.
నిన్న పెద్ది అనే టైటిల్‌తో చిరంజీవి కొడుకు రాంచరణ్ చేస్తున్న సినిమా పాట ఒకటి రిలీజైంది.,. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆహా ఓహో అని పొగిడింది… మీరు ఈ పాట చూశారా, ఎలా ఉంది… అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో బోలెడు ప్రశ్నార్థక పోస్టులు…
అవునూ, ఎలా ఉంది..? కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు… సహజంగానే ఇండస్ట్రీలో, ఫ్యాన్స్‌లో, ప్రేక్షకుల్లో వ్యక్తి పూజ ఎక్కువ కాబట్టి… చిరంజీవి కొడుకు కాబట్టి మెజారిటీ జనం బాగుంది, సూపర్, అదిరింది, ఇరగదీసింది, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు… సహజం…
Ads
ఏమాటకామాట… రాంచరణ్ ఉద్వేగ ప్రదర్శన మాటేమిటో గానీ, తను మంచి డాన్సర్, తండ్రిలాగే ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు వేస్తాడు, కృతకంగా కష్టపడి మరీ స్టెప్పులు వేస్తున్నట్టుగా ఉండదు… ఈ పాటలో కూడా బాగా స్టెప్పులేశాడు… అస్సలు మొహాన్ని క్లోజప్‌లో చూపించే ఒక్క షాట్ కూడా లేదు కాబట్టి, పాట సాహిత్యాన్ని బట్టి తనేం ఉద్వేగాన్ని చూపగలిగాడో చెప్పలేం…
కానీ పాటలో లొకేషన్లు మాత్రం సూపర్బ్… ఎక్కడ తీశారో గానీ..! సాంగ్ పిక్చరైజేషన్ కూడా బాగుంది… అందాల ప్రదర్శన కోసమే జాన్వీకపూర్‌ను పెట్టుకున్నారు కాబట్టి, ఆమె మీద కెమెరా ఫోకస్ కూడా అదే యాంగిల్‌లో… ఆమె అందంగానే ఉన్నట్టనిపించింది…
- రాంచరణ్‌కు మా మాసికల అంగీ ఎందుకు తొడిగారో తెలియదు… ఆ జులపాల జుట్టు దేనికో కూడా తెలియదు, కథ డిమాండ్ చేసిందేమో… కానీ ఏఆర్ రెహమాన్ ట్యూన్ పర్లేదు… పాడింది మోహిత్ చౌహాన్… కంపోజర్‌కూ, సింగర్‌కూ తెలుగు తెలియదు, రాదు… అసలు మోహిత్ పాడుతుంటే ఆ పదాలేమిటో అర్థం కాలేదు, సరే, అర్థమయ్యేది సినిమా సాహిత్యం ఎందుకు అవుతుంది అంటారా..? నిజమే…
సాహిత్యం ఎవరో బాలాజీ అట… ప్రాస కోసం మహా ప్రయాసపడ్డాడు… నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద కిలోమీటర్లకు ఓ మాండలికం, ఓ యాస ఉంటాయి… ఇదేమో సినిమా మాండలికం… ఈ యాసకు ప్రాంతాలతో సంబంధం లేదు…
పైగా దీనక్క అట పల్లవిలోనే… దాని అర్థం బాలాజీకి తెలుసో లేదో… కంపోజర్, సింగర్‌కు తెలిసే ప్రశ్నే లేదు… రాంచరణ్ పట్టించుకోడు… దర్శకుడి గురించి మనకు తెలియదు… టేస్ట్..!!
ప్రాస కోసం పాపం బాలాజీ పడిన ప్రయాస ఎలా ఉందో తెలుసా..?
- ‘‘ఆ చంద్రుల్లో ముక్క.. జారిందే దీనక్క.. నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా
దీనందాలో లెక్క.. దీనేషాలో తిక్క.. నా గుండెల్లో పోత్తాందే ఉక్కా’’
వావ్…, ముక్క, దీనక్క, తైతక్క, లెక్క, తిక్క, ఉక్క… బాలాజీ నీకు తిరుగులేదు పో… ఇక తెలుగు సినిమా పాటల సాహిత్యాన్ని దున్నిపారెయ్…
- ‘‘సరుకు సామాను సూసి మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక…
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..’’
ఇక్కడ సరుకు, సామాను అంటే పాఠక మహాశయులే అర్థం చేసుకోవాలి… ఈ పదాలు వస్తుంటే జాన్వీ పదే పదే ఆ టైట్ బట్టల్లో కనిపిస్తూ ఉంటుంది…
- ‘‘ఆ ముక్కుపై పెట్టీ కోపం.. తొక్కేసావే ముక్కెరందం
చింతాకులా ఉందే పాదం, సిర్రాకులే నడిచే వాటం…
ఏం బొక్కావో అందాలు, ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు
కూసింతే సూత్తే నీలో వగలు..రాసేత్తారుగా ఎకరాలు..
నువ్వే నడిచిన సోటంతా పొర్లు దండాలు…
మరేమనుకున్నారు… ఏం బొక్కావో అట… బాలాజీ నువ్వు సూపర్ సారూ…
- ’’నచ్చేశావే.. మల్లే గంపా.. నీ అందాలే.. నాలో దింపా
ఏం తిన్నావో కాయా దుంపా.. నీ యవ్వారం.. వరదా ముంపా…
నీ చుట్టూరా కళ్లేసి లోగుట్టే నమిలేసి లొట్టేసి ఊరాయే నోటనీళ్లు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే సొంగా కార్చుకుందే గుండె..
బెంగా నిదురను మింగేసిందే…సెయ్యాలే సేసేయ్యాలే’’
మళ్లీ ఓ వావ్… గంపా, దింపా, దుంపా, ముంపా…. గుండె సొంగ కార్చుకుందట, ఇక సేసెయ్యాల్సిందేనట…
అన్నింటికీ మించి… దీనక్క, దీనేషాలు, దీనందాలు… దీని అట… అవును, తెలుగు సినిమాల్లో నాయిక అంటే జస్ట్ ఓ సరుకు… అది, ఇది, దీని అనక ఏమంటారు అంటారా..? అంతేలెండి… ఈ పాట రచయిత భలే పట్టుకున్నాడు… అందుకే సరుకులు, సామాన్లు అని కూాడా రాసి పడేశాడు… తనకే తెలిసిన ఓ సినిమా మాండలికంలో..!!
Share this Article