ఆవకాయ మన అందరిది..!! దీనిని పేరాల భరత శర్మ రాశారు.., తప్పకుండా చదవండి.., ఆ భాష ఆ భావ వ్యక్తీకరణ బాగుంది.., చాలా బాగుంది… కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఆవకాయ కోసం మామిడికాయలు తరగడం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో మనమందరం చూసే ఉంటాం. వారి ప్రియశిష్యుడు అష్టావధాని పేరాల భరతశర్మ కూడా తక్కువేం కాదు.
వారి తనయుడు పేరాల బాలకృష్ణ, తండ్రి గారి సునిశిత పర్యవేక్షణలో వారింట్లో ప్రతి సంవత్సరం జరిగే ఆవకాయ పండుగను అద్భుతంగా అక్షరబద్ధం చేశారు. లొట్టలేసుకుంటూ చదవాల్సిందే…
కార్యక్షేత్రం : విజయవాడ
Ads
1. మా ఇంట్లో ఆవకాయ ! ముచ్చెమటలు పట్టించే ఓ రసనానంద యాగం ! మా చిన్నప్పుడు ఆవకాయ పెట్టటం అంటే అదో పెద్ద జిహ్వానంద కేళి ! కోడళ్ళకు నిర్బంధ సమ్మర్ కాంపు ! ఇది భరతుడు ప్రతి యేడూ నిర్వహించే విశేష రస బ్రహ్మోత్సవం !
2. కాళేశ్వరరావు మార్కెట్లో ఎండుమిరపకాయలు కసbకసా నమిలి ఐస్ఫ్రూట్ చప్పరించినట్లు మొహంపెట్టి అస్సలు కారం లేవురా నాయనా అంటూ నాన్నగారు మరో కొట్టు దగ్గరకు వెళ్ళిపోతే అవాక్కయిన కోమటాయన మీ నోట్లో బెల్లం కొట్టుందా పంతులు గారూ అంటూ హాచ్చర్యపోయేవాడు !
3.కొద్దిగా సన్నావాలు, బొంతావాలు కొట్టులోనే నూరించి ఆ పొడిని స్పర్శించి, ఆఘ్రాణించి, చప్పరించి ఘాటు లేదంటూ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించి మరో కొట్టు, మరో కొట్టుకెళ్ళి ఇంత దుర్మార్గమైన రసచర్చ, రసనావధానం మళ్ళీ జరిపిన తర్వాత ఈ కఠినమైన క్వాలిటీ పరీక్షలన్నీ పాసైన మిరపకాయలు, ఆవాలు, ఉప్పు ఇంటికి చేరేవి.
4. వస్తూ వస్తూ విజయవాడ సీతారాంపురంలో ఉన్న దేవి ఆయిల్ మిల్స్ దగ్గర రిక్షా ఆగగానే షాపు యజమాని రంగారావు గారు పదిహేను కిలోల పప్పు నూనె డబ్బా రిక్షాలో పెట్టించేవారు. మరో పావుగంటకి ఇంటికి చేరేవాళ్ళం.
5. ఆపాటికి బామ్మ నియంతృత్వంలో… అదేలే నేతృత్వంలో అచ్చాలు అండ్ బ్యాచ్ కారాలు కొట్టటానికి బేరాల హాహాకారాలు ముగిసేవి. పాకేజీ ఎలా వుండేదంటే ఒక రోకలి, రోలు, పిండి జల్లెడ, రవ్వ జల్లెడ మనవి… రెండో మూడో రోకళ్ళు,” కుంది ” ముఠా వాళ్ళు తెచ్చుకోవాలి. కూలీ కిలోకి పది అణాలు .
6. ఎండబెట్టిన మిరపకాయలు, ఆవాలు జాగ్రత్తగా ఏ పిల్లో కుక్కో వచ్చి తడపకుండా కాపలాకాయాల్సిన బాధ్యత నాది ప్రభూగాడిది . మామిడికాయ కొనాలంటే ఆ ముక్కలు కొట్టే కత్తిపీట, ముందు మన ఇంటికి రావాలి . మొత్తం మాచవరంలో కాలవొడ్డున వున్న చౌదరి గారి కత్తిపీట ఒక్కటే ఈ మామిడి కాయల వధకు పనికివచ్చే కత్తిపీట.
7.అది తీసుకురావటానికి ప్రభుగాడు నేను కూలీలం . చాలా బరువులే అది. భరతుడూ! కాయలు చిన్నరసాలైతే బాగా పుల్లగా , పెద్ద టెంకతో వుంటాయిరా అవి తీసుకురా బామ్మ సలహాతో కూడిన ఆజ్ఞ . ముక్క చెదరకుండా టెంక ఊడకుండా ముక్కకొట్టడం ఈ భరతుడి జీవితావధానాంశాల్లో తొమ్మిదోది .
