……… By…… పార్ధసారధి పోట్లూరి……… ఏవియేషన్ పరిశ్రమ అంటే క్వాలిటీతో పాటు నిత్యం పరిశీలన అవసరం ఉంటుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అది తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ ప్రమాదం మీద విపులంగా ఒక విశ్లేషణ చేస్తాను. అదీ చివరి నిముషంలో దొరికిన వీడియో ఫుటేజ్ ఆధారం చేసుకొని చేస్తున్న ప్రయత్నం… Mi -17 V5 రవాణా హెలికాప్టర్ అధునాతన ఎవియానిక్స్ ని కలిగిఉంది. ప్రపంచవ్యాప్తంగా 96 దేశాలు ఈ హెలికాప్టర్ ని ట్రూపులని ఒకచోట నుండి ఇంకోచోటుకి తరలించడానికి వాడుతున్నారు. అలాగే కొద్దిపాటి లగేజీని కూడా వెంట తీసుకొని పోతుoది. గత 20 ఏళ్లుగా చాలా దేశాల సైన్యానికి నమ్మకంగా సేవలు అందిస్తున్నది. మరి నీలగిరి కొండల్లో ఎందుకు కూలిపోయింది ? ఇది తెలియాలంటే ముందు ఇలాంటి ప్రమాదం గురించి వివరంగా తెలుసుకుంటే మిగిలిన విషయం తేలికగా అర్ధం అవుతుంది .
2018 సెప్టెంబర్ నెలలో అమెరికాలోని MCAS Beaufort కి దగ్గరలో అమెరికన్ F-35B కూలిపోయింది. F-35 మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది 2006 లో అయితే 2018 లో మొదటిసారిగా పైలట్ ఎజెక్టింగ్ సీట్ వాడాల్సి వచ్చింది. ఇక విమానాన్ని కంట్రోల్ చేయలేను అన్న స్థితిలో మాత్రమే పైలట్ ఎజెక్ట్ ఆప్షన్ వాడతాడు. కానీ ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్ గా పిలవబడుతున్న F -35 మరి కొద్ది నిముషాలలో లాండ్ అవబోతున్న సమయంలో కూలిపోయింది. అయితే అదే చివరిసారి కాదు F-35 కూలిపోయిన ఘటన. 2020 లో జపాన్ కి చెందిన F -35 కూడా పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. ఎలాంటి సందేశం ఇవ్వలేకపోయాడు జపాన్ పైలట్ కూలిపోయేముందు. అంటే సందేశం ఇంచ్చేంత సమయం కూడా లేకుండా కూలిపోయింది అన్నమాట.
ఈ ప్రమాదాల మీద విచారణ చేసిన పెంటగాన్ లోపం ఎక్కడ ఉందో కనుక్కుంది. F-35 ఇంజిన్ కి ఇంధనం సరఫరా అయ్యే ఒక పైప్ లో లోపం ఉన్నట్లు కనుక్కుంది. ఆ పైప్ తయారు చేసిన కంపెనీ వాటికి బాచ్ నంబర్ ఇస్తుంది. ఆ బాచ్ నంబర్ కలిగిన అన్ని పైప్ లు కూడా లోపాలు ఉన్నవే. అంటే క్వాలిటీ కంట్రోల్ లోనే లోపం ఉంది అన్నమాట. విషయం వెంటనే F-35 ని ఉపయోగిస్తున్న అన్ని దేశాలకి తెలిపి అన్ని F-35 లని రెండు వారాల పాటు నిలిపివేసి, లోపాలున్న బాచ్ నంబర్ కలిగిన అన్ని ఇంధన పైపులని మార్చిన తరువాతే మళ్ళీ ఎగరడానికి అనుమతి ఇచ్చారు.
Ads
1.ఇంధన పైపులు వాటి పనితీరు ఎలా ఉంటుంది అంటే ఒత్తిడితో ఇంధనం ఇంజిన్ లోకి వెళ్తుంది. ఎప్పుడయితే ఒక చోట ఇంధనం సరఫరాలో లోపం ఏర్పడుతుందో వెంటనే ఇంజిన్ తన శక్తిని కోల్పోతుంది. అదే సమయంలో కూలిపోతుంది.
2. ఇక రష్యా విషయానికి వస్తే సుఖోయ్, మిగ్ యుద్ధ విమానాలకి లోపాలు ఉన్న విడి భాగాలు సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే వస్తున్నది. పైలట్ తప్పిదం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది కానీ స్పేర్ పార్ట్స్ లోపాల వల్ల Sukhoy Su -౩౦ MKI,MIG -29 K [కారియర్ వెర్షన్ ] కూలిపోయిన సంఘటనలే ఎక్కువ.
