Srini Journalist …….. నా మిత్రుడు ఒకరు jagan mohan rao అనే leftist రాసిన ఒక పెద్ద వ్యాసం fb లో షేర్ చేశారు. అందులో నుంచి ఒకటి రెండు పేరాలు ఇక్కడ నేను పోస్ట్ చేస్తున్నా…
ఈ ఉటంకింపులో చివరి వాక్యం మాత్రమే కమ్యూనిస్టులు తరచు ప్రయోగిస్తారు, కాని చాలా ప్రాముఖ్యత గల ముందు వాక్యాలను సాధారణంగా ఉటంకించరు. ‘మతం ప్రజల పాలిట మత్తు మందు’ అన్న వాక్యాన్ని కూడా మనం సరిగా అర్థం చేసుకుంటున్నామా అనే సందేహం నాకుంది. ప్రజలను మత్తులో జోకొట్టడానికి రాజ్యం మతాన్ని వినియోగించుకుంటుంది అనేది వాస్తవమే కాని మార్క్స్ ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు అని నాకు అనుపిస్తుంది. మార్క్స్ కాలంలో నల్లమందును బాధా నివారిణిగా ఉపశమనం కోసం ప్రజలు ఉపయోగించేవారు. మతం అటువంటి బాధానివారిణి అనే అర్థంలో మార్క్స్ ‘మతం ప్రజలకు నల్లమందు (opium of the people)’ అనే పదాలను వాడాడని నాకు అనిపిస్తుంది.
మతానికి ఉన్న ఈ రెండు కోణాలనూ దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులలో మతం పట్లా; ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటి మత గ్రంధాల పట్లా, పురాణాలు, రామాయణం, మహాభారతం లాంటి మత సాహిత్యం పట్లా; ఆయా మతాల్లో ఉండే రాముడు, జీసస్, అల్లా లాంటి దేవుళ్ళలో ప్రజల విశ్వాసం పట్లా, కమ్యూనిస్టులు ఎలా వ్యవహరించాలి అనేది జాగ్రత్తగా ఆలోచించాలి.
Ads
మొదటి విషయం. ఇక్కడ మనం మతానికి, మతోన్మాదానికి మధ్య తేడా స్పష్టంగా గుర్తించాలి. మతం అంటే ఒక వ్యక్తి తను నమ్మే దేవునిలో విశ్వాసాన్ని కలిగి ఉండడం. మతోన్మాదం అంటే తన మతమే గొప్పది అంటూ ఇతర మతాల మీదా, మతస్తుల మీద దాడి చేసే ఉన్మాదం. కమ్యూనిస్టులు మతాన్ని వ్యతిరేకించరు, మతోన్మాదాన్ని మాత్రమే వ్యతిరేకిస్తారు.
రెండో విషయం. మత విశ్వాసాలను, దేవుళ్ళనూ ఎవరు హేళన చేసినా సహించకూడదు. ప్రాచీన మత గ్రంధాలు ఆ నాటి సమాజంలో జన్మించినవి. ఆ దేవుళ్ళు కూడా ఆ నాటి సమాజం సృష్టించిన వారే. ఆ నాటి ఆచార వ్యవహారాలను, విశ్వాసాలను ఆ నాటి మత సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ప్రజలు మతం తో పాటు ఈ మత సాహిత్యాన్ని కూడా ఆరాధిస్తున్నప్పుడు, స్థలకాల పరిస్థితులను విస్మరించి, ఈ నాటి హేతువాదంతో ఆ మత గ్రంధాలను, మత సాహిత్యాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, హేళన చెయ్యడం తప్పు అవుతుంది. తప్పే కాదు, నేరమవుతుంది. ఇటువంటి ప్రవర్తన ఆయా మతాల ప్రజల మనోభావాలను గాయపరుస్తుంది. ఆయా మతాలలో మతోన్మాదం బలపడడానికి దారి తీస్తుంది.
దేవుళ్ళ మీదా, ఆయా మతాలు పూజించే పురాణాలు, కావ్యాల మీదా దాడిని భావప్రకటనా స్వేచ్ఛ అంటూ కొంతమంది వామపక్ష వాదులు సమర్థించడాన్ని మనం చూస్తున్నాం. భావాలు తుపాకుల వంటివి. సమాజ హితం కోసం తుపాకులను నిషేధించినట్లే ఒక్కొక్కసారి భావాలను కూడా నిషేధించాల్సి వస్తుంది. భావ ప్రకటనా స్వేచ్ఛ అమూర్తమైనది కాదు, నిర్దిష్ట స్థలకాల పరిస్థితులను బట్టి ఉంటుంది. ఏ మతాన్నయినా అగౌరవపరిచే, దేవుళ్ళ కించపరిచే వ్యాఖ్యలను కమ్యూనిస్టులు సమర్థించకుండా నిర్ద్వంద్వంగా ఖండించాలి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మతం మీద దాడిని అనుమతించకూడదు. కమ్యూనిస్టులు మతోన్మాదాన్ని వ్యతిరేకించాలి కాని మతాన్ని కాదు.
