అబ్బే, మన తమిళ, తెలుగు ఆత్మలు, దెయ్యాలు, క్షుద్ర శక్తులు ఈమధ్య సరిగ్గా పనిచేయడం లేదు, బాక్సాఫీస్ కొల్లగొట్టడం లేదు… ప్చ్, అందుకే అస్సాం నుంచి కూడా తెచ్చుకోవాల్సి వస్తోంది… కానీ అస్సాం శక్తులు ఆత్మలేమైనా డిఫరెంట్ కాదు కదా, అదే రొటీన్ దెయ్యం పనులే… వరుస ఆత్మల సినిమాలు తీసి జనం మీదకు వదిలే లారెన్స్‌లాగే ఖుష్బూ సుందర్ కూడా అలాగే వరుసగా సినిమాలన్ని వదులుతున్నాడు తప్ప అసలు రియాలిటీలోకి వెళ్లడం లేదు పాపం…
అరణ్మనై సీరీస్ అట… తమిళంలో తీస్తాడు… ఇప్పటికి మూడు అయిపోయాయి, తాజాగా నాలుగో సినిమా… దానినే బాక్ అని తెలుగులోనూ రిలీజ్ చేశాడు… ఏవో నాలుగు డబ్బులొస్తాయి కదా… పైగా అందగత్తెలు తమన్నా, రాశి ఖన్నా ఉండనే ఉన్నారు… సుందర్‌కు తెలుగులో పెద్ద ఇమేజీ లేకపోతేనేం..? ఆ రెండు అందాలు ప్లస్ చివరలో సిమ్రాన్, ఖుష్బూ డాన్సులతో ఓ సాంగ్… స్పెషల్ సాంగ్స్‌కు సమంతే కావాలా ఏం..? వెటరన్స్ పనికిరారా..?!
ఏదో కాస్త కామెడీ, కాస్త హారర్, కాస్త సస్పెన్స్, కాస్త థ్రిల్… అంతే… సినిమా కథ సిద్ధం… తీసెయ్, వదిలెయ్… అదేదో యండమూరి రాసిన నవలలో ఓ పాపులర్ రచయిత (వెన్నెల్లో ఆడపిల్ల..?) ఇలాగే తన కొత్త నవలలో ఏ ఎమోషన్ ఎంత శాతం ఉండాలో లెక్కప్రకారం కలిపి దట్టిస్తాడు… సరే, ఆ కథేమిటనేది వదిలేస్తే… ఈమధ్య వచ్చే హారర్ సినిమాలన్నీ అంతే… పైన చెప్పినవి 25 శాతం చొప్పున, అంటే లెక్కప్రకారం సమపాళ్లలో కలుపుతున్నారు…
Ads
ఓ ఆత్మ, ఏదో ఫ్లాష్ బ్యాక్, ప్రతీకారం, ఎవరో హీరో దాన్ని చేధించడం… ప్చ్, తెలుగు సినిమాలన్నీ మరీ జీతెలుగు వాడి త్రినయని సీరియల్‌లా అయిపోయాయి… కాకపోతే ఈ బాక్ (ఇది అస్సామీ క్షుద్రశక్తి పేరట..) (ప్రేక్షకుల బుర్రలపై బాకు అని పొరబడకండి) కథకు కాస్త తల్లి ప్రేమ ఎమోషన్ తోడైంది… సరైన కథ, కథనాలు లేకపోతే… టెక్నికల్‌గా సినిమా ఉన్నతంగా ఉన్నా సరే, అందగత్తెలు తెర నిండా కనిపిస్తున్నా సరే ఫలితం లేదు… బోర్ కొడుతుంది…
పైగా ప్రస్తుతం తమన్నా దా దా రా రా రావాలయ్యా అంటే జనం చూస్తున్నారు గానీ… వేరే భిన్నమైన పాత్ర వేస్తే చూడటం లేదనుకుంటా..! అఫ్‌కోర్స్, ఆ పాత్రలకు తగినట్టు తమన్నా గానీ, రాశి గానీ బాగానే చేశారు గానీ ఆ పాత్రల కేరక్టరైజేషనే బలంగా లేదు… పాపం, వాళ్లేం చేస్తారు..? అదే కోవై సరళ, అదే యోగిబాబు… అడుగడుగునా తమిళమే కనిపిస్తూ ఉంటుంది సినిమాలో… కాకపోతే సంగీతం, గ్రాఫిక్స్ వంటివి బాగున్నాయి…
సార్, సుందర్ సార్… ఇలా వరుసగా ఆత్మ సినిమాలు తీసి జనం మీదకు వదిలేబదులు, ఎంచక్కా ఏ ఓటీటీ ప్లాట్ ఫారం కోసమే ఓ హారర్ వెబ్ సీరీస్ తీసేస్తే పోలా..? జనానికి థియేటర్ దాకా రావడం తగ్గుద్ది, అనవసర ప్రయాస, ఖర్చు కూడా తగ్గుతాయి… ఖుష్బూ, నువ్వయినా చెప్పొచ్చు కదా సారుకు..!?
Share this Article