అఫ్ఘన్ సంక్షోభం గురించి మనకెందుకు ఇంత హైరానా అనుకోవడానికి వీల్లేదు… తాలిబన్లు బలపడటం, వాళ్లతో చైనా, పాకిస్థాన్ దోస్తీ బలపడటం, వాటికి రష్యా డప్పు కొట్టడం మనకు ఎప్పుడూ ముప్పుకారకమే… అందుకే అధ్యయనం అలవాటైన కలాలన్నీ కదులుతున్నయ్… రకరకాల కోణాల్లో విశ్లేషణలు, కథనాలు కనిపిస్తున్నాయి… సోషల్ మీడియాలో కూడా బోలెడు ఆసక్తికరమైన సమాచార వ్యాప్తి జరుగుతోంది… ఇదే అప్ఘనిస్థాన్‌కు ఎగువన తజికిస్థాన్ అని ఓ దేశం ఉంటుంది… గతంలో సోవియట్ యూనియన్‌లో పార్ట్, తరువాత విడిపోయింది… అక్కడ మనకు ఓ ఎయిర్ బేస్ ఉంది… విదేశీ భూభాగంలో మన ఎయిర్ బేస్ అనేది కాస్త విచిత్రంగానే తోచినా… మిత్రుడు Vaddadi Srinivasu వాల్ మీద కనిపించిన ఈ కథనం చదివితే ఈ ఎయిర్ బేస్ కథాకమామిషు అర్థమవుతుంది… ఆ కథనం ఇదీ…
అందుకు ఏకైక కారణం… గిస్సర్ మిలటరీ ఏరోడ్రోమ్( జీఎంఏ)… అక్కడి నుంచే మన వాయుసేన విమానాల్లో కాబూల్ వెళ్లి భారతీయులను ఎక్కించుకుని విజయవంతంగా తీసుకు రాగలిగాయి.
Ads
తజికిస్తాన్‌లోని అయినీ గ్రామంలో ఉందీ భారత వాయుసేనకు చెందిన ఎయిర్ బేస్ జీఎంఏ… తజికిస్తాన్ దేశంలో మన దేశానికి ఎయిర్‌బేస్ ఉండటం ఏమిటన్నదే కదా సందేహం. దార్శనికుడైన ప్రధానమంత్రి, వ్యూహకర్త అయిన రక్షణ మంత్రి ఉంటే దేశానికి కలిగే ప్రయోజనం అదే. ఆ దార్శనికుడైన ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి… వ్యూహకర్త అయిన రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్. 2000– 2001లోనే దేశ వ్యూహాత్మక, రక్షణ అవసరాలను గుర్తించి తజికిస్తాన్‌లో భారత వాయుసేను ఎయిర్ బేస్‌ను ఏర్పాటు చేశారు వారిద్దరు… పాకిస్తాన్ కంటే చైనాయే భారత్‌కు ప్రథమ శత్రువు అని 1998లోనే ప్రకటించి ఇండో–టిబెటన్ సరిహద్దుల్లో మన రక్షణ పాటవాన్ని, మౌలిక వసతులను అద్భుతంగా మెరుగుపరిచారు. దాంతోనే గత ఏడాది సిక్కిం, లాద్ధాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడును మన సైన్యం సమర్థంగా అడ్డుకోగలిగింది. (గతంలో ఈ అంశంపై నా ఫేస్‌బుక్ వాల్ మీద రాసిన పోస్టుల లింకులు
https://m.facebook.com/story.php?story_fbid=2808506102762236&id=100008086218378
https://m.facebook.com/story.php?story_fbid=2818489271763919&id=100008086218378 ).