8. వంద కాయలు ఇంట్లో ముక్కలు కొట్టుకుంటే పది రూపాయలు ఆదా.. బొడ్డు కిందకు జారిపోయిన లుంగీ లాగా కట్టుకున్న పంచకట్టుతో కత్తిపీట ముందేసుకుని చెమటలు కక్కుకుంటూ పాపం ముక్కలు కొట్టేవారు . జీడితీయటం, టెంకమీద కాయితం పీకటం అంగదాదుల పని.
8. కొన్ని చెదిరిన ముక్కలు ఆ పూటకి పప్పుగా మారితే, కొన్ని పచ్చడిగా కంచాలను అలంకరించేవి . భోజనాల తర్వాత వంటింటికి మడి కట్టేవాళ్ళు. ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ ఉండేది. వాతావరణం భీకరంగా ఉండేది .
9.ఇద్దరు స్త్రీ తలారులు కుంభం పోసిన ఉప్పుకారాలను నువ్వుపప్పునూనెతో తడిపి, ఆ రౌద్ర కాసారంలో మామిడికాయ ముక్కలను అర్పిస్తూ, కలియబెడుతూ, కృష్ణా ! ద్వారకీవాసా ! అక్షయం, అక్షయం అంటూ పెద్ద మట్టిబానలోకి ఎత్తి మూతలు పెట్టేవాళ్లు.
10. నాన్నగారు బామ్మను దబాయించి ఆ రాత్రే రుచి కోసం అన్నంలో వేయించుకునేవారు. ఘాటు రాలేదు , ఉప్పు ఎక్కువ తక్కువ లాంటి కామెంట్లకు బామ్మ నుంచి ఎటువంటి స్పందన ఉండేది కాదు సరికదా … అందుకే తిరక్కలిపేదాకా ఆగమనేది అని ఒక విసురు విసిరేది .
11.మూడు రోజుల తర్వాత తిరక్కలిపేందుకు రంగం సిద్ధం. ఒక పెద్ద లాఠీతో బాగా కలిపి, మొత్తం పదార్ధాన్ని తలకిందులు చేసి, ఉక్కిరిబిక్కిరి చేసి అతలాకుతలం చేసి పప్పునూనెతో కలియబెట్టి, మళ్ళీ అమ్మ చేత్తో తిరగకలిపి, పెద్ద పెద్ద పొట్ట జాడీల్లోకి , గొట్టం జాడీల్లోకి నింపేది.
12. ఆవకాయకు అరచేయి ఎత్తు వరకు నూనె పోసి , కొద్దిగా ఒక చిన్న జాడీలోకి ఆవకాయ, మెంతికాయ విడిగా తీసి పెద్ద జాడీలకు మూతలు పెట్టి , ఉతికిన పాత లుంగీ ముక్కలతో వాసెనలు కట్టి ఓ పక్కన పెట్టేవాళ్ళు. పాపం ఆ రాత్రి అమ్మ చేతులు భగభగా మండిపోయేవి .
13. కొంచెం సేపు చన్నీళ్ళలో చేతులు ముంచి తర్వాత పాండ్స్ స్నో రాసుకుని ఊదుకుంటూ పడుకునేది. ఆ సమయంలో అంగదుడెవడైనా గురు శంక తీర్చుకుని ప్రక్షాళనకు మారాం చేసాడో వాడికి పాండ్స్ స్నో అక్కడ రాయాల్సి వచ్చేది . ఆ తర్వాత వాడి ఏడుపువాడిది!
14. తర్వాత వారం రోజులపాటు ఆవకాయ ఘాటు వుందా లేదా అని చర్చ. ముక్కు పుటాలు అదురుతున్నాయా ఆసనాలు దద్దరిల్లుతున్నాయా లేదా అన్నదాన్నిబట్టి ఆవకాయ విజయం నిర్ణయించేవాళ్ళు. ఎప్పుడన్నా మళ్ళీ చిన్న జాడీల్లోకి ఆవకాయ తీయాలంటే పెద్దమడి తప్పేదికాదు .
14. చాలా వరకు ప్రభూ గాడికి పడేదా డ్యూటీ. అప్పుడప్పుడూ నాకూ తప్పేదికాదు . మేం మొండికెత్తితే …… వామ్మో చెప్పనే అక్కర్లేదు బామ్మే పెద్దమడి కట్టిపడేసి ఆవకాయ మాత్రం కంచంలో కి చేర్చేది. ఒకటి మాత్రం నిజం ప్రతి ఇంటికి ఓ మడికట్టుకునే బామ్మ వుండాలి. సహనంతో వుండే అమ్మ కావాలి!
15. నాన్న అంటే ఇలాగే వుండాలనిపించే ఓ మహోన్నత వ్యక్తిత్వం మా నాన్న ! నిండుకుండ అనేమాటకు సాక్షర రూపం నా తండ్రి. ఇది అనుక్షణం ఆ నా తండ్రినే తల్చుకుంటూ మాకు నాన్నే అయిన మా అమ్మకోసం !
– పేరాల బాలకృష్ణ
Share this Article