Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చాలాసార్లు… ఒంటరిగా… నాలో నేనే ఓ నిశ్శబాన్ని ఆస్వాదిస్తూ…

March 22, 2025 by M S R

.

నా కథను చెప్పాలి. నా ప్రయాణం ఒక సరళరేఖలా సాగలేదు.

నేను గొప్పగా చదువుకోలేదు. అందుకే గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలు కూడా రాలేదు. కానీ నా మనసు కెమెరా వైపు ఒరిగిపోయింది. సినిమాటోగ్రఫీ నా కల. ఉన్న ఉద్యోగాన్ని (అప్పటికే కటింగులన్నీ పోను పాతిక వేలు) వదిలేసి, కొత్తగా పెళ్ళి అయ్యింది.

Ads

అయినా కూడా ప్యాషన్ అనే మాయలో దూకాను. కానీ కొద్ది రోజుల్లోనే వాస్తవం అర్థమైంది. సినిమా ఇది స్థిరత లేని ప్రపంచం, డబ్బు లేని రోజులు, ఆత్మన్యూనత, అస్థిరత.

వెంటనే ప్రత్యామ్నాయం వైపు ఆలోచిస్తున్న క్రమంలో అనుకోకుండా వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వచ్చి చేరింది. నెమ్మదిగా మనకున్న కళా తృష్ణను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీలో ఈవెంట్ కవరేజ్ లో చూపించడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు గడిచిన పన్నెండు ఏళ్లలో ఆరు వందల పైచిలుకు పెళ్లిళ్లను కవర్ చెయ్యగలిగాను. వీటితో పాటు ఎన్నో ఈవెంట్స్, కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీలు.

పెళ్లిళ్లు నన్ను, నా కుటుంబాన్ని రక్షించడమే కాకుండా ఎన్నో కుటుంబాల్లో నన్నొక కుటుంబ సభ్యున్ని చేశాయి. ఎంతో మంది మిత్రులని గొప్ప మనసున్న వ్యక్తుల్ని పరిచయం చేసింది. ఒక విధంగా నన్ను ప్రపంచానికి పరిచయం చేసి ఆ ప్రపంచాన్ని దగ్గర చేసి నన్ను నన్నుగా నిలబెట్టింది ఈ ఫోటోగ్రఫీ.

కాలం మరియు మన ప్రయాణం ప్రతి రోజు మనకి ఏదో ఒక సవాళ్లను విసురుతూనే దానికి తగ్గ ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. జాబ్ లో ఉన్నంత కనీస నిలకడ సర్వీస్ అండ్ క్రియేటివ్ సెక్టార్ లో ఉండదు అని నా అభిప్రాయం. ఎందుకంటే క్రియేటివిటీతో పాటు మనీ మనజ్మెంట్, అంతకు మించి ఆరోగ్యం సహకరించాలి, అంతకు మించి రోజు వారి కొంగొత్త పోకడలను ముందుగా పసిగట్టగలగాలి దానికి తగ్గట్టు మెదడును మరియు మనతో ఉన్న టీంను సంసిద్ధపరుస్తూ ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలి.

ముఖ్యంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అనే అవగాహనకు ఎంత త్వరగా వస్తే అంత మంచిది. పిల్లలు వారి చదువులు, వారికి చదువులు చేప్పే క్రమంలో మనము ఎందుకు ఉన్నత చదువులు చదవలేక పోయమా అని అప్పుడు తెలుస్తుంది చదువు విలువ. ఇలా ప్రతి రోజు ప్రతి క్షణం ఎంత వద్దనుకున్న ఎంతో కొంత ఒత్తిడికి గురి అవుతూనే ఉంటాను, ఉంటాము.

కొన్నిసార్లు మనసు అలసిపోతుంది. కారణాలు అనేకం, ప్రతి రోజు ఎప్పుడు నిత్య నూతనంగా ఉండకపోవచ్చు. ఒక్కోసారి గుండె భారంగా ఉండొచ్చు. జీవితం మీద విసుగు పుట్టొచ్చు. అలాంటి వేళల్లో నేను చేసేది… నాలోనికే ఓ చిన్న ప్రయాణం. ఆ ప్రయాణం నన్ను నా ఆత్మకు దగ్గర చేస్తుంది.

కెమెరా పట్టుకుని బయటికి వెళ్తాను. బయటకు వెళ్లిన ప్రతిసారి, ప్రపంచాన్ని కొత్తగా చూస్తాను. ప్రతి ముఖంలో ఓ కథ, ప్రతి కదలికలో ఓ గీతం. ఒక్క క్లిక్‌తో ఆ క్షణాన్ని శాశ్వతం చేసుకోవడమంటే, ఆ క్షణాన్ని హృదయంలో పదిలపరచుకోవడమే..
ఒక ఫోటో జీవితాన్ని కొద్దిసేపు ఆపేసే స్టాప్ బటన్ లాంటిది.

