.
బాహుబలి… నిజమే… తెలుగు సినిమాను మరీ అంతర్జాతీయ స్థాయి అనలేం గానీ, ఓ రేంజ్‌కు తీసుకుపోయిందనేది నిజం… మార్కెట్‌పరంగా… కొత్త కొత్త టెక్నిక్కులతో ఓ జానపద గాథను పాన్ ఇండియా రేంజులోకి తీసుకుపోయాడు రాజమౌళి…
రెండు భాగాలను కలిపి కుట్టేసి, ఇప్పుడు ఎపిక్ అని మళ్లీ రిలీజ్ చేశాడు, ఆ బ్రాండ్‌తో మళ్లీ డబ్బులు చేసుకోవడం ఉద్దేశం… రాజమౌళిని మార్కెటింగ్ వ్యూహాల్లో కొట్టేవాడెవడు..? ఐతే కొన్ని వేల రీల్స్, షార్ట్స్, వీడియోలు, ఇంటర్వ్యూలు, మీమ్స్, తప్పుల అన్వేషణలు, కామిక్స్, ప్రిక్వెన్స్ బుక్స్, రకరకాల బాహుబలి బ్రాండ్ సరుకులు, టీవీలో అనేకసార్ల ప్రసారాలు, టీవీ షోలు, ఓటీటీ వీక్షణలు… అంతెందుకు.,.? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను దేశవ్యాప్తంగా లేవనెత్తాడు రాజమౌళి…
Ads
మరి ఇంతగా మన బుర్రల్లోకి ఎక్కిన సీన్లను, కథను కొత్తగా ఏం చూస్తాం..? పైగా 100 నిమిషాలపాటు కుదించినా సరే, దాదాపు 4 గంటల సినిమాను థియేటర్‌లో చూడగలమా..? అసలు రెండు గంటలు దాటితేనే చూడలేకపోతున్నాం… ఒకే ఒక ఆసక్తితో సినిమా చూడటం… అది ఎడిటింగ్ ఎంత పకడ్బందీగా చేశాడో చూడాలి…
ఎందుకంటే..? తెలుగు సినిమాల్లో కొన్ని సరైన ఎడిటింగ్ లేక ఫ్లాపవుతున్నాయి… ఎడిటింగ్ ఓ కళ… ఈ ఎపిక్ కూడా రాజమౌళికి ఓ పరీక్ష… రెండు భాగాలను ఐదున్నర గంటల నుంచి 3 గంటల 44 నిమిషాలకు ఎలా కుదించాడనేదే ఆసక్తికరాంశం…
ఎస్, బాగా కుదించారు, కానీ కుదింపు ప్రక్రియలో చాలా సీన్లు కత్తిరించేశారు, యాక్షన్ సీన్లను కుదించారు, కొన్ని పాటలు ఎత్తేశారు… రొమాన్స్, కామెడీ, కొన్ని పాటల మంచి విజువల్స్ లేకుండాపోయి, ఉత్త ఎమోషన్, సీరియస్‌నెస్ మాత్రమే మిగిలింది… సినిమా అంటే అన్నీ ఉండాలి కదా… అదుగో అది ఎగిరిపోయింది…
ప్రత్యేకించి… మూడు పాటలు మటాష్… పచ్చబొట్టేసిన, ఇరుక్కుపో, కన్నా నిదురించరా కత్తెరపాలయ్యాయి… సీరియస్ స్టోరీలో, ఆ యుద్ధాల వేడిలో, ఆ డ్రామాలో ఇవైనా కాస్త ఆహ్లాదకరంగా ఉండేవి… కొన్ని సాగతీత యుద్ధాల్ని ట్రిమ్ చేశారు, గుడ్… యాక్షన్ మరింత పదునుగా (క్రిస్పర్) మారింది… సుబ్బరాజు కామెడీ మాయం…
ఈ కత్తెర్ల వల్ల కొందరికి ఇది రుచిస్తుంది, ఎందుకంటే..?