అయితే కమ్యూనిస్టులు నాస్తికత్వాన్ని ప్రచారం చెయ్యకూడదా? ప్రతీ అంధ విశ్వాసాన్నీ, దురాచారాన్నీ ప్రశ్నించకుండా మౌనంగా ఉండాలా? అనే ప్రశ్న ఇక్కడ ఎదురవుతుంది.
కమ్యూనిస్టులు నాస్తికత్వాన్ని శాస్త్రీయమైన పద్ధతిలో ప్రచారం చెయ్యాలి కాని మతాన్ని హేళన చెయ్యకూడదు. అలాగే మత గ్రంధాలను కూడా శాస్త్రీయ పద్ధతిలో విమర్శించాలి. ఈ శాస్త్రీయ పద్ధతికి ఒక ఉదాహరణ – ఆరుద్ర గారు రామాయణం గురించి రాసిన పుస్తకం. హిందూ మతోన్మాదులు ఎవరూ ఆరుద్ర మీద విరుచుకుపడలేదు. ఒకవేళ విరుచుకు పడ్డా దానికి శాస్త్రీయంగా సమాధానం చెబుతూ అభ్యుదయవాదులు అండగా నిలవవచ్చు. కాని మత విమర్శ పేరుతో హేళన, కుతర్కం, వెకిలి వ్యాఖ్యలు కమ్యూనిస్టులు అనుమతించకూడదు.
ఒక విశ్వాసానికి, ఆచారానికి కాలం చెల్లినప్పుడు, దాన్ని అంధ విశ్వాసంగానూ దురాచారం గానూ ఆ మతస్తులు కూడా గుర్తించడం జరుగుతుంది. మత విశ్వాసాలూ, ఆచారాలూ సమాజానికి ఇబ్బందికరంగా పరిణమించినప్పుడు, మారిన పరిస్థితులకు అనుగుణంగా లేనప్పుడు, ఆ మత అనుయాయుల నుంచే సంస్కరణల కోసం పోరాటం ప్రారంభమవుతుంది. ఇది చరిత్రలో మనం చూస్తున్నదే. కమ్యూనిస్టులు ఆయా మతాలలోని సంస్కర్తలను ప్రోత్సహించాలి, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటంలో వారికి అండగా నిలవాలి, కాని వెలుపల నుండి తమ నమ్మకాలను, భావాలను బలవంతంగా ఆ మత అనుయాయుల మీద రుద్ద కూడదు. అటువంటి ప్రయత్నాలు బెడిసికొడతాయి.
హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకించడంలో మనకి ఒక సౌలభ్యం ఉంది. హిందువులలో ఏకేశ్వరోపాసన లేదు. గ్రామ దేవతలతో సహా లెక్క వేస్తే హిందువుల దేవుళ్ళు కోట్ల సంఖ్యలో ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ లో అనుకుంటా – హిడింబికి కూడా ఒక గుడి ఉందని విన్నాను. తగిన విధంగా చెబితే సామాన్య హిందువు తేలికగా ఇతర దేవుళ్ళను కూడా గౌరవిస్తాడు. హిందూమతంలో సంస్కరణ కోరేవారిని ఉపయోగించుకుని ఆ విధంగా చెప్పించి మత సామరస్యాన్ని పెంపొందించాలి.
ఏ మతానికి చెందిన వారైనా సామాన్య ప్రజలు ప్రశాంతంగా జీవించాలనుకుంటారు. అన్య మతస్తులతో కలిసి మెలిసి బతకాలనుకుంటారు. హిందువులలో ఎంతోమంది బిడ్డల కోసం, దెయ్యాలు, గాలి వదలించుకోసం మసీదులకు వెళ్ళడం, తమ బిడ్డలకు మస్తాన్ వంటి పేర్లు పెట్టుకోవడం చూస్తున్నాం. హిందూ రైతులు పంటలు బాగా పండినప్పుడు మసీదుల్లో బెల్లం పంచడం చూస్తున్నాం. అలాగే సాధారణ ముస్లిం కూడా హిందువులతో కలిసి మెలిసే బతకాలనుకుంటాడు. కాని మీడియాలో కలిసి మెలిసి జీవించాలనే సామాన్యుడి గొంతు వినిపించదు. మీడియాలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వారి గొంతుక మాత్రం వినిపిస్తుంది…
Share this Article