౩.గత సంవత్సరంగా కోవిడ్ వల్ల చాలా రష్యా పరిశ్రమలు మూతపడ్డాయి. ఇప్పటికి నడుస్తున్నవి అతి తక్కువ సిబ్బందితో నడుస్తున్నాయి కాబట్టి స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ, వాటి క్వాలిటీ కంట్రోల్ విషయంలో కానీ అశ్రద్ధ వహించి ఉండవచ్చు. క్వాలిటీ విషయంలో అమెరికన్ కంపనీలు తీసుకునేంత శ్రద్ధ రష్యన్ పరిశ్రమలు తీసుకోవు. ఇప్పటివరకు స్పేర్ పార్ట్స్ కానీ, డిజైన్ విషయంలో కానీ లోపాలు ఉన్నాయి అని రష్యా తాను సరఫరా చేసిన ఆయుధాల విషయంలో వెనక్కి రప్పించి వాటిని సరిచేసి మళ్ళీ ఇచ్చిన రికార్డ్ అయితే లేదు.
4. Mi-17 V5 హెలికాప్టర్ల విడి భాగాలు లోపాలు ఉన్నాయో లేదో తెలీదు కానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం అనేది మాత్రం ఇంజిన్ కి సరఫరా అయ్యే ఇంధనం ఆగిపోవడం వల్లనే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది మార్చాల్సిన స్పేర్ పార్ట్స్ మార్చి ఉండకపోయి ఉండవచ్చు. అఫ్కోర్స్ ఏ పార్ట్ మార్చకపోతే ప్రమాదం జరుగుతుందో వాటిని నిత్యం నిర్వహించే సిబ్బందికి తెలుసు కాబట్టి విద్రోహ చర్యలో భాగంగా కావాలనే చేసి ఉండవచ్చు. తోసిపుచ్చలేం.
5. ఇక పైలట్స్ కి సూలూరు ఎయిర్ బేస్ నుండి వెల్లింగ్టన్ మిలటరీ అకాడెమికి వెళ్ళే మార్గం కొట్టిన పిండి. ఆ పరిసరాలు ఏ ప్రదేశంలో కొండలు ఎంత ఎత్తులో ఉంటాయి, అలాగే ఆ కొండల మీద ఉండే వృక్షాల ఎత్తు ఎంత అనే అవగాహన ఉంది కాబట్టి చెట్లని డీకొట్టి కూలిపోవడం అనేది జరగదు. బహుశా ఆ ప్రాంతం దగ్గరకి వచ్చేసరికి ఇంధన సరఫరాలో లోపం ఏర్పడి కూలిపోయి ఉండవచ్చు. (ఒక ప్రాబబులిటీ)…
6. Mi-17 V5 హెలికాప్టర్లని నడపడానికి ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్ ఇంజినీర్ ఉన్నారు. ఒకసారి గతంలోకి వెళ్లి చూస్తే బోయింగ్ కానీ ఎయిర్ బస్ ప్రయాణికుల విమానాలు నడపడానికి కానీ ప్రధాన పైలట్ తో పాటు కో పైలట్ లు ఇద్దరు కాకుండా ఫైట్ ఇంజినీర్ కూడా ఉండేవాళ్ళు. ఆటోమేషన్ లో భాగంగా ప్రస్తుతం ఫ్లైట్ ఇంజినీర్ ఉండడం లేదు. అన్నీ కెప్టెన్ , కో పైలట్లు చూసుకుంటున్నారు. కానీ Mi-17 V5 హెలికాప్టర్ల విషయంలో ఫ్లైట్ ఇంజినీర్ కూడా ఉన్నాడు అంటే ఎంత జాగ్రత్తగా డిజైన్ చేసారో తెలిసిపోతుంది. Mi-17 V5 హెలికాప్టర్ల లు కూడా ప్రయాణీకులు లేదా యుద్ధ సామాగ్రిని తరలించడానికే వాడుతున్నారు. అవసరం అయితే ఎయిర్ అంబులెన్స్ గా మార్చి వాడుకోవచ్చు. అలాంటిది ఇంజిన్ లో లోపం వస్తే సరి చేయడానికి లేదా సూచనలు ఇవ్వడానికి ఫ్లైట్ ఇంజినీర్ ఉంటాడు కానీ అలా ఎలా కూలిపోయింది ? అఫ్కోర్స్ ఇంధనం సరఫరాలో లోపం వస్తే ఏదన్నా ఒక ఇంజిన్ ని ఆపేసి రెండో ఇంజిన్ తో ప్రయాణం కొనసాగించవచ్చు. Mi-17 V5 హెలికాప్టర్లకి రెండు ఇంజిన్లు ఉంటాయి. మామూలు ప్రయాణీకుల విమానాలలో కూడా రెండు లేదా నాలుగు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ లో లోపం వస్తే దానిని ఆపేసి ఎమర్జన్సి లాండింగ్ కోసం దగ్గరలోనే ఉన్న ఏదన్నా ఎయిర్ పోర్ట్ ATC కి సమాచారం ఇచ్చి, అనుమతి తీసుకొని లాండ్ చేసిన ఘటనలు కోకొల్లలు. ఎమర్జెన్సి లాండింగ్ కోసం శత్రు దేశాలు కూడా అనుమతి ఇస్తాయి.
