే..? ‘‘నువ్వు-నేను’’ అనే హిట్ సినిమా… అందులో ఓ సన్నివేశం… క్లాస్ రూం… కమెడియన్ సునీల్ లేచి నిలబడి ఏదో చెబుతుంటే, ఓ అమ్మాయి తన మొహం చాటుచేసుకుంటూ… ‘మూసుక్కూచోరా పూలచొక్కా’ అంటుంది… ఎవరన్నారో తెలియదు సునీల్‌కు… ‘‘ఇక్కడ ఎవరో నన్ను పూలచొక్కా అన్నారు, లెక్చరర్ వచ్చి నాకు క్షమాపణ చెప్పేదాకా ఊరుకునేది లేదు’’ అని కస్సుమంటాడు… ‘‘ఓహోహో, ఇది మరీ బాగుంది… కొత్త టెన్షన్లు పెట్టకు బాబూ’’ అని ధర్మవరపు సుబ్రహ్మణ్యం తనదైన స్టయిల్లో ముక్తాయిస్తాడు…
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే మరి..? రామతీర్థంలో ఎవడో రాముడి తల నరికితే… నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం అర్జెంటుగా అశోకగజపతిరాజు మీద వేటు వేసింది… ఇదేమిటీ, ఆయనకూ దానికీ సంబంధం ఏమిటంటారా..? ఆ గుడితోపాటు మరో రెండు గుళ్లకూ ఈయన గారు ట్రస్టీ అట… గుడి నిర్వహణలో ఫెయిలయ్యాడు కాబట్టి వేటు వేశారట… యమర్జెంటుగా ఓ మెమో జారీ చేసింది ప్రభుత్వం… బహుశా ఇంత షాక్ ఆయన తన జీవితంలో తిని ఉండడు…
Ads
ఒక ట్రస్టీ ఏం చేస్తాడు..? గుడి నిర్వహణ బాధ్యత నిజానికి ఎవరిది..? ఇక్కడ కొన్ని ప్రశ్నలు…
- ఈయన్ని ధర్మకర్త పోస్టుల నుంచి పీకిపారేశారు సరే… మరి జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా సంఘటనలు జరిగాయి కదా… మరి ఆయా గుళ్ల ట్రస్టులను పీకిపారేయలేదేం..?
- సంచయిత రాకముందు అనేక గుళ్లకు ఇదే అశోకగజపతిరాజు ధర్మకర్త… అంత పెద్ద మాన్సాస్ ట్రస్టు, సింహాచలం గట్రా గుళ్లకూ చైర్మన్… మరి అప్పుడు జరగని సంఘటనలు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నయ్..?
- అసలు గుళ్లలో రక్షణ చర్యలు దేవాదాయ శాఖ బాధ్యత కాదా..? ఆ ప్రాంత గుళ్ల పర్యవేక్షణాధికారిని పీకేయాలి కదా మరి..? అదెందుకు చేయలేదు..?
- అసలు నైతిక బాధ్యత వహించాల్సింది దేవాదాయ మంత్రి కదా… మరి తననెందుకు ఉపేక్షిస్తున్నట్టు..? పైగా తను మంత్రి బొత్సతో కలిసి గుట్ట ఎక్కి, ఆ ఏరియా పరిశీలిస్తారట… ఏమో, ఆ ఇద్దరూ క్లూస్ కోసం వెతుకుతారేమో… నిందితులు ఎవరో చెప్పేస్తారేమో…
- గుళ్ల ఆదాయం అంతా సుబ్బరంగా భోంచేస్తున్నది ప్రభుత్వమే కదా… మరి వాటి రక్షణ బాధ్యత ఎవరిది..? ప్రభుత్వమంటే ఎవరు..? అశోకుడు ఫాఫం, ప్రభుత్వంలో లేడు కదా…!
- పోనీ, శాంతిభద్రతల రక్షణ బాధ్యత ఎవరిది..? ఇవన్నీ కావాలని సమాజంలో అశాంతిని రేకెత్తించడం కోసమే కదా… వాళ్ల మీద ఏం చర్యలు తీసుకున్నారు..? అసలు వాళ్లు ఎవరు..?
- నో, నో, ఇవన్నీ చంద్రబాబు పనే అని సాక్షి తన రాతల్లో తీర్మానించేసింది… ఏయే విగ్రహభంగాల్లో చంద్రబాబు బ్యాచ్ ఏ మోడస్ ఆపరెండితో కదులుతున్నదో తెలుసుకోలేని గుడ్డిదా జగన్ సర్కారు..? ముందే కట్టడి చేయలేని అసమర్థతా..? ఆధారాలుంటే పీడీ యాక్ట్ కింద ఆయన్నే లోపలేయండి… ఎందుకు భయపడుతున్నాడు జగన్..?!
- సో.., ఇకపై గుళ్ల ధర్మకర్తలు అర్జెంటుగా నాలుగు దుడ్డుకర్రలు కొనుక్కుని, రోజూ రాత్రిపూట విగ్రహాలకు కాపలా కాయాలా..? ఏదైనా జరిగితే ఊస్టింగేనా..? కొన్నిసార్లు జగన్ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిదీ చంద్రబాబు మెడలో వేయడానికి సాక్షి రాసే రాతలు మస్తు నవ్వు పుట్టిస్తాయి… అందులోనే కొంత జాలి కూడా కలిసి ఉంటుంది…!!
చివరగా :: దేవాదాయ శాఖ పరిధుల్లో లేని ప్రైవేటు గుళ్లలో మాత్రమే ఈ అరాచకాలు సాగుతున్నట్టు సాక్షి ఓ పిచ్చి వార్తను వండింది… దేవాదాయ శాఖ పరిధిలో లేకపోతే అశోకగజపతిరాజును ట్రస్టీగా తొలగిస్తూ, ఆ శాఖ ఎందుకు మెమో జారీ చేసినట్టు..? ఆ శాఖ పరిధిలో లేకపోతే, ఈమధ్య సీసీ కెమెరాలను ఎందుకు పెట్టిస్తున్నట్టు..? అసలు ట్రస్టు బోర్డును ఎందుకేసినట్టు..? జనాన్ని పిచ్చోళ్లను చేయడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే కాదు, సాక్షి వాటికి తాత..!!!
Share this Article