.
( యండమూరి వీరేంద్రనాథ్ ) ….. స, ని, ద, ప, మ: పిల్లల్ని దండించే ముందు ఐదు అంశాల్ని గుర్తుంచుకోవాలి. సులభంగా ఉండటం కోసం వాటికి స, ని, ద, ప, మ అని పేరు పెట్టుకుందాం.
1. సహేతుకత: కోపం చర్య (యాక్షన్) కాదు. అవతలి వారి చర్యకి మన ప్రతిచర్య (రియాక్షన్). మీకు ప్రమోషన్ వచ్చిన రోజు, మీ పిల్లవాడికి ఒక సబ్జెక్ట్‌లో మార్కులు కాస్త తక్కువ వచ్చినా పెద్దగా పట్టించుకోరు. ఆ విధంగా మన ప్రతిస్పందన మన మూడ్ మీద ఆధారపడి ఉంటుంది.
Ads
గృహకలహాల వల్ల కానీ, ఆఫీసులో పని ఒత్తిడి వల్ల కానీ, పక్కింటావిడ కాఫీ బావుందని మొగుడు మెచ్చుకున్నప్పుడు గానీ మూడ్ పాడవుతుంది. చిన్న పొరపాటుకి కూడా అమితమైన కోపం వస్తుంది. కాబట్టి పిల్లల్ని దండించే ముందు ‘ఆ దండన కరెక్టేనా? బయటి ఒత్తిళ్ళ పై ఆధారపడి ఉన్నదా?’ అన్నది నిర్ణయించుకోవాలి. అదీ సహేతుకత.
2. నిర్ధారణ: మీరు మీ కుటుంబానికి మొదటి షో సినిమా టిక్కెట్లు తీసుకున్నారు. నాలుగింటికి రావలసిన పిల్లవాడు అయిదయినా రాలేదు. స్కూలు బస్సు వచ్చి వెళ్ళిపోయింది. సమయం గడిచే కొద్దీ మీ ఇరిటేషన్ పెరుగుతోంది. అప్పటికే సినిమా టైమ్ దాటి, పెట్టిన ఖర్చు వృధా అయిపోయింది.
ఈ సమయంలో పిల్లవాడు ఆటోలో ఇంటికి వచ్చాడు. కట్టలు తెంచుకుంటూన్న కోపంతో “ఆటోలో ఎందుకు వచ్చావ్” అని అడిగారు. బస్సు మిస్ అయిందన్నాడు. “అప్పటి వరకూ ఏం రాచకార్యాలు వెలగ పెడుతున్నావ్” అని చెంప ఛెళ్లుమనిపించారు.
కానీ జరిగిన సంగతి ఏమిటంటే, ఒక కిండర్-గార్టెన్ కుర్రవాడు బస్సు మిస్ అయ్యాడు. ఎవరూ చూసుకోలేదు. మీ అబ్బాయి వాడిని ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకు వెళ్ళి అప్పచెప్పాడు. ఇంతలో అతడి బస్సు వెళ్ళిపోయింది.
ఎంత మంచి కారణం..! మెచ్చుకోవలసింది పోయి, అతడు వివరాలు చెప్పక ముందే కొట్టారు. మీ మనస్సు చివుక్కుమంది. కానీ అప్పటికే ఒక తప్పు జరిగిపోయింది. దండించే ముందు నిజంగా తప్పు జరిగిందా లేదా అని సరి చూసుకోవటమే నిర్ధారణ.
3. దండన: దండన ఎంత ఘాటుగా ఉండాలనేది ముందే కరెక్ట్‌గా నిశ్చయించుకోవాలి. కొందరు ఒకటి కొట్టి, తిట్టటం ప్రారంభించి, ఆ తిట్లవల్ల బి.పి. ఎక్కువై మరొకటి కొట్టి, మరింత ఆవేశపడి మెడపట్టుకుని వంచి, కోపం ఆగక బెల్టు తీస్తారు.
సగం కొట్టి, ‘నీ వయసులో నేను’ అంటూ మళ్ళీ కొడతారు. మరి కొందరు అలగా జనం, కొడుతుండగా ఆవేశం ఎక్కువై పొయ్యిలో మండుతున్న కర్ర కూడా తీస్తారు. ఇది… అవతలివారి నిస్సహాయత మీదా, వారు ప్రతిఘటిoచ లేరన్న శాడిజం వల్లా వచ్చినది.
