.
Chakrapani Ghanta
……… మన పక్కనే మరో ప్రపంచం! గ్లోబలైజేషన్ ప్రేమికులు ప్రపంచం ఒక కుగ్రామం అయిందని పదే పదే చెపుతుంటారు. ఆ ప్రేమికులు ఈ పదబంధాన్ని రెండు కారణాలు చూపి వాడుతుంటారు, ఒకటి ఆర్ధిక, వాణిజ్య లావాదేవీలు- పెట్టుబడులు వగైరాలు.
రెండోది సాంకేతికత సమకూర్చిన అనుసంధాన వ్యవస్థలు. చైనా ఈ రెండింటి విషయాల్లోనే కాదు మనం భ్రమలో ఉన్న అనేక విషయాల్లో స్పష్టంగా, స్వతంత్రంగా ఉంది. ప్రపంచీకరణ పడగ నీడ కూడా ఆ నేలమీద పడకుండా డ్రాగన్ ఒక ఉక్కు కవచాన్ని నిర్మించి ఉంచింది. అక్కడి సామాన్యుడికి వేరే ప్రపంచమేదో ఉందనే ఊహ కూడా రాకుండా నేనే ప్రపంచం అనే నమ్మకాన్ని, నాదే అసలయిన ప్రపంచం అనే ఆత్మ నిర్భరత (!) ను కలిగించింది.
Ads
ఇరవయ్యేళ్ల ముందు నేను రెండు సంవత్సరాల పాటు చైనా అధ్యయనంలో ఉన్నాను. న్యూ యార్క్ నగరంలోని న్యూ స్కూల్ యూనివర్సిటీ లో ఉన్న India China Institute మొదటి బాచ్ ఫెలోగా నాకు చైనాపైన ప్రపంచీకరణ ఆర్ధిక సామాజిక అసమానతలు అనే అంశం మీద అధ్యయనం చేసే అవకాశం లభించింది.
అప్పుడు ఆంధ్రజ్యోతిలో “ మంచైనా చెడైనా అది జన చైనా” పేరుతో ఆదివారం అనుబంధం విస్తృత కవర్ పేజీతో సహా దాదాపు 20 వ్యాసాలు రాశాను. ఇంగ్లీషులో ఒక పుస్తకం, రెండు పుస్తకాల్లో ఐదారు చాప్టర్లు వచ్చాయి. వాటి గురించి తరువాత మాట్లాడుకోవచ్చు. కానీ ప్రపంచమంతా ప్రపంచ దిగ్గజ పెట్టుబడి దారిలో తప్పిపోయిన ఈ ఇరవై ఏళ్ల కాలంలో చైనా ఎలా నిలబడింది అనేది ఆసక్తి కలిగించే అంశం. అలాగే చైనా ఈ ప్రపంచాన్ని ఎక్కడికి తీసుకువెళ్లబోతోంది అనేది విస్మయం కలిగించే విషయం.
- ఇది నేను గమనించింది, నాకు అర్థమైన కోణం మాత్రమే! చైనా అత్యంత (ప్ర)గతి శీల సమాజం ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థం కావచ్చు, అసలు అర్థమే కాకపోవచ్చు! కాబట్టి అర్థమైన వాళ్లకు అర్థమైనంత.
మార్కెట్ ఎకానమీ అందించిన సుఖాలకు అలవాటు పడ్డ మనం చైనా వెళితే ఖచ్చితంగా కొన్ని అలవాట్లు వదిలేసి, కొత్త అలవాట్లు నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే చైనీకరణ చెందాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజువారీ పనులు, వాడే వస్తువులు, సౌకర్యాలు, సేవలు మారిపోయాయి. ఒక రకంగా పాత ఆప్స్ ఆఫ్ లోడ్ చేసుకొని చైనా యాప్స్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది…
ఉదాహరణకు ఈ తరం ప్రపంచంలో ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో దిగాక ఉబర్ కోసం వెతుకుతారు. చైనాలో ఉబర్ ఉండదు. దానికి బదులు దీదీ/డిడి ఉంటుంది. అది బుక్ చేసుకోవాలంటే, వి చాట్ ఉండాలి. వి చాట్ మన వాట్సాప్ లాంటిది. దానితో పాటు పేమెంట్ ఆప్ కూడా. అక్కడ వాట్స్ అప్ ఉండదు. విచాట్ కావాలంటే చైనా సిమ్ వాడాలి. వేరేదేశం సిమ్ నెట్వర్క్ ను చైనా నమ్మదు. వాటికి అనుమతి లేదు.
