.
నాకు తెలిసిన అందెశ్రీ …. ముఖ్యమంత్రి గారి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు, అందెశ్రీ గారిని పరిచయం చేస్తూ అన్నమాట…. “ఈయన ఎవరిమాట వినడు, మనం వారి దారికి రావల్సిందే, మొండోడు, మా అన్న” అని.
అందెశ్రీ గారు దానికి ప్రతిగా “తమ్ముడు అయోధ్య, నన్ను బద్నాం చేయడమే పనా, నా మొండితనం ఆత్మగౌరవమే కానీ, ఎవర్నీ తక్కువ చేయడానికికాదు, అయినా నా మొండితనం వల్ల ఎవరు నష్టపోలే, పోతే నేనే నష్టపోయాను”… (చనువుతో కూడిన సరదా పరిచయం)
Ads
జయజయహే తెలంగాణను జాతిగీతంగా ఆవిష్కరించే క్రమంలో అంతకుముందే తెలిసిన అందెశ్రీ గారు మరోసారి పరిచయమయ్యారు.
- అందేశ్రీ అంటే గొప్ప కవి, వాగ్గేయకారుడిగానే చాలా మందికి తెలుసు. నాకు తెలిసిన అందెశ్రీ నిఖార్సయిన మనిషి. నూటికో కోటికో ఎప్పుడో ఒకసారి తళుక్కున మెరిసే కాంతిపుంజం. తనకు ఆచ్ఛాదనలేసుకొని లౌక్యంగా మాట్లాడ్డం తెలియదు, ముసుగులుండవు. మధ్యేవాదం ఆమడ దూరం. ఏ విషయమైనా నచ్చడమో , నచ్చకపోవడమో, నిజమో అబద్ధమో, ఔనో కాదో ఇలా స్పష్టమైన ఆలోచనలే తప్పా, తనలో తటస్థవాదం నేను దగ్గరగా చూసిన 20 నెలల్లో ఎప్పుడు కనబడలేదు. తను ఏ రంగు బట్టలూ ధరించలేదు… తనే ఓ సిద్ధాంతం…
తల్లిదండ్రులు లేని అనాథ, ఎవరో పెంచుకున్నారు, ఎవరో పెద్ద చేసారు, ఎవరో మాట నేర్పారు, ఎవరో మళ్లీ పేరు పెట్టారు, అంతా జగన్మాత లీల. అమ్మ తన నాలికపై బీజాక్షరాలు రాసిన మరో కాళిదాసు. ఎంత పేరొచ్చినా కనీసావసరాలకు ఇబ్బంది పడ్డ సగటు జీవి.
సంగీత దర్శకులు కీరవాణి గారికి, అందెశ్రీ గారంటే అభిమానం, అందెశ్రీ గారికీ కీరవాణి గారంటే గౌరవం. జయ జయహే తెలంగాణ గేయం రికార్డింగ్ సమయంలో వారి మధ్య సయోధ్య ఉండబట్టే ఎన్నో తరాలు గుర్తుంచుకునే రెండు ట్యూన్స్ వచ్చాయి.
గౌరవ ముఖ్య మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మూడు నిమిషాల నిడివిగల జాతిగీతం తెలంగాణ జాతి చైతన్య గీతిగా నిత్యం మన విద్యార్థులను యువకులను చైతన్యపరిచే విధంగా ఉండాలని ఆశించినపుడు దానికి అనుగుణంగా ఒక మార్చ్ ఫాస్ట్ గీతంలాగా రూపొందించడంలో ఇద్దరి కృషి ఉంది.
అందేశ్రీ గారికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. తన గురువుగా శ్రీరాం సార్ ను ఎప్పడు యాదికి చేసుకునేవారు. శ్రీరాం గారి కవితాసంకలన ఆవిష్కరణకు గౌరవ ముఖ్యమంత్రి గారూ ముఖ్య అతిథిగా రావడం అందెశ్రీ గారు ఒక చిన్న పిల్లాడిలా సంతోషించారు.
నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిచ్చింది జయజయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన జాతి గీతంగా ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా గుర్తించి 2024 జూన్ రెండు నాడు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో మొదటిసారి అందరిచే పాడించినప్పుడు, నా ముందు వరసలో నిలబడ్డ అందెశ్రీ గారు భావోద్వేగానికి లోనైన క్షణం, ఆత్మీయాలింగనం.
మా ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన కథోత్సవ బహుమతి ప్రదానానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ జూలై 27న రోజంతా ముల్కనూరులో గడిపాడు, ఈరోజు వారి ఉత్తేజిత ఆత్మీయ ప్రసంగాన్ని ఊరంతా గుర్తు చేసుకుంటుంది.
- అందెశ్రీ ఎందుకు నచ్చాలి అనే వాళ్లకు అనేక సమాధానాలున్నా.., ఒక్క మాట చాలు ఆయన వ్యక్తిత్వ విశిష్టతను తెలియజేయడానికి. ఆయన ఎప్పడూ అనే ఓ మాట “బిడ్డా, బువ్వ తిన్న రేవు మరవద్దు అని మా అయ్య చెప్పేటోడు, అసుంటిది, జయ జయహేను జాతి గీతం చేసి వెయ్యి సంవత్సరాల కీర్తికిరీటం తొడిగిన తమ్ముడు రేవంతును నిత్యం తలవకపోతే ఎట్లా” అని.
ఔను, జయ జయహే ను రాష్ట్ర గీతం చేసి, మహాకవిని మకుటంలేని మహారాజును చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం తెలంగాణ జాతికి ఎంతో మేలు చేసింది. ఆయన చెంతకు అధికార పదవులు ఎన్నో వచ్చిన, సుతిమెత్తగా తిరస్కరించిన ఓరుగలు పోతనామాత్యుని సిసలైన వారసుడు.
త్వరలో కొత్తింట్లో పప్పన్నం పెడుతానన్న అందెశ్రీ గారి మాట ఇంకా వినపడుతోంది. పడిపూజకు చివరి అతిథిగా వచ్చిన అందెశ్రీ గారిని అయోధ్య రెడ్డి గారు “అన్నా, ముఖం వాచింది, ఏదో తేడా ఉంది, డాక్టర్ దగ్గరికి పో అంటే”, అదే ధిక్కార స్వరంతో “నాకేమయితది తమ్మీ, నేను బాగున్నా, ఏ మందులు వద్దు” అన్నవి చివరి మాటలు.., అదే రాత్రి మరణించడం, తానెంత మొండో మళ్లీ నిరూపిస్తుంది…
కాలం, కాలుడు ఎవరిని విడిచిపెట్టవు, కానీ వాటికి తెలియదు సత్కవులు చిరంజీవులు, ఈ ధృవ తార రోజూ మనం పూజించే జయ జయ హే తెలంగాణ జాతి గీతంలో నవ్వుతూ పలకరిస్తాడు…
చివరగా…. ముఖ్య మంత్రి గారు స్వయంగా పాడె మోసి, దింపుడు కళ్లం దగ్గర ఆర్ద్రతతో చేసిన చివరి పలకరింపులు, ఏ జాతీ తన కవిరాజుకు చేసుకోని అపూర్వ వీడ్కోలు. ఆత్మీయ స్నేహమా, నీ చివరి కోరికలు తీర్చేవరకు అందరికీ గుర్తు చేసే బాధ్యత తీసుకుంటాం…… వేముల శ్రీనివాసులు, కార్యదర్శి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆఫీస్….
Share this Article