- నాన్-స్టాప్ ఎపిక్ ఫీల్: రొమాన్స్, పాటలు కట్ చేయడం వల్ల, కథనం అడ్డంకులు లేకుండా ఒక పెద్ద చారిత్రక గాథలా ముందుకు వెళ్తుంది… ఇది మహిష్మతి రాజకీయం, సింహాసనం పోరాటంపై ప్రేక్షకుడి దృష్టిని నిలబెడుతుంది…
- ఎడిటింగ్ నైపుణ్యం: రాజమౌళి, బృందం 100 నిమిషాల నిడివిని కత్తిరించినా, కథ మూల భావోద్వేగాలు (కట్టప్ప విధేయత, శివగామి నిర్ణయం) లేదా గొప్ప యాక్షన్ ఘట్టాలు దెబ్బతినకుండా చూసుకోవడంలో సఫలమయ్యారు… ఇది ఎడిటింగ్‌లో ఒక మాస్టర్‌క్లాస్…
కానీ కోల్పోయిన అనుభూతుల మాటేమిటి..?
- ఎమోషనల్ గ్యాప్: శివుడు (మహేంద్ర బాహుబలి) జీవితంలోని ‘సాధారణ మానవ’ కోణాన్ని చూపించే రొమాంటిక్ ట్రాక్ లేకపోవడం వల్ల, ఆ పాత్రతో భావోద్వేగ కనెక్షన్ ఏర్పడటానికి కొంత ఇబ్బంది ఉంటుంది…
- నాస్టాల్జియా కోల్పోవడం: పదేళ్ల క్రితం థియేటర్లలో పాత వెర్షన్‌ను చూసిన ప్రేక్షకులకు, ఈ తగ్గింపుల వల్ల ఐకానిక్ పాటలు మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది… గూస్‌బంప్స్ వైబ్ ఇన్నేళ్ల తర్వాత తిరిగి పొందడం కష్టమనేది వాస్తవం…
- అలసట (Fatigue): 100 నిమిషాలు తగ్గించినప్పటికీ, 3 గంటల 44 నిమిషాల నిడివి, ఒకే ఇంటర్వెల్‌తో కూడిన సినిమాకు ఇప్పటికీ చాలా ఎక్కువ... ఓటీటీ కంటెంట్ చూసే ప్రేక్షకులకు ఇది పరీక్ష లాంటిది…
ఇప్పటివరకు బాహుబలిని థియేటర్‌లో చూడని కొత్త ప్రేక్షకులకు లేదా రెండు భాగాల కథను ఒకేసారి చూడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం… కానీ, మీరు ఇప్పటికే రెండు భాగాలను చాలాసార్లు చూసి, పాత జోష్, పూర్తి నిడివి భావోద్వేగాల కోసం థియేటర్‌కు వెళ్తున్నట్లయితే, ఈ ఎడిటెడ్ వెర్షన్ కొంత నిరాశ కలిగించవచ్చు…
రెండు భాగాలలోని పూర్తి స్థాయి భావోద్వేగాలు (Emotional Arc) పాటల అందాలు కోరుకునే వారికి కొంత వెలితిగా అనిపించవచ్చు… ఇది కొత్త ప్రేక్షకులను పరిచయం చేయడానికి గొప్ప ప్రయత్నం, కానీ పాత అభిమానులకు ఇది కేవలం నాస్టాల్జియా మాత్రమే…
నో, నో, మీరందరూ ఓ కొత్తదనం చూస్తారు అని చెప్పాడు రాజమౌళి… ఇది కలిపి కుట్టడం కాదు, రీ-రిలీజ్ కాదు, తిరిగి-రూపొందించిన (Re-imagined) అనుభూతిగా ప్రచారం చేస్తున్నాడు… కానీ అంత సీన్ అనిపించలేదు… కాకపోతే సాంకేతిక మెరుగుదల (Technical Enhancement) ఉంది… ఈ వెర్షన్‌ను IMAX, 4DX వంటి ఫార్మాట్ల కోసం రీ-మాస్టర్ చేసి, విజువల్స్, సౌండ్‌ను మరింత మెరుగుపరిచారు…
స్థూలంగా… ఒక కొత్త అనుభూతిని ఏమీ ఇవ్వలేకపోయింది ఈ ఎపిక్… తమన్నా, ప్రభాస్ లవ్ ట్రాక్‌ను మరీ రాజమౌళి వాయిస్ ఓవర్‌తో సింపుల్‌గా తెగ్గొట్టేశారు… ఏమో… రాజమౌళిని కాపీ చేసే నిర్మాతలు, దర్శకులు బోలెడు మంది… కేజీఎఫ్, పుష్ప కూడా కలిపి కుట్టేసి వదులుతారో ఏమో…!!
Share this Article