నీకు భక్తి ఉంటే… వీథి చివరలో ఉన్న రాములవారి గుడికి వెళ్లి, చేతనైతే ఓ ప్రదక్షిణ చేసి, దండం పెట్టుకుని, సాష్టాంగ నమస్కారం చేసి, కాసేపు ఓ పక్కన కూర్చుని కళ్లుమూసుకుని ఆ రాముడి మొహాన్ని గుర్తుతెచ్చుకో… చాలా బెటర్… అంతేతప్ప ఇంతలేసి టికెట్ల ధరతో, వ్యయప్రయాసలకు ఓర్చి మరీ థియేటర్ల దోపిడీకి పర్స్‌ను, అడ్డదిడ్డం సినిమాకు పల్స్‌ను అప్పగించాల్సిన అవసరమేమీ లేదు…
శాకుంతలం తరువాత ఇంత బేకార్ వీఎఫ్ఎక్స్ వర్క్ మరే సినిమాలోనూ కనిపించలేదు ఈమధ్య… పక్కా నాసిరకం… 500 కోట్లకు పైగా ఖర్చు దేనికి పెట్టారనేది పెద్ద మిస్టరీ… చూడబోతే రాను రాను సినిమాల ఖర్చు కూడా స్కాముల్లాగే మారుతున్నాయా..? ఇదే రామాయణాన్ని ఏ గ్రాఫిక్సూ లేకుండా, ఎమోషనల్ సీన్లతో, మంచి పాటలతో అనేకసార్లు మనల్ని అలరించారు పాత దర్శకులు… నిజానికి వందలు, వేల ఏళ్లుగా అందరికీ తెలిసిన కథను మళ్లీ రక్తికట్టించాలంటే చాలా ప్రతిభ అవసరం…
దురదృష్టవశాత్తూ దర్శకుడు ఓం రౌత్‌కు ఆ తెలివి లేదు… ప్రభాస్ అనవసరంగా సదరు దర్శకుడిని నమ్మి మోసపోయాడు… అసలే సాహో, రాధేశ్యాం దెబ్బలతో ప్రభాస్ ఇమేజీ పడిపోయింది కాస్త… ఈ దర్శకుడిని నమ్మి మరింత నష్టపోయాడు… ఈ ప్రభావం ప్రభాస్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టులపై ఎంత పడుతుందో చూడాలిక… మామూలు కథను లేదా తను వక్రమార్గం పట్టించిన హిస్టారిక్ కథల్ని కూడా (ఆర్ఆర్ఆర్) ప్రేక్షకులకు కనెక్టయ్యేలా ఎలా తీయాలో ఒక రాజమౌళికి తెలుసు… గ్రాఫిక్స్‌ను కూడా ఎక్కడ ఎంత అవసరమో అంతే వాడుకోవడం కూడా ఓ కళ… అదీ రాజమౌళికి బాగా తెలుసు… ఓం రౌత్ ఆ కోణంలో ఫెయిల్…
Ads
రామాయణాన్ని ప్రభాస్ కోణంలో విశ్లేషించుకోవడం తప్పు… వాస్తవానికి మహాభారతంతో పోలిస్తే రామాయణంలో ఉపకథలు తక్కువ… ఎలాపడితే అలా మార్చుకోవడం కూడా కుదరదు… పిచ్చి ప్రయోగాలకు పోతే ప్రేక్షకుడికి నచ్చదు సరికదా తిట్లు తప్పవు… లేనిపోని క్రియేటివ్ ట్విస్టులు పెడతాను అంటే ఎవడూ మెచ్చడు… ఓం రౌత్‌కు ఇవి తెలియవా..? తెలిసీ ఏమవుతుందిలే అనే తెంపరితనమా..?