కొంతమంది మరో రకం. దురంతో ఎక్స్-ప్రెస్ లా చిన్న తప్పుకి కూడా పిల్లల్ని, కుదిరితే భార్యని, గంటల పాటూ ఆగకుండా తిడుతూనే ఉంటారు. మరి కొంతమంది అజీర్తి పేషెంట్లు రోజంతా కొద్దికొద్దిగా తిడుతూనే ఉంటారు. ప్రొద్దున్న కొద్దిగా తిట్టి, సాయంత్రం ఆ విషయం గుర్తు రాగానే మళ్ళీ తిడతారు. మూడు రోజుల క్రితం చేసిన తప్పుని కూడా ఎద్దేవా చేస్తూ ఉంటారు. దీనివల్ల పిల్లలకి వీరి తిట్ల మీద గౌరవం పోతుంది.
4. పరామర్శ: దండన అయిపోయిన కొంచెం సేపటికి వెళ్లి పిల్లల్ని పరామర్శించాలి. వాళ్ళవి లేత మనసులు. ఎంత తిట్టినా వాళ్ళు పెద్దల ఆప్యాయత కోసం తపన పడుతూనే ఉంటారు. కొందరు పెద్దలు తమ గదిలోకి వెళ్ళిపోయి, ఇక ఆ సబ్జెక్ట్ అసలు మాట్లాడరు.
‘కొట్టటం తమ హక్కు’ అన్నట్టూ ప్రవర్తిస్తారు. కొంతమంది దండించిన చాలా సేపటివరకూ మామూలు మనుషులు కాలేరు. పిల్లల్తో మామూలుగా ఉండలేరు. కొందరయితే రోజుల తరబడి ముభావంగా ఉంటారు. అది తప్పు.
మరి కొందరు తీసుకెళ్ళి ఏ చాక్లెట్టో కొనిపెడతారు. అది మరీ తప్పు. “వారు నన్ను కొట్టారు. తమ తప్పు గుర్తించారు. అందుకు గిల్టీగా ఈ బహుమతి ఇచ్చారు.” అని పిల్లలు భావిస్తారు. మరోసారి మీరు కొట్టినప్పుడు, తప్పుకు అది శిక్ష అని భావించరు. మరో చాక్లెట్ వస్తుందని ఆశిస్తారు. పైగా “ఇంకా వీరికి (ఈ పెద్దలకి) బుద్ధి రాలేదన్నమాట” అనుకుంటారు.
పిల్లల్ని, ముఖ్యంగా టీన్స్‌ని దండిoచవలసి వస్తే దండించండి. కానీ కొంచెం సేపయ్యాక వారు చేసిన పని మీకు ఎందుకు నచ్చలేదో వివరించటానికి ప్రయత్నించండి. ‘… నీ మీద నా ప్రేమ ఈ చర్యతో తగ్గదు. నువ్వు చేసిన ఈ పని/ప్రవర్తన మాకు అంగీకారయోగ్యం కాదు. దీనికీ, ప్రేమకీ ఏమాత్రం సంబంధం లేదు’ అన్న విషయం వాళ్ళకు అర్థమైయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో స్పష్టంగా చెప్పాలి.
అయితే ఇలా ప్రతి రోజూ చెయ్యకూడదు. చాకిరేవులో ఉతికినట్టు రోజుకొకసారి తిట్లతో ఉతికి, సాయంత్రాలు క్షమాపణలతో నీట్‌గా ఇస్త్రీ చేస్తానంటే ఏం లాభం?
5. మర్యాద: ‘పిల్లలకి మర్యాద ఏమిటి?’ అనవద్దు. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి కూడా ఆత్మాభిమానం ఉంటుంది. ‘ఫలానా విషయంలో నువ్వు మంచివాడివే కానీ ఇదిగో ఈ విషయంలో ఇలా చేస్తున్నావ్’ అని ఒక ప్లస్ పాయింట్, ఒక మైనస్ పాయింట్ కలిపి చెప్తే, వాళ్ళ ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూనే, మరో వైపు వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపినట్టు ఉంటుంది.
పిల్లవాడు చూస్తూ ఉండగా తండ్రి తల్లిని కొట్టాడు. “అవతలివారు చేస్తున్న పని నాకు నచ్చకపోతే నేను వారిని కొట్టవచ్చన్నమాట” అన్న అభిప్రాయం ఆ పిల్లవాడిలో చిన్న వయసులోనే స్థిర పడిపోతుంది.
స, ని, ద, ప, మ తాలూకు నిర్వచనం ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే, సామ (స్నేహ పురస్సరమైన చర్చ), దాన (ఇవ్వటం, ఒప్పుకోవటం), బేధ (నిరాకరించటం), దండోపాయ (శిక్షించటం) అనే పద్ధతుల ద్వారా పిల్లల్ని పరిరక్షించుకోవాలి. (acchamgatelugu.com)
Share this Article