అజ్ఞానంతో… నిజంగానే అజ్ఞానంతో వేస్తున్న ప్రశ్న… అయ్యా, ఆదిశేషగిరిరావు గారూ… మరణించిన మీ సోదరుడికి ప్రజాస్మశానంలో (మహాప్రస్థానం) దహనక్రియలు నిర్వహించారు కదా… మరి సమాధి ఎక్కడ కడతారు..? ఇంకెక్కడో కడితే దాన్ని సమాధి అనాలా..? స్మారకం అనాలా..? అసలు కృష్ణ అంత్యక్రియలకు సంబంధించి వింత నిర్ణయాలతో ఇప్పటికే బోలెడన్ని విమర్శలు మూటకట్టుకున్నారు… మళ్లీ కొత్తగా ఇదేమిటి..?
మరీ అత్యున్నత యోగసాధన పరిభాషలో సమాధి స్థితి అంతే వేరు… అటువైపు వెళ్లడం లేదు… మామూలుగా హిందువుల్లో అంత్యక్రియలు రెండు రకాలు… దహనం, ఖననం… దహనం తరువాత అస్థికల పరిస్థితి ఏమిటి..? ఏమీలేదు… అలవాటు, ఆనవాయితీ, ఆచారం ప్రకారం ఏదైనా నదీప్రవాహంలో నిమజ్జనం చేసి, అంతిమ నమస్కారం అర్పించడమే… మరీ దైవత్వాన్ని సంతరించుకున్న ప్రముఖులైతే వారి శరీరభాగాలను నలుమూలలకూ తీసుకెళ్లి ప్రార్థన స్థలాలే కట్టేశారు… అది అత్యున్నత స్థితి…
కొందరు తమ సొంత భూముల్లో గనుక దహనం చేస్తే… అదే ప్లేసులో సమాధిలాగా చిన్న నిర్మాణం కట్టేసి, స్మారకంగా మారుస్తారు… ఎప్పుడైనా అక్కడికి వెళ్లి నివాళి అర్పిస్తారు… సరే, ఆ బూడిద, మిగిలిపోయిన చిన్న అస్థికలే ఆ సమాధికి ఆధారం అనుకుందాం… మొన్నటి కరోనా సీజన్‌లో దేశంలోని స్మశానవాటికల్లో లక్షల శవాల అస్థికలను గురిగుల్లో (చిన్న కుండలు) భద్రపరిచారు… తీసుకుపోయేవాడు లేడు… బూడిదను ఎప్పటికప్పుడు కడిగేశారు…
Ads
గంగలో శవాన్ని కాల్చేసి, నదిలోకి తోసేస్తారు… ఖతం… ఒక మతంలో శవాన్ని గద్దలకు వదిలేస్తారు… ఇలా రకరకాలు… మొన్న పునీత్ రాజకుమార్ అంత్యక్రియల తరువాత ఓ స్మారకాన్ని ఏర్పాటు చేశారు… ఇప్పటికీ నమ్మ అప్పు అంటూ లక్షల మంది అభిమానులు వచ్చివెళ్లడానికి వీలుగా సపరేట్ వ్యవస్థను క్రియేట్ చేశారు సోదరులు… అక్కడికి వెళ్తే పునీత్ జ్ఞాపకాలు చుట్టుముడతాయి… హైదరాబాద్‌లో ఎన్టీయార్ సమాధి ఉంది… అక్కడే అంత్యక్రియలు జరిగాయి… దాన్నే అలా డెవలప్ చేశారు… పీవీ స్మారకం కూడా అంతే… ఏఎన్నార్‌కు ఏమీ లేదు…
కృష్ణకు సొంత స్థలంలో అంత్యక్రియలు జరపలేదు గానీ సమాధి కడతాం, స్మారకం కడతాం అంటూ ఇప్పుడు ఏవేవో కవరింగులు… విజయవాడలో గానీ, తెనాలిలో గానీ జగన్ స్థలం ఇస్తే గానీ విగ్రహం పెట్టలేరా..? పద్మాలయా స్టూడియోలో కనీసం విగ్రహం కూడా ఏర్పాటు చేయలేరా..? ఫిలిమ్‌నగర్‌లో కేసీయార్ స్థలం ఇస్తే స్మారకం కడతారా..? మహాప్రస్థానంలో దహనక్రియలు నిర్వహించి, సర్కారు స్థలం ఇస్తే సమాధి కడతారా..? ఇదెక్కడి వైపరీత్యం..?
నిజం… కృష్ణకు లక్షల మంది హార్డ్ కోర్ అభిమానులున్నారు తెలుగునాట… తను మరణించినా సరే, తన జ్ఞాపకాలు చాన్నాళ్లు అలాగే ఉంటాయి… తన జ్ఞాపకాలు గుర్తొచ్చేలా ఓ స్మారకం అవసరమే… తెలుగు సినిమాకు సంబంధించి కృష్ణది ఓ చరిత్ర… వాటిని పదిలంగా ఉంచాలి… ఎటొచ్చీ ఆ కుటుంబం వ్యవహారధోరణి, చేస్తున్న ప్రకటనలే గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి… ఎవరి మీద స్మారకం నిర్వహణకు ఆధారపడకుండా, ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వరకూ బాగుంది… కానీ ఆచరణలో పూర్తి భిన్నంగా వెళ్తున్నారు, నమ్మేదెలా ఆ కృష్ణకు తమ్ముడు గారూ…!?
Share this Article