Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడు మన ‘కోడి మెడ’ కొరికేయాలని చూస్తున్నాడు… మరి సొల్యూషన్..?!

April 20, 2025 by M S R

.
ఎంతటి బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుంది… ఆ బలహీనతను శత్రువు గుర్తిస్తే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే… తన బలహీనతను శత్రువు