యాదగిరిగుట్టకు వెళ్తుంటే అనిపించింది… అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది… దేశం మొత్తం దృష్టినీ తనవైపు తిప్పుకున్న ఆ బాలరాముడు బీజేపీని అక్కడ ఎందుకు శపించాడు..? అంతగా వారణాసి కారిడర్ డెవలప్ చేసినా సరే, మోడీ మెజారిటీ ఎందుకు పడిపోయింది కాశిలో… అలాగే యాదగిరిగుట్ట ఉండే ఆలేరులో 1800 కోట్ల ఖర్చుతో గుడికట్టిన కేసీయార్‌ను కాదని కాంగ్రెస్‌ను గెలిపించారు ఎందుకు..? చాలా విశ్లేషణలు ఉండొచ్చుగాక… కానీ కేసీయార్ ఆలోచనలు, ప్రణాళికలు, అడుగులకు స్థానిక జనం తిరస్కరణే కదా అది… అలాగే అనిపించింది…
కేసీయార్ పెద్ద ఇంజనీర్… అంత కాళేశ్వరం కట్టేశాడు… చివరకు మేడిగడ్డ వెక్కిరించింది… తను సుంకిశాల సంకల్పించాడు… మొన్న వాల్ కూలిపోయింది… పంప్ హౌజ్ మునిగిపోయింది… అంతకుముందు కాళేశ్వరం పంప్ హౌజులకూ మునకే కదా… తను వాస్తు, స్థపతి కూడా… పాత గుడిని తీసేసి, కొత్త బృహత్తర గుడి, కాళేశ్వరం రేంజ్ గుడి కట్టించాడు… అంతటి ఆయుత చండీయాగం చేశాడు, మస్తు హోమాలు చేశాడు, లక్ష పుస్తకాలు చదివాడు, తనకు తెలియందేముంది..?
సేమ్, కాళేశ్వరం… యాదాద్రి అని పేరు పెట్టి, యాదగిరిగుట్ట నర్సింహస్వామి ఇంటి ఇలవేల్పుగా పూజించే లక్షల మంది ఫీలింగ్స్‌ను దెబ్బతీశాడు… ఆ తరువాత బోలెడు వివాదాలు… స్థంభాల మీద తన బొమ్మలు, తన పథకాల బొమ్మలు… (తరువాత తీసేయించాడు)… ఉగ్ర మూర్తి, శాంతి మూర్తి వివాదం… (దేవుడి మొహాన్నే మార్చేశారని…) వర్షమొస్తే పైకప్పు ఊరుస్తుందని… దర్శనానంతరం కాసేపు కూర్చునే వెసులుబాటు లేదని… ఎండల్లో కాళ్లు చర్రుమంటాయని… అసలు కొండ పైకి వచ్చాక టాయిలెట్లే లేవని… లేడీస్, పిల్లలు, వృద్ధులకు నానా అవస్థలూ అని…
Ads
ఇవేకాదు, పైకి సొంత వాహనాలు వెళ్లనివ్వడం లేదని… చిన జియ్యరుడు పెట్టే తంపులు ఇంకా భిన్నం… లక్ష్మినర్సింహాస్వామి విగ్రహం కలిసి ఉండకూడదని… సంప్రదాయ అర్చకగణం కస్సుమని లేచేసరికి ఇక కిమ్మనలేదు… ఇలా చాలా… నిజానికి భద్రాచలం తరువాత మనకు తెలిసి ప్రభుత్వ ఖజానా డబ్బుతో ఓ గుడిని నిర్మించడం ఇదేనేమో… ఆలయవాస్తు, నిర్మాణం సూపర్బ్… కానీ, ఒక సగటు, సామాన్య, సంప్రదాయ భక్తుడికి… ఎప్పుడూ గుట్టకు వచ్చిపోయే భక్తుడికి… ఇది తన గుడి కాదు, ఇది మా నర్సన్న గుడి కాదు అన్నట్టుగా దాని ముఖచిత్రం మారిపోయింది… కోనేట్లో స్నానం చేయాలి, గుండు గీకించుకోవాలి, దర్శనం చేసుకోవాలి, తరువాత అక్కడే కాసేపు సేదతీరి ప్రసాదాలు తీసుకోవాలి, కొందరు ఆ బండల మీదే రాత్రి నిద్ర చేయాలి, పుట్టు వెంట్రుకలు తీయించాలి… ఇదీ ఆ గుట్టతో, ఆ గుడితో సగటు భక్తుడి అనుబంధం…
కానీ ఏమైంది..? ఓ ధనిక భక్తుల దేవుడయ్యాడు… అలా పైకి ఎక్కడం, దర్శనం, దండం, ప్రసాద స్వీకరణ, గుట్ట దిగిపోవడం… అంతే… కల్యాణ కట్ట దిగువనే… పుష్కరిణి స్నానాలు దిగువనే… నిద్రలూ దిగువనే… తిరుమలకు దీటైన గుడి అనే సంకల్పాన్ని ఆక్షేపించలేం… కానీ..? తిరుమల వందల ఏళ్లుగా భక్తుల్ని ఆకర్షిస్తోంది… ఈరోజుకూ సగటున 70 వేల మంది దాకా వస్తుంటారు… ఎప్పటికప్పుడు భక్తుల సౌకర్యాల మీద కాన్సంట్రేట్ చేయడం… అవస్థల్ని తగ్గించడం… కొండ పైన అన్నీ ఉంటాయి, భోజనం, వసతి, వెయిటింగ్ కంపార్టుమెంట్లలో టాయిలెట్స్, ఉచిత అల్పాహారం, పాలు, పైనే షాపులు, కల్యాణకట్ట… జనకళ…
అసలు సందడి, జాతర, హడావుడి, జనం ఉంటేనే కదా దేవుడికి కూడా కళ… అదుగో అదీ యాదాద్రిలో లేకుండా చేశాడు కేసీయార్ మొదట్లో..! చివరకు స్థానికజనం కూడా దూరమయ్యారు… తను ఏది సంకల్పిస్తే అది, అంతే, ఇక ఎవరూ ఏమీ చెప్పడానికి లేదు… అలా తనను సామాన్య భక్తులకు దూరం చేసిన కోపమేనేమో కేసీయార్‌కు నర్సన్న అనుగ్రహం లభించలేదు… అధికారం పోయింది… కొత్త సర్కారు వచ్చింది..? ఏమైనా మార్పు వచ్చిందా..? నిజంగానే మళ్లీ యాదగిరిగుట్ట అనే పేరును వాడుకలోని తీసుకొచ్చారా..? (తరువాత కథనంలో…)
Share this Article