.
తెలంగాణ పాలిటిక్స్… ఎవరికైనా సరే, టేకిట్ ఫర్ గ్రాంటెడ్… తెలంగాణ సమాజం అంటే పోరాటం, ధిక్కారం, చైతన్యం అని అన్నీ చెప్పుకుంటాం… కానీ నాయకుల ఇష్టా‘రాజ్యం’ ఇది…
అన్నతో ఆస్తుల కొట్లాట పెట్టుకుని, ఏదో పార్టీ పెట్టి, నేను ఉద్దరిస్తా అని పాదయాత్ర చేసింది షర్మిల చెల్లె… తిరిగీ తిరిగీ, మళ్లీ అదే ఏపీకి వెళ్లి, ఏ అన్నను జైలుపాలు చేసిందో అదే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యింది… ఐరనీ… ఇంకా అక్కడ రాజన్నరాజ్యం రావల్సి ఉంది…
Ads
పదేళ్లు అధికారంలో ఉండీ ఉండీ… ఓ నియంతలా పాలించీ పాలించీ… తీరా జనం తిరస్కరించాక, నో మీ తీర్పు తప్పు, నేను చేసేదే ఒప్పు అని అలిగి, అసలు ఫామ్ హౌజునే వీడిరాను, జనంలో ఉండను అని తలుపులు బిడాయించుకుని అజ్ఞాతంలో ‘ప్రజాజీవితం’ గడుపుతున్న కేసీయార్ కథ తెలిసిందే…
బాబ్బాబు, నువ్వే పాలించు అని లక్షలాదిగా జనం రోజూ ఫామ్ హౌజ్ చుట్టూ గిరిప్రదక్షిణలు చేస్తే తప్ప స్వామివారు అలక వీడి రాడు… ఈ రాష్ట్ర ప్రజలను పాలించడం స్వామి వారి కరుణ, ప్రజల ప్రాప్తం… తెలంగాణ రాజకీయాలు కదా, ఏం చేసినా టేకిట్ ఫర్ గ్రాంటెడ్..!!
చంద్రబాబు… మీ తెలంగాణ వద్దూ, మీరూ వద్దు, ఇక నేను ఇంకా ఇంకా కొత్త సైబరాబాదులను నిర్మించలేను, మీరే నన్ను తరిమేస్తున్నారు అని కార్యక్షేత్రం వదిలేసి పారిపోయిన ఓ ఖడ్గతిక్కన… తెలంగాణ వ్యతిరేకతను పెద్దగా ఎప్పుడూ దాచుకోని ఆంధ్రాబాబు… ఇప్పుడు మళ్లీ బీజేపీ, జనసేన భుజాలుగా కూటమిగా వచ్చి, జెండా పాతేస్తాడట… తెలంగాణ రాజకీయాలు, ఎవరికైనా టేకిట్ ఫర్ గ్రాంటెడ్…!!
తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు నిద్రాహారాలు మాని, విషాదగానాలతో విలపించిన తాజా సనాతన ధర్మపరిరక్షకుడు పవన్ కల్యాణ్‌కు కూడా ఇప్పుడు తెలంగాణ మీద పట్టు కావాలట… తెలుగుదేశం వెనుకాలే నక్కి, బీజేపీ కరతాళ ధ్వనుల నడుమ మళ్లీ తెలంగాణలోకి అరుదెంచి, ఇక్కడ ధర్మపరిరక్షణ చేస్తాడట… తెలంగాణ బీజేపీ తలొగ్గి, సాగిలబడి స్వాగతం పలకాలట… పునీతం కావాలట… తెలంగాణ రాజకీయాలు, ఎవరికైనా టేకిట్ ఫర్ గ్రాంటెడ్…!!
మరొక అమ్మవారు… పేరు మీనాక్షి నటరాజన్… మొన్నమొన్నటి దాకా ఎవరికీ ఊరు తెలియదు, పేరు తెలియదు, మొహం తెలియదు… ఇప్పుడు హఠాత్తుగా ఆమె కూడా పాదయాత్రకు రెడీ అట… ఆమే కాంగ్రెస్ కేడర్‌తో చర్చలు జరుపుతుంది, సమీక్షలు చేస్తుంది… ఆమే ముఖ్యమంత్రి, ఆమే పీసీసీ అధ్యక్షురాలు… ప్రజలంతా ఆమెకు కష్టాలు చెప్పుకోవాల్సిందిగా మనవి… ఎందుకనగా, ఇప్పుడు ఆమే కొత్త ఉద్దారకురాలు…
ఆమె ఎవరు..? ఆమెకు వోట్లేశామా..? రావమ్మా మహాలక్ష్మి అని ప్రార్థించామా..? ఈరోజు ఆమెను తీసేస్తే మళ్లీ తెలంగాణ మొహం కూడా చూడదు కదా అనే పిచ్చి ప్రశ్నలు వేయకండి ప్లీజ్… ఎందుకంటే..? తెలంగాణ రాజకీయాలు కదా… ఎవరికైనా టేకిట్ ఫర్ గ్రాంటెడ్…!! అసలే ఇది పోరాటనేల, ధిక్కారమట్టి, చైతన్యజ్వాల… ఎవరు ఏరకం రాజకీయాలు చేసినా… మారుమాట్లాడని అడ్డా… ఆమోదించే గడ్డ..!!
Share this Article