‘‘భీముడు ఎదురుగా నిలబడగానే పాలకటకంటి అతని రెండు భుజాలను బిగువుగా పట్టుకుంది… అదే శక్తిమంతమైన చేతిపట్టు… అనంతరం ఒళ్లూ, చేతులూ, ముఖాలను తన రెండు చేతులతోనూ తడిమి, నిమిరి, ఉన్నట్టుండి పక్కకు అడుగువేసి వీపు మీద ఏడెనిమిదిసార్లు గుద్దింది… ముఖం బిరుసెక్కింది… కళ్లు ఎరుపయ్యాయి… నోట్లో ఊరకే భీమ, భీమా అనుకుంటూ రెండు చేతుల్ని పిడికిళ్లు బిగించి గుద్దింది… అతను ఊరకే తలవంచి నిల్చున్నాడు… పిడికిలి సడలించి వీపు మీద, రెట్టల మీద ఫటఫటా పదే పదే కొట్టింది…
ఎర్రటి వడిసెలతో కొట్టినట్టు, అతను కిక్కురుమనలేదు… చివరకు కొట్టడం ఆపి అతని ఎదుట వచ్చి నిలబడింది… తానే రెండు చేతులతో , వాలిన అతని ముఖం ఎత్తిపట్టుకుని పైకెత్తి, తన చూపుల్ని అతని చూపుల్లోకి సంధించింది… ఉన్నట్టుండి ఆమె కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి… భీమ భీమ అని పలవరిస్తూ దుఖం పెరిగిపోయి అతని కుడిభుజం మీద మళ్లీ ఒకటి గట్టిగా అంటించింది…’’
అవును, చాలా ఏళ్ల తరువాత మళ్లీ తనను వెతుక్కుంటూ తన రాజ్యంలోకి, తన పాలనలోని దట్టమైన అడవిలోకి వచ్చిన భీముడి పట్ల హిడింబి స్పందన ఇదే… ఎంత బాగుంది పాత్ర చిత్రణ..? వేల ఉపకథలు, వేల కళారూపాలు, వేల ప్రదర్శనలు, వందల భాషల్లో చెప్పబడుతూనే ఉన్న మహా గ్రంథం మహా భారతం… రకరకాల ప్రక్షిప్తాలు, ఏది ఒరిజినలో ఎవరికీ తెలియదు… ఏమో, బహుశా అప్పటి కాలమాన స్థితుల్లో ఇలా జరిగి ఉండవచ్చునేమో అనే కల్పనాత్మక, ఊహాత్మక రచనే ఎస్.ఎల్.భైరప్ప రాసిన పర్వ… అపూర్వమైన పుస్తకం…
Ads
ఏ పాత్రనూ కించపరచడు… అంతేకాదు, సగటు మనిషికి తలెత్తే అనేక సందేహాలకు జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు తను… మాస్టర్ పీస్… హిడింబి స్పందనే చూడండి… ఆమె చర్యలో కోపం ఉంది, ప్రేమ ఉంది, దుఖం ఉంది, కలగలిసిపోయిన పలు ఉద్వేగాలను అలా బహిర్గతం చేసేసింది అక్కడే… అవి శిక్షించడం కాదు… అదొక అసంకల్పిత ప్రేమపూరిత చర్య… వాళ్లదీ ఒక జాతి… వాళ్లకూ ఓ రాజ్యం, అక్కడ కట్టుబాటు ఉంది, వాళ్లకంటూ నియమావళి ఉంది, ఆమె రాణి… వాళ్ల వ్యక్తీకరణలు వేరు… దాన్నే హిడింబి చర్య మనకు పట్టిస్తుంది… నోటికొచ్చినట్టు రామాయణం, భారతం, భాగవతం వంటి వేల ఏళ్ల పురాణాలను భ్రష్టుపట్టించడం కాదు… (ఆదిపురుష్ సినిమా గ్రాఫిక్ దరిద్రుల తరహాలో…) పదిమందీ మెచ్చేలా చెప్పాలి…
ఇక్కడ భీముడిదే అవకాశవాదం… తన ప్రేమలో నిజాయితీ లేదు… ఐనా సరే, ఆమె క్షమించింది… మొదటిసారి చూసి, మోహించి పెళ్లి చేసుకున్నప్పుడే తన వాడు అనుకుంది… ఫిక్స్… తనే చెబుతుంది కథలో… ‘‘నీకు మా రాక్షసులంటే ఎందుకంత కక్ష…? అంతా మావాళ్లనే చంపుతున్నావట… అదేదో పెద్ద యుద్ధం జరగబోతోందట కదా… నీకు వ్యతిరేకంగా మావాళ్లందరూ ఒక్కటవుతున్నారు… నీ కొడుకు ఘటోత్కచుడే వాళ్లకు నాయకుడు… ఓరోజు పిలిచి చెప్పాను, మీ తండ్రి ఆయనే, వేరే ఎవరినీ పెళ్లాడలేదు… రాణిని కదా, ఎక్కువ మంది పిల్లలుండాలి… ఆ పిల్లల కోసం వేరే వేళ్లతో ఉన్నాను, మీ తమ్ముళ్లు పుట్టారు… నా తండ్రి అయితే నన్ను చూడటానికి ఒక్కసారీ ఎందుకు రాలేదని అడిగాడు ఘటోత్కచ… వచ్చినప్పుడు అడుగు అన్నాను… ఏం చెబుతావో చెప్పుకో…’’
భీముడి దగ్గర జవాబు లేదు… నాడు ఆ దట్టమైన అడవిలో రక్షణ కోసం ఆమె కావల్సి వచ్చింది… వదిలేసి వెళ్లిపోయాడు… మళ్లీ ఇప్పుడు ఘటోత్కచుడి సాయం కావాలి కాబట్టి వచ్చాడు, అంతే తప్ప హిడింబి కోసం కాదు, కొడుకు కోసం కాదు, వాళ్ల ప్రేమ కోసం కాదు… అందుకే తలదించుకున్నాడు… ఆమె భీముడి కోసం కొడుకును రణరంగానికి పంపింది… కులం అభీష్టానికి వ్యతిరేకంగా… భీముడు ఏం చేశాడు..? ఈ ప్రశ్న మనల్ని కొంతసేపు వేధిస్తూనే ఉంటుంది… జస్ట్, ఆ మూడునాలుగు పేజీల కథనానికే…!!
Share this Article