‘సౌత్ గ్రూపు’తో సంబంధమేమిటి..?… సాక్షి… పదిఫోన్లు ఎందుకు మార్చారు… వెలుగు… సెల్ ఫోన్ల ధ్వంసమేల..? ఆంధ్రజ్యోతి… ఇలా రకరకాల పత్రికలు సీబీఐ టీం ఎమ్మెల్సీ కవితను ఏమేం ప్రశ్నలు అడిగాయో రాసిపారేశాయి… అసలు ఈ విచారణకు లైవ్‌లో ప్రసారం చేయాలంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిన్న చేసిన డిమాండే పెద్ద నవ్వులాట అయిపోయింది… చివరకు ఆ పార్టీ దురవస్థ అది… మీడియా కథనాలు కూడా నారాయణ బాటలోనే ఉన్నాయి…
ఆరు గంటలా..? ఏడు గంటలా..? విచారణ జరుగుతున్నంతసేపూ సినిమాల్లో చూపించినట్టుగా చెప్పు, చెప్పు అంటూ ప్రశ్నలు వేయదు సీబీఐ… ప్రధానంగా మైండ్ గేమ్ ఉంటుంది… నిందితుడు లేదా నిందితురాలిని ఫస్ట్ మెంటల్‌గా బ్రేక్ చేసి, తరువాత కావల్సిన జవాబులు రాబట్టే ప్రయత్నం చేస్తారు… చాలాసేపు ఊరికే కూర్చోబెడతారు… ఏవో ప్రశ్నలతో మొదలుపెట్టి, ఎటో తీసుకుపోయి, హఠాత్తుగా ఈ కేసులోకి వస్తారు, అదీ పరోక్షంగా…
సరే, సీబీఐ ప్రశ్నించే పద్ధతిని సగటు స్టేట్ క్రైం పోలీసులు అనుసరించే పద్ధతితో పోల్చలేం గానీ… నువ్వు ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశావో చెప్పు, అసలు అన్ని ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది..? ఆ లిక్కర్ స్కాం సౌత్ గ్రూపుతో నీకు సంబంధమేమిటి..? ఇలాంటి ప్రశ్నల్ని ఈ కేసును ఫాలో అయ్యేవాళ్లెవరైనా ఊహించవచ్చు… అలా అడిగి ఉంటారని ఊహించి, అలా రాయబడిన కథనాలే ఇవన్నీ… లేకపోతే సీబీఐ టీం స్టేట్ మీడియాకు లీక్ చేయదు కదా… పైగా తెలుగు మీడియాకు…
Ads
పోనీ, కవిత చెప్పి ఉంటుందా..? ఆమె అసలు నోరే విప్పలేదు… నేరుగా ప్రగతి భవన్ వెళ్లిపోయింది… (ఏదో ఘనవిజయం సాధించినట్టుగా తన పరామర్శకు వచ్చిన వారిని చూస్తూ విక్టరీ సింబల్ చూపించడం ఏమిటో ఆమెకే తెలియాలి…) విచారణ తీరును తండ్రికి చెప్పి ఉంటుంది… కేసీయార్ అప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, ముత్తా గోపాలకృష్ణకు ఫోన్లు చేసి, నా కూతురిని ఇలాంటి ప్రశ్నలు అడిగారండీ అని చెప్పి ఉండడు కదా… దిశ అనే డిజిటల్ పేపర్ మరీ ఎక్స్‌ట్రీమ్… అప్పుడే ఆర్టికల్ 20 దాకా వెళ్లిపోయింది… (ఇలాంటి రిపోర్టింగ్ ఆంధ్రజ్యోతి యూనిక్ ఫీచర్… ప్చ్, అందరూ కాపీ కొట్టేస్తున్నారు…)
మొన్న 160 సెక్షన్ కింద నోటీసులు ఇస్తే చర్చ… తరువాత 41 నోటీసులు ఇస్తారా అని..! ఇప్పుడు సీబీఐ టీం వెళ్తూ వెళ్తూ 91 సెక్షన్ కింద నోటీసు ఇస్తామని వెల్లడించారట… వాళ్లు కోరిన ఆధారాల్ని, డాక్యుమెంట్లను నిందితురాలే వెళ్లి అందించాల్సి ఉంటుంది… లేదా ఆమె సూచించిన వ్యక్తులు…
ఈ సాంకేతికాంశాలు, విచారణ వ్యవధి కావు అసలు విషయం… ఆమెను పక్కాగా ఆ లిక్కర్ స్కాం కేసులో ఫిక్స్ చేస్తున్నారు అనేది గమనార్హం… ఫలానా ముఖ్యమంత్రి కూతురు ఫలానా స్కాంలో నిందితురాలు, సీబీఐ విచారిస్తోంది అనే ప్రచారం జరుగుతూ ఉంటుంది… మీడియాలో నెగెటివ్ కవరేజీ వద్దని ఎంత కోరుకుంటున్నా, అనివార్యంగా వార్తలు వస్తూనే ఉంటాయి… అసలు చార్జి షీట్‌లో ఆమె పేరు యాడ్ చేస్తారా..? అరెస్టు చేస్తారా..? ఆమె కోర్టు విచారణకు వెళ్లకతప్పదా..? అనేవి తదుపరి తేలాల్సిన విషయాలు..!!
Share this Article