.
నిజం చెప్పుకుందాం… అది చట్టవ్యతిరేకం అయినా సరే… ఐబొమ్మ లక్షలాది సినీ ప్రేక్షకుల అభిమాన సైట్… ఎందుకు..? సినిమా రిలీజ్ కాగానే పెట్టేస్తాడు, ఎవరైనా ఆ సైటుకు వెళ్లి చూసేయొచ్చు…
కొన్ని హెచ్‌డీ ప్రింట్లు సహా… కానీ చౌర్యం కదా… తప్పు కదా,.. నేరం కదా… ఇదే అడిగితే లక్షలాది నెటిజనం అంటున్న మాట వేరే…
Ads
‘‘బెనిఫిట్ షోల దోపిడీ తప్పు కాదా… దొంగ లెక్కలతో టికెట్ రేట్ల పెంపు నేరం కాదా… థియేటర్లలో దోపిడీ చౌర్యం కాదా… ఓటీటీలో చూసినట్టే ఈ సైటులో చూస్తున్నాం, తప్పేముంది..?
అసలు ఎవడో ఏదో సినిమా తీస్తే, వాడి ప్రమోషన్ కోసం ప్రిరిలీజులు, గ్లింప్స్ రిలీజులు, టైటిల్ ప్రకటనల కోసం ఫంక్షన్లు చేస్తే… ప్రభుత్వాలు సిగ్గులేకుండా వందల మంది పోలీసుల్ని మొహరించి, ట్రాఫిక్ అవస్థల్లోకి జనాన్ని నెట్టడం తప్పు కాదా..?
నిర్మాతల కోసమేనా ప్రభుత్వాలు, పోలీసులు..?’’ ఈ ప్రశ్నలకు పోలీసులు, ప్రభుత్వాల వద్ద జవాబులు ఉండవు.,. కానీ మోస్ట్ పాపులర్ ఐబొమ్మ, బప్పం టీవీ ఓనర్ రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు… ఒకటీరెండేళ్ల ముందు చేతనైతే పట్టుకొండి అని సవాల్ విసిరాడు కదా..,
ఇన్నేళ్లు వేల కోట్ల పైరసీ నష్టాలకు కారకుడైన తను చివరకు పోలీసులకు దొరికిపోయాడు… లక్షలాది నెటిజనం తీవ్ర నిరాశకు గురయ్యాడు… ఇది రియాలిటీ… సరే, తను చట్టవ్యతిరేకి, దొరికిపోయాడు, తెలుగు నిర్మాతలకు మరిన్ని కాసులు పండుగాక…
కానీ తను టెక్నికల్‌గా తన ఉనికిని వీసమెత్తు తెలియనివ్వలేదు… ఎంటైర్ ఇండస్ట్రీ అష్టకష్టాలు పడినా, పోలీసులు ఎన్ని తిప్పలు పడినా దొరకలేదు… జాడ తెలియలేదు… ఎక్కడో ఫ్రాన్స్, యూరప్, కరేబీయన్ ప్రాంతాల నుంచి సర్వర్లు రన్ చేసేవాడు…
కానీ ఎక్కడ దొరికిపోయాడు మరి..? తనది వైజాగ్… చాన్నాళ్ల క్రితమే పెళ్లయింది… పెళ్లాంతో విడాకులు, గొడవలు ఉన్నాయట, అవి సెటల్ చేసుకోవటానికి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చి దొరికిపోయాడట… అదీ భార్య తన మీద కచ్చతో వెల్లడి చేసిన సమాచారం మేరకు మాత్రమేనట..! టెక్నికల్‌గా ఎంత తెలివి ఉంటేనేం..? పెళ్లాంతో సరిగ్గా లేక ముంచేసిందిగా…
సో, అదన్నమాట సంగతి… పోలీసులు తమ టెక్నికల్ సామర్థ్యంతో కాదు… సదరు దోషి ఇంటి బాగోతాలతో ఈ నేర వ్యవహారం తనంతట గానే పోలీసులను వెతుక్కుని రావడంతో అన్నమాట… మొత్తానికి ఇండస్ట్రీ హేపీ…
సరే గానీ, సినిమాల టికెట్ రేట్లు, థియేటర్ల దోపిడీ కొనసాగుతూ ఉంటే… ఐబొమ్మ కాదు, దాని తాతబొమ్మ వస్తుంది… భార్యతో గొడవల్లేనివాడు ఎవడైనా కొత్తగా మరో సైట్ స్టార్ట్ చేస్తే… ఇండస్ట్రీని సవాల్ చేస్తే… తెలుగు నెటిజనం స్వచ్చందంగా హారతులు పడతారు… పాపం శమించుగాక..!!
ఐబొమ్మ అంటే... ఇమ్మడి బొమ్మ... తన ఇంటి పేరు... ప్రస్తుతానికి ఆ సైట్ క్లోజ్‌డ్..!!
Share this Article