చైనా డిజిటల్ ప్రపంచం పూర్తిగా స్వతంత్రంగా ఉంది. వాళ్లు తామే యాప్‌లు తయారు చేసుకుని, వాటినే వాడుతారు. ప్రభుత్వం గట్టి నియంత్రణ, నిఘా ఉంచుతుంది. ఇంటర్నెట్‌పై పూర్తిగా పర్యవేక్షణ (surveillance) ఉంటుంది.
చైనా ప్రభుత్వం ఇంటర్నెట్, సోషల్ మీడియా, యాప్‌లపై చాలా కఠినంగా నిఘా పెడుతుంది. (విదేశీ సిమ్ లు రోమింగ్ అడపా దడపా కాల్ చేసుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు )
ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఉపయోగించే గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి యాప్‌లు చైనాలో పనిచేయవు. వాటి బదులుగా చైనా తానే కొత్త యాప్‌లు, సేవలు తయారు చేసుకుని వాడుతోంది. చైనాలోని ప్రతి యాప్ మీద ప్రభుత్వానికి పర్యవేక్షణ ఉంటుంది.
ప్రపంచమంతా గూగుల్ సెర్చ్ వాడితే చైనా తన సొంత Baidu వాడుతుంది. గూగుల్ ఇక్కడ పనిచేయదు. WhatsApp కు బదులు WeChat, Facebook, twitter కు బదులు Weibo / WeChat Moments
అలాగే instagram బదులు Xiaohongshu (Little Red Book), YouTube కు ప్రత్యామ్నాయంగా Youku, Bilibili, Tencent Video, Google Maps కు Baidu Maps, Amap (Gaode) ఉంటాయి.
ప్రపంచం వాడే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు చైనాలోనే తయారైనా చైనాలో వాడే ఫోన్లలో మాత్రం Google Play Store ఉండదు. Huawei AppGallery, Oppo Store, Xiaomi Store ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు అన్నీ Alipay, WeChat Pay ద్వారానే జరుగుతాయి.
- ఎందుకలా అని ఒక మిత్రుణ్ణి అడిగా… చైనా ఒక పెద్ద దేశం. ఇక్కడ 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ఇంత పెద్ద దేశంలో సామాజిక స్థిరత్వం, భద్రత, ప్రజల మేలు కోసం ఒక ప్రత్యేకమైన డిజిటల్ మార్గాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం అన్నాడు.
ఆయన ఒక ప్రొఫెసర్ డీప్సీక్ అభివృద్ధి చేసిన టీమ్ లో ఒకరు. మేము గోప్యత, భద్రత, సామాజిక సమన్వయానికి కి ప్రాధాన్యం ఇస్తాము. మేము జాతీయ డిజిటల్ స్వావలంబన (Digital Sovereignty) సాధించాము. ప్రపంచమంతటా మా సాంకేతికత కు ఆధారణ లభిస్తోంది అన్నాడు.
అంతే కాదు. చైనా ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ సాంకేతిక సామ్రాజ్యానికి అధిపతి కాబోతుంది అన్నారు. గడిచిన వారం చైనా ఆవిష్కరణలు చూసినప్పుడు నిజమే చైనా మరో ప్రపంచాన్ని నిర్మిస్తోంది అనిపిస్తోంది.
వాటి గురించి మరెప్పుడైనా!
Share this Article