ప్రభాస్ తప్ప ఇందులో తెలుగుతనం ఏమీ లేదు… అందరూ హిందీ వాళ్లే… మంచి నటులే ఉన్నారు… కానీ వాళ్ల నటనకు సరిపోయే ఎమోషనల్ సీన్లు లేదా ఇంట్రస్టింగ్ కనెక్టింగ్ సీన్లు ఏమున్నాయని… చాలావరకూ యానిమేషన్ సీరియల్ చూస్తున్నట్టుగా… మధ్యమధ్యలో ఒరిజినల్ నటులు కనిపిస్తుంటారు… రాముడిగా ప్రభాస్ ఎలా చేస్తాడో అనే డౌటుండేది మొదట్లో… దక్కిన పరిమితమైన స్క్రీన్ స్పేస్‌లోనూ రాముడిలా ప్రభాస్ ఒదగడానికి బాగానే ప్రయత్నించాడు…
చూపే తీరును బట్టి ప్రేక్షకుల యాక్సెప్టన్సీ ఉంటుంది… వ్యాంప్ తరహా పాత్రల్ని వేసుకునే నయనతారను కూడా బాపు తన శ్రీరామరాజ్యంలో బ్రహ్మాండంగా చూపించాడు… మోల్డ్ చేశాడు… ఆదిపురుష్‌లో (అసలు ఈ టైటిలే పెద్ద ప్రశ్నార్థకం…) సీతగా వేసిన కృతి సనన్ ఆ పాత్రకు అస్సలు సూట్ కాలేదు… రావణుడి పాత్ర లుక్కు అస్సలు బాలేదు… హనుమంతుడూ అంతే… ఫస్టాఫ్ ఏదో రొటీన్‌గా, సాఫీగా బాగానే తీసినా సినిమా సెకండాఫ్‌లో బోర్ అయిపోయింది…
బీజీఎం వోకే… కానీ పాటలు ఆకట్టుకోలేదు… ఎడిటింగ్ బాలేదు… అసలు ఓం రౌత్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు… మోడర్న్ పద్ధతిలో కొత్త జనరేషన్స్‌కు గ్రాఫిక్ రామాయణాన్ని పరిచయం చేయాలని అనుకున్నాడా..? అలాంటప్పుడు నాణ్యమైన గ్రాఫిక్స్ ఉండాలిగా… ఓం రౌత్ ముందుగా మన తెలుగులో వచ్చిన రామాయణ గాథల్ని ఓసారి చూస్తే ఈ సినిమా ఇంకాస్త బాగా వచ్చేదేమో… అంతెందుకు..? జపాన్ వాళ్లు ఆమధ్య కార్టూన్ రామాయణం ప్రజెంట్ చేశారు… ఎంత బాగుందో…
సినిమాలో కంటెంట్ బాగుంటే ఏ ప్రచార పైత్యాలూ అక్కర్లేదు… భారతీయుల్లో రామాయణానికి ఉన్న స్థానం అలాంటిది… మొదటి ట్రెయిలర్ అట్టర్ ఫ్లాప్… రెండో ట్రెయిలర్ కాస్త బెటర్… నిజానికి ఇప్పటికీ ఆ రెండో ట్రెయిలర్ చూస్తే చాలు, సినిమా మొత్తం చూడాల్సిన పని లేదు… సినిమా ఎలా వచ్చిందో మొత్తం టీంకు ఓ క్లారిటీ, ఓ ఐడియా ఉన్నాయి… అందుకే హనుమంతుడికి ఓ సీటు, జైశ్రీరాం నినాదాలు, భక్తి ప్రచారం, భారీ హైప్ ఎట్సెట్రా…
బాపు తీసిన సంపూర్ణ రామాయణం యూట్యూబ్‌లో దొరకొచ్చు… చూడండి… పిల్లలకు రామాయణం చెప్పాలని ఉన్నా సరే ఆ బాపు రామాయణమే బెటర్… అంతే తప్ప ఈ తోలు కవచ రాముడిని చూస్తే ఏ భక్తి భావనా కలగదు… నిజం నిష్ఠురంగానే ఉంటుంది..!! ఇంతకుమించిన సమీక్ష కూడా ఈ సినిమాకు అనవసరం… ఓం రౌత్ మళ్లీ ఇప్పట్లో ఎవరూ రామాయణాన్ని టచ్ చేయకుండా చేశాడు… అదీ అసలు నష్టం…!! ఐనా పౌరాణికాలు తీయాలంటే మన దర్శకులే బెస్ట్ అని మరోసారి రుజువైంది… ప్రభాస్ వంటి స్టార్‌ను రాముడిగా నటింపజేస్తున్నప్పుడు ఎంత వర్క్ జరిగి ఉండాలి..? ఓం రౌత్, కమ్ టు మై రూమ్…!!
Share this Article