అందరికీ క్లియర్… తెలుగు సినిమా ఇండస్ట్రీ కొందరు గుత్తాధిపత్యాల గుప్పిట్లో చెరబట్టబడిందని..! తక్కువ బడ్జెట్‌తో క్రియేటివ్‌గా తీయబడి బంపర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమాను ఎన్నిరకాలుగా తొక్కేయాలని చూశారో అందరూ చూశారు… హైదరాబాదులో నాలుగంటే నాలుగు థియేటర్లు మాత్రమే ఇచ్చారు మొదట్లో… అదీ నిర్మాత మొండిగా నిలబడితేనే… అగ్రిమెంట్లు కుదిరిన థియేటర్లు కూడా మాటతప్పి హనుమంతుడికి మొండిచేయి చూపాయి… పేరుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఎట్సెట్రా బోలెడు సంఘాలు… కనీసం తనకు ఆ హనుమంతుడే అండగా కదిలివచ్చాడు… కానీ మిగతా బాధితులకు..?
తమ అడ్డమైన సినిమాయే అన్ని థియేటర్లలో ఉండేలా చేసి, మిగతా సినిమాల్ని తొక్కేసి, పండుగ రోజుల గిరాకీని అడ్డంగా సొమ్మచేసుకోవాలని అనుకునే గుత్తాధిపత్య ధోరణి ఈ పండుగపూట స్పష్టంగా అందరికీ తేటతెల్లమైంది… మరి హనుమాన్ సినిమాకే అలా ఉంటే, చిన్న చిన్న సినిమాల్ని ఈ పెద్దలు ఎంత సతాయిస్తున్నట్టు..? వీళ్ల చెప్పుచేతల్లో పడి తెలుగు ఇండస్ట్రీ ఎంత న్యూ క్రియేటివిటీని కోల్పోతున్నట్టు..? వీళ్లకు సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కడూ బద్ధుడై, విధేయుడై మెలగాల్సిందేనా..?
వోకే, మరి దీనికి పరిష్కారం… థియేటర్లు వాళ్లవే, బయ్యర్లు వాళ్లే, నిర్మాతలు వాళ్లే… వాళ్లకు ఎదురేది..? వాళ్లు చెప్పిందే శాసనం… వాళ్లు గీసిందే గీత… పైగా అడ్డగోలు రేట్లు, ఎడాపెడా ప్రత్యేక షోలు… ఏ ప్రభుత్వమూ పెద్దగా ఇండస్ట్రీ జోలికి పోదు, కన్నెర్ర చేసిన ఆ జగనుడే ఏమీ సాధించలేక తనూ వదిలేశాడు… సగటు ప్రేక్షకుడిని నిలువు దోపిడీ చేసే విధానాలకు చెక్ ఏమిటి..? ఎవడు చూడమన్నాడు, థియేటర్ వెళ్లకపోతే సరిపోతుంది కదానేది సమాధానం కాదు…
Ads
ఎందుకంటే, సినిమా సగటు మనిషికి అందుబాటులో ఉండాల్సిన వినోదం… అద్భుతమైన కమ్యూనికేషన్ అది… సమాజాన్ని ప్రభావితం చేయగలదు… ఎవడెంత వ్యతిరేకించినా సరే, ఇది క్రియేటివ్ ఫ్రీడంకు వ్యతిరేకం అని ముద్రలు వేసినా సరే… దాన్ని ప్రభుత్వం నియంత్రించాలి… కంటెంట్‌కు కనీసం నామ్‌కేవాస్తే సెన్సార్ ఉంది, మరి ఇలాంటి గుత్తాధిపత్య వ్యాపార పోకడలకు చెక్ ఏది..? ప్రభుత్వం తలుచుకుంటే ఉంది… కానీ ప్రభుత్వ ముఖ్యలు ప్రయారిటీల్లో సినిమా రంగం ఉండదు… ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాదు, ఉండాల్సింది… టీవీ అండ్ ఫిలిమ్ రెగ్యులేటరీ కమిషన్… సోషల్ మీడియాలో బూతులు రాసుకునే బజారు కార్యకర్తలకు కాదు ఆ పగ్గాలు ఇవ్వాల్సింది…
దానికి క్వాసి జుడిషియల్ అధికారాలు ఇచ్చి, నిజాయితీపరులైన పార్టీ రహితులకు, మెచ్యూర్డ్ కేరక్టర్లకు ఈ పగ్గాలు ఇవ్వాలి… అబ్బే, చట్టాలు లేకుండా వీళ్లను ఏమీ చేయలేం అంటారా..? ఉన్న చట్టాలు చాలు, అంతెందుకు గతంలో ఎంఆర్టీపీ యాక్ట్ ఉండేది… The Monopolies and Restrictive Trade Practices (MRTP) Act… అంటే గుత్తాధిపత్య వ్యాపార నిరోధ చట్టం… దాని స్థానంలో ఆమధ్య కంపిటీషన్ యాక్ట్ తీసుకొచ్చారు… ఎలాంటి గుత్తాధిపత్య వ్యాపార పోకడలకైనా సరే దీన్ని వర్తింపచేయవచ్చు…
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి వ్యవసాయ శాఖ కమిషన్ పూనం మాలకొండయ్య ఈ చట్టాన్ని ప్రయోగించి అంతటి మోన్‌శాంటో కంపెనీనే దిగివచ్చేలా చేసింది… ఇప్పుడైనా సరే ఎవరి కోరలనైనా పీకే చాన్స్ ఉంది… లీగల్‌గా… ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ప్రదర్శించాల్సింది ఇండస్ట్రీని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడం కాదు, ఇండస్ట్రీలో పెడపోకడల్ని నియంత్రించే ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం… A state shouldn’t tolerate a parallel regulatory system in any field… paritcularly shouldn’t give freedom to monopoly trade practices…
మేం చెప్పిన సినిమాలే నడవాలి అనే మాఫియా ముఠాల బెదిరింపులు వినిపించవు అప్పుడు… హనుమాన్ వంటి సినిమాలు మరిన్ని తలెగరేసుకుని వస్తాయి… జగన్‌తో ఎలాగూ కాదు, కాలేదు… కనీసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది చేతనవుతుందా..?! పోనీ, హనుమాన్ నిర్మాతల వంటి బాధితులు ఈ కంపిటీషన్ యాక్ట్ కోరుతూ కోర్టుకు వెళ్లినా కొంత చర్చ జరుగుతుంది… ఏమో, కోర్టులే ఈ వ్యాపార పెడపోకడల నియంత్రణ మార్గాలు సూచించవచ్చు కూడా…!! మీడియాకు ‘ఒక్కొక్కడి తాటతీస్తా’ అనే బెదిరింపులు రాజ్యాంగం ఇచ్చిన ‘భావప్రకటన హక్కు’కు వ్యతిరేకం, ప్రాసిక్యూట్ చేయదగిన నేరం అనే సంగతి జర్నలిస్టుల అసోసియేషన్లకు తెలుసా..?!
Share this Article