.
స్వీడన్ అనగానే మనకు అందమైన దేశం… నేరాలు పెద్దగా లేని ఆనంద సమాజం గుర్తొస్తాయి కదా… ప్రత్యేకించి స్కూలింగ్ ఆడపిల్లలు అంటే అప్పుడప్పుడే టీన్స్‌లోకి ప్రయాణించే అమాయకపు మొహాలు గుర్తొస్తాయి కదా…
కానీ సీన్ మారుతోంది… భిన్నమైన సీన్స్ కనిపిస్తున్నాయి… స్వీడన్ ప్రశాంతత ఎగిరిపోతోంది… గ్యాంగ్ వాార్స్ రోజువారీ వార్తలు అయిపోయాయి… కాల్పులు, బాంబు దాడులు తరచూ జరుగుతున్నాయి… ఈ నేర చిత్రానికి మరో చీకటి కోణం ఏమిటంటే..? పదిహేనేళ్లలోపు బాలికలు కూడా గ్యాంగ్‌ల కోసం నేరాలు చేస్తున్నారు… కాదు, చేయించబడుతున్నారు…
Ads
15 ఏళ్ల బాలిక ఉదంతం
స్టాక్‌హోమ్‌లో ఒక 15 ఏళ్ల బాలికను గ్యాంగ్ ఒక పని చేయమని ఒత్తిడి చేసింది… ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చారు…
-
ఒక తలుపుపై కాల్పులు జరపమని,
-
నేరుగా ఒక మనిషి తలపై గురి పెట్టమని.
ఆమె రెండో ఆప్షన్ ఎంచుకుంది… కాల్పులు మాత్రం ఆమెతో ఉన్న 17 ఏళ్ల అబ్బాయి చేశాడు… బాధితుడు మెడ, పొట్ట, కాళ్లలో తూటాలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు…
“అబ్బాయిలకంటే మేము కఠినం”
ఇలా ఎందుకు..? ప్రాసిక్యూటర్ ఇడా ఆర్నెల్ చెబుతోందిలా… గ్యాంగ్‌లకు పనిచేయాలంటే క్రూరత్వం కావాలి, హ్యూమన్ ఎమోషన్స్, సెన్సిటివిటీలు పట్టించుకోకూడదు… ఎంపిక చేయబడిన అమ్మాయి అలా నేరం చేయగలదా లేదా చూసే పరీక్ష అన్నమాట అది…
ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఎన్క్రిప్టెడ్ యాప్స్ (మెసేజింగ్ యాప్స్)లో గ్యాంగ్‌లను సంప్రదించి, “మేమే అబ్బాయిలకంటే ధైర్యంగా, కఠినంగా ఉంటాం” అని నిరూపించుకోవాలని చూస్తున్నారు…
2023లోనే 280 మంది బాలికలు (15–17 ఏళ్ల వయసు) హత్య, హత్యాయత్నం వంటి నేరాలకుగాను కేసులు ఎదుర్కొన్నారు… అందరూ గ్యాంగ్‌లతో లింక్ అయి ఉండకపోయినా, మెజారిటీ అలాంటివాళ్లే… నేరాల్లో టీనేజీ అమ్మాయిల ఇన్వాల్వ్‌మెంట్‌ను చాలా ఏళ్లుగా తక్కువ అంచనా వేశారని స్వీడన్ నిపుణులు అంటున్నారు…
అమ్మాయిలే ఎందుకు..?
కొన్నాళ్లుగా గ్యాంగ్‌లు చిన్నారులను (15 ఏళ్లు నిండని వారిని) వాడుకోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే… నేరనిరూపణ జరిగినా సరే, వారికి చట్టపరమైన శిక్షలు పెద్దగా వర్తించవు... గ్యాంగ్ లీడర్లు కూడా ప్రధానంగా విదేశాల నుంచే, యాప్స్ ద్వారా ఆదేశాలు ఇస్తున్నారు…
మానసిక గాయాలు – వ్యసనాలు
ఒక మహిళా సహాయక సంస్థ అధ్యయనంలో తేలింది ఏమిటంటే… ఈ బాలికల్లో చాలామంది మానసిక గాయాలు (ట్రామా)తో బాధపడుతున్నారు… చాలా మందికి డ్రగ్స్ వ్యసనం ఉంది… డ్రగ్ నేరాల్లో ఉన్న అమ్మాయిలలో రెండు లేదా మూడవ వంతు లైంగిక దాడుల బాధితులే…
ప్రభుత్వ ఆందోళన
“అమ్మాయిలను ఎప్పుడూ బాధితులుగా మాత్రమే చూస్తాం… కానీ వారు నేరాలలో భాగమవుతున్న స్థాయి ఇప్పటివరకు ఊహించిందే కంటే ఎక్కువ…” అని స్వీడన్ జస్టిస్ మినిస్టర్ గున్నార్ స్ట్రోమ్మర్ అంగీకరించాడు… అక్టోబర్‌లో స్వీడన్ నేషనల్ క్రైమ్ ప్రివెన్షన్ కౌన్సిల్ ఈ సమస్యపై పూర్తి నివేదికను విడుదల చేయనుంది… ఇది స్వీడన్ సమాజానికి ఇది కొత్త ముప్పు…
Share this Article