అదే రీతిలో వాజ్‌పేయి– ఫెర్నాండేజ్ జోడీ అప్పట్లోనే దేశానికి అందించిన మరో గొప్ప బహుమతి తజికిస్తాన్‌లోని అయినీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎయిర్ బేస్.,, గిస్సర్ మిలటరీ ఏరోడ్రోమ్( జీఎంఏ)…ఇంతకీ ఈ ఎయిర్ బేస్‌కు ప్రాధాన్యం ఏమిటంటే…
తజిక్‌లో… భారత వ్యూహాత్మక ప్రాంతం
అయినీ… తజికిస్తాన్ సరిహద్దులోని ప్రాంతం…తజికిస్తాన్ అటు అఫ్గనిస్తాన్ ఇటు చైనాలతో సరిహద్దులు కలిగి ఉంది. అయినీ నుంచి అఫ్గాన్‌లోని కాందహార్‌పై సులువుగా వైమానిక దాడులు చేయొచ్చు. తజికిస్తాన్‌కు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ( పీవోకే)లతో నేరుగా సరిహద్దు లేనప్పటికీ అత్యంత సమీపంలో ఉంది. సన్నగా ఉండే అఫ్గనిస్తాన్‌లోని వఖన్ సరిహద్దుకు మీదుగా కేవలం 20కి.మీ దూరంలోనే పాకిస్తాన్, పీవోకేలు ఉన్నాయి. అంటే అఫ్గనిస్తాన్, చైనా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లతో సరిహద్దు ఉన్న కీలక ప్రాంతం తజికిస్తాన్. అందుకే తజికిస్తాన్‌లోని కీలకమైన అయినీ ప్రాంతం భారత దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమని 2000లో వాజ్‌పేయి, ఫెర్నాండేజ్ భావించారు. ఎందుకంటే 1999లో మన దేశ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి అఫ్గనిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకుపోయారు. అఫ్గాన్‌తో నేరుగా సరిహద్దు లేకపోవడంతో ఆనాడు మన దేశం దూకుడుగా వ్యవహరించలేకపోయింది. హైజాకర్ల డిమాండ్లకు తలొగ్గింది. (అఫ్గాన్‌కు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్( పీవోకే)కు సరిహద్దు ఉంది. అధికారికంగా పీవోకే భారతదేశంలో అంతర్భాగం. కానీ ప్రస్తుతం ఆ ప్రాంతం మన దేశ ఆధీనంలో లేదు కదా). ఆ సంఘటనను గుణపాఠంగా తీసుకున్న వాజ్‌పేయి, ఫెర్నాండేజ్‌లు 2000లో కార్యాచరణకు ఉపక్రమించారు. భవిష్యత్‌లో అఫ్గనిస్తాన్‌లో సైనిక అవసరాలు ఏర్పడితే దేనికైనా సన్నద్ధంగా ఉండేందుకు మన వాయుసేన, సైన్యాన్ని ముందస్తుగా నియోగించేందుకు ఓ వ్యూహాత్మక రక్షణ స్థావరం ఉండాలని గుర్తించారు. అప్పుడే వారి దృష్టి తజికిస్తాన్ మీద పడింది. సోవియట్ యూనియన్‌లో అంతర్భాగంగా ఉన్నప్పుడు, ఆ తరువాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించిన తరువాత కూడా తజికిస్తాన్ భారత్‌కు మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. దాంతో తజికిస్తాన్‌లో కీలకమైన రెండు అంశాలపై చర్చించి ఒప్పించింది. ఒకటి… తజికిస్తాన్‌లోని ఫర్ఖోర్‌లో 1980 నుంచి నిరుపయోగంగా ఉన్న ఎయిర్ బేస్‌కు మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావడం. ఫర్ఖోర్‌లో అప్పటికే భారత దేశం తజికస్తాన్‌తో కలిసి ఓ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ఇక ఫర్ఖోర్‌లో నిరుపయోగంగా ఉన్న ఎయిర్‌బేస్‌ను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు భారత్ దాదాపు రూ.75కోట్లు ఖర్చు చేసింది. తజికిస్తాన్‌తో కలిసి ఆ ఎయిర్‌బేస్‌ను నిర్వహిస్తోంది.
ఇక పూర్తిస్థాయి సైనిక అవసరాలకు మరో ఎయిర్ బేస్ అవసరం. అందుకోసం మన రక్షణ రంగ నిపుణులు ఎంపిక చేసిన ప్రాంతమే అయినీ…మన దేశ విజ్ఞప్తిని తజిక్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అయినీలో భారత్ వాయుసేన ఎయిర్ బేస్ ఏర్పాటుకు అనుమతినిచ్చింది. అనంతరం 2001–2002లో ఆ ఎయిర్‌బేస్‌ను భారత్ నిర్మించింది. కేంద్ర విదేశాంగ శాఖ నిధులతో చేపట్టిన ఈ ఎయిర్ బేస్ నిర్మాణంలో భారత బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌వో)కీలక పాత్ర పోషించింది. యుద్ధ విమానాలు, రక్షణ రంగానికి చెందిన రవాణా విమానాలు సులువుగా ల్యాండింగ్, టేకాఫ్‌లకు వీలుగా 3,200 మీటర్ల పొడవుతో పటిష్టమైన ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించింది. యుద్ధ విమనాల ఓవర్‌హాలింగ్ చేసేందుకు, ఇంధనం నింపుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు నెలకొల్పింది. జీఎంఏ ఎయిర్‌బేస్ కోసం మన దేశం దాదాపు రూ.750 కోట్లు ఖర్చు చేసింది. అక్కడ ఓ ఎయిర్ బేస్ కమాండర్ నేతృత్వంలో సైనిక బలగాల బృందాన్ని నియమించి నిర్వహిస్తోంది. భారత్ కొన్నేళ్లుగా ఆ ఎయిర్ బేస్‌లో సుఖోయ్ యుద్ధ విమానాలను మోహరించింది కూడా. తజికిస్తాన్‌లోని అయినీ గ్రామంలో భారత్ ఏర్పాటు చేసుకున్న గిస్సర్ మిలటరీ ఏరోడ్రోమ్( జీఎంఏ) మన దేశం వ్యూహాత్మకంగా పైచెయ్యి సాధించడంలో కీలకంగా మారింది…
Share this Article