7. ఇక సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణ లేజర్ గన్ తో హెలికాప్టర్ ని కూల్చవచ్చు అని… ఇది బేస్ లెస్ ఆరోపణ. లేజర్ గన్ వాడాలంటే హెవీ ట్రక్కులు రెండు కావాలి కానీ ఆ సౌలభ్యం మిలటరీకి తప్పితే వేరే వాళ్లకి సాధ్యం కాదు. అయినా ఆ టేక్నాలజీ ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే పూర్తి స్థాయిలో అమలులో ఉన్నది. ఇజ్రాయెల్ తన పౌర విమానాలకి లేజర్ గన్ ని అమర్చడం ఎప్పటి నుండో చేస్తున్నది. అది కూడా మిసైల్ ని ఎవరయినా ప్రయోగిస్తే దానిని దూరం నుండే లేజర్ గన్ తో ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ విమానాలు హైజాక్ అవడమో లేదా భూమి మీద నుండి మిసైల్ ప్రయోగించి కూల్చివేస్తారనో ముందు జాగ్రత్తగా తన పౌర విమానాలకి ఏర్పాటు చేసుకుంది. అయితే దీనికి చాలా పరిమితులు ఉన్నాయి.
8.ఇక మిగిలింది డ్రోన్ ఉపయోగించి హెలికాప్టర్ ని నేరుగా రోటేటర్ మీదకి ప్రయోగించి కూల్చవచ్చు. కానీ సంఘటన స్థలంలో ఎలాంటి డ్రోన్ విడి భాగాలు దొరకలేదు. అదీ కాక దట్టమయిన మంచు ఉన్నప్పుడు కింద ఉన్న డ్రోన్ ఆపరేటర్ ఖచ్చితంగా హెలికాప్టర్ మీదకి ఎగురవేయడం సాధ్యం కాదు.
9. పైలట్ తప్పిదం ఉండక పోవచ్చు. ఎందుకంటే పైలట్ కి హెలికాప్టర్ నడపడం మీద నైపుణ్యం చూసి శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది సైన్యం. కాబట్టి పైలట్ తప్పిదం ఉండబోదు. ఇక మిగిలింది ఫ్యూయల్ సప్లై అయ్యే వ్యవస్థని ఉపయోగించి ఉండవచ్చు.
ఆయుధ దళారీ లాబీ పాత్ర ?
త్రివిధ దళాలకి కావాల్సినది ఏదయినా సరే దిగుమతుల మీద పరిమితులని విధించారు బిపిన్ రావత్. తప్పనిసరి అయితేనే విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి తప్పితే మన దేశంలోనే వాటికి ప్రత్యామ్నాయం దొరికితే అవి కొని వాడాల్సింది అని నిబంధనని అమలు చేసారు బిపిన్ రావత్. 1960 ల నుండే ఆయుధాల కొనుగోళ్లలో దళారీ వ్యవస్థని పెంచి పోషించింది కాంగ్రెస్. చివరికి జత మిలటరీ గ్రేడ్ బూట్ల ధర కాన్పూర్ లో 26 వేలకి దొరుకుతుంటే, అదే కాన్పూర్ లోని సంస్థ ఇజ్రాయెల్ కి సరఫరా చేస్తుంది కూడా. మన వాళ్ళు అవే బూట్లని ఇజ్రాయెల్ నుండి లక్షా 25 వేలకి దిగుమతి చేసుకునే వారు. మనోహర్ పారిక్కర్ గారు రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే అధికారులని ప్రశ్నించారు ఇలా ఎందుకు జరుగుతున్నది అని… దానికి అధికారులు కాన్పూర్ సంస్థలు మన మిలటరీ టెండర్ లలో పాల్గొనవు అన్నారు. ఒకవేళ పాల్గొని టెండర్ దక్కినా మామూళ్లు ఇవ్వాలి, అయినా బిల్లులు సకాలంలో ఇవ్వరు, కాబట్టి స్థానిక సంస్థలు ఇష్టపడట్లేదు అని కూడా నిజం చెప్పారు. మనోహర్ గారు స్థానిక సంస్థలకి భరోసా ఇచ్చి, అవే బూట్లని 16 వేలకి సరఫరా చేసేట్లు ఒప్పందం చేస్తుకున్నారు. అలాంటిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పోతుంటే ఈ ఆయుధ దళారీ లాబీ చూస్తూ కూర్చోదు కదా ? ఏమో చెప్పలేము… ఇదే ఆయుధ దళారీ లాబీ ఓ 100 కోట్లు అవలీలగా ఖర్చు పెట్టగలదు హత్య చేయించడానికి ప్రలోభ పెట్టి… దశాబ్దాలుగా పాతుకుపోయిన ఆయుధ లాబీ గత 6 ఏళ్ళుగా రూపాయి కూడా ఆదాయం లేకుండా ఖాళీగా ఉంటున్నాయి అంటే బిపిన్ రావత్ గారి మరణం వెనుక వీళ్ళ హస్తం ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో అప్పటి భారత్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ త్యాగి పేరు కూడా ఉంది అంటే వీటి ఊడలు త్రివిధ దళాలలో ఎంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు…
Share this Article