నేను కవర్ చేసిన వెడ్డింగ్ ట్రైలర్లను చూస్తూ గడిపేస్తాను. ఎందుకో తెలియదు, కెమెరా కంటి గుండా బంధించిన పెళ్ళి ఘట్టాలు, అవి వేరే వాళ్ళవైనా కూడా ఆ క్షణానికి నేనొక సాక్షిగా ఆ ఆనందాల్లో నేను పాలు పంచుకున్నాను కాబట్టి నా హృదయం కూడా ఉప్పొంగుతుంది.

చిరునవ్వులు, ఆనంద భాష్పాలు. ప్రతి ఫ్రేమ్‌లో ఓ కథ ఉంది, ప్రతి బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌లో ఓ అనుభూతి. కొన్ని మధుర జ్ఞాపకాలు మనం నెమ్మదిగా తిరగేసే పుస్తక పేజీల్లా ఉంటాయి.

ఆ పెళ్ళి వేడుకల్లో పరిచయం అయిన స్నేహాలు రాను రాను జీవితంలో చెరగని ముద్ర వేసే అద్భుతమైన అనుబంధాలుగా మారిన తీరు. కాలం ఎంతదూరం తీసుకెళ్లినా ఆ స్నేహబంధాలు అంతకన్నా ముందే వెళ్ళి కలుస్తాయి..

పక్కనే ఉన్న గుళ్లోకి వెళ్ళి కూర్చుంటా. ప్రశాంతంగా. ఎవరితోనూ మాట్లాడకుండా, అల్లరి లేకుండా, ఓ దివ్యమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ… కొన్నిసార్లు ప్రశాంతత శబ్దంలో కాదు, మౌనంలో దాగి ఉంటుంది. అదే తీరం, అదే గాలి, అదే ఆకాశం… కానీ మనసు మారిపోతుంది. పచ్చని చెట్ల మధ్య నడవడం, పార్క్‌లో నేల మీద కూర్చోవడం, ఓ చెట్టు కింద పడుకుని గాలి తాకిడిని అనుభవించడం. ఈ చిన్న ఆనందాలే నిజమైన ధనవంతుల్ని చేస్తాయి.

రోడ్ల మీద ఒంటరిగా…
ఆకాశానికి అంచుల్లేవు, రహదారులకు చివరలులేవు. కార్ స్టార్ట్ చేసి, ఔటర్ రింగ్ రోడ్ చుట్టేయడం, విండో ఓపెన్ చేసి గాలి తాకిడిని ఆస్వాదించడం… ఆ ప్రయాణంలోనే నా ప్రశాంతత.
అదే మెలోడి, అదే రిఫ్రెష్‌మెంట్.

“కొన్నిసార్లు, ఉత్తమమైన చికిత్స ఒక లాంగ్ డ్రైవ్ మరియు మంచి సంగీతమే. “నర్సరీకి వెళ్లి చిన్న మొక్కల్ని పరిశీలిస్తాను. అవి ఎంత చిన్నగా ఉన్నా, భవిష్యత్తులో ఎంత పెద్ద వృక్షాలు అవుతాయో! మన కలలు కూడా అలానే ఉంటాయి. చిన్నగా మొదలవుతాయి, కాని వాటికి నీరు పోస్తే… అవి ఒక అందమైన యాత్రగా మారతాయి.

శబ్దానికీ ఓ సౌందర్యం ఉంటుంది. మంచి సంగీతం వింటూ కళ్లను మూసుకుంటే, జీవితం ఓ రాగంలా అనిపిస్తుంది. ఒక్కసారి మనసారా సంగీతం వింటూ కూర్చుంటే, మనసు మబ్బుల నుంచి తేలికగా పైకి లేచిపోతుంది.

“సంగీతం, మాటల ద్వారా వ్యక్తం చేయలేని భావాలను పలుకుతుంది. మనసుకు శాంతినిస్తుంది, విశ్రాంతినిస్తుంది.”

హైదరాబాద్‌లో కొత్తగా ఓపెన్ అయిన కాఫీ షాప్‌లన్నీ వెళ్లి చూడడం నిజంగా ఒక యాత్రే. ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడల్లా, అక్కడి అంబియన్స్, మెనూ, కాఫీ బీన్స్ అలా అన్నింటినీ అనుభవించడమంటే ఓ విభిన్నమైన అనుభూతి. కొన్ని చోట్ల రేట్రో వైబ్స్ ఉంటాయి, ఇంకొన్ని కేఫ్స్ క్రియేటివ్ ఆర్ట్ కార్నర్స్ లా అనిపిస్తాయి, ఇంకొన్ని రూఫ్టప్ కేఫ్స్ …

మంచి కాఫీ, మంచి సంగీతం, కొత్త చర్చలు అవి నిజంగా మన రోజును ప్రత్యేకంగా మార్చేస్తాయి. కొన్ని క్షణాలు కాఫీ చేతిలోపట్టి కళ్ళు మూసుకుని అక్కడి మ్యూజిక్ ని అనుభవించడమంటే… అది నిజంగా ఒక మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ లాంటిది. దాదాపు రక రకాల మనస్తత్వాలు కలిగిన వివిధ రంగాల మనసుషులంతా నేను ఈ కాఫీ షాప్ లలో పరిచయం చేసుకున్నాను.

ఈ జీవితం అర్థం చేసుకోవలసిన గ్రంథమా? లేదా అనుభవించాల్సిన కవిత్వమా? నా ప్రయాణం ప్రశ్నల వలయమా? లేదా సమాధానాల వెన్నెలా?
ఒకసారి ఆలోచించాలి…
మనమందరం ఆకాశాన్ని తిలకించే పక్షులమే, కానీ ఎవరికీ పయనం అంతం కాదు. గమ్యాన్ని వెతుక్కునే ప్రతి అడుగూ, ఒక కొత్త ప్రశ్నను అల్లుకుంటుంది. మనుషులతో మాట్లాడటం అనే చిన్న పని, ఒకరి హృదయాన్ని ఓదార్చే ఆశ్రయమవుతుందా? ఒక మాట, ఒక స్పర్శ, ఒక నవ్వు, వేళ్లాడుతున్న మనసుకు నీడనిచ్చే చెట్టు కావొచ్చా?

నాకోసం ఎదురు చూస్తున్న వారెవరైనా ఉన్నారా? లేదా నేనే ఎవరికోసమో ఎదురు చూస్తున్నానా? జీవితం నా చేతుల్లో లేని ప్రశ్నల సమాహారమా? లేదా నా కళ్ల ముందు గుసగుసలాడే సమాధానమా?
ఒంటరిగా నడిచే దారుల్లో కూడా, ఏదో ఒక చోట నా కోసం ఎదురు చూస్తూ, ప్రకృతి ఓ చక్కటి దృశ్యాన్ని ఉంచి ఉంటుంది.
ఒక్కసారి ఆగి, ఆ దృశ్యాన్ని పసిగట్టగలిగితే, నా లోపలి కలవరానికి సమాధానం దొరికినట్టే!

పెళ్లిళ్లు, చిత్రాలు, గీతాలు, సందేశాలు, నా కాలాన్ని నాకే గుర్తు చేసే చిరునవ్వులే. మనుషుల్ని కలవడం, ఫోటోలు తీయడం,
ఒక్క క్షణాన్నైనా శాశ్వతం చేయాలనే తపన. కానీ నిజంగా శాశ్వతం ఏమిటి? నా మాటల్లో? నా మనసులో? లేదా నా ప్రయాణంలో?
ఓ కారును నడిపిస్తూ ఔటర్ రింగ్ రోడ్డును చుట్టేస్తే, నాలోని అలజడి మార్గం మరిచిపోతుందా? ఒక చెట్టు నీడలో పడుకుని, నిశ్శబ్దం వింటే నన్ను నేను అర్థం చేసుకుంటానా?

నా జీవితానికి నేను ప్రయాణికుడనా? లేదా ఈ ప్రయాణానికి నేనే గమ్యమా? జీవితాన్ని రహస్యం అనుకోవాలా? లేదా నిశ్శబ్దం తోడుగా పెట్టుకోవాలా? సమాధానం ఒక్కటే…
“జీవితం అనుభూతి… నేననుభవించాలి!”
మనుషుల మధ్య మనిషిగా నిలిచిపోవాలి.
అదే నిజమైన ప్రయాణం…
అదే నిజమైన ముగింపు…

“ఈ జీవితం ఓ ప్రశ్న కావొచ్చు, సమాధానం కావొచ్చు… కానీ చివరికి, ఇది అనుభూతే!”
ఇదే… నేను వెతికే ప్రశాంతత నా చుట్టూనే ఎక్కడో దాగి ఉంటుంది. ఒక్కసారి ఆ క్షణాన్ని ఓపికగా ఆస్వాదించగలిగితే, నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది…….. ( రఘు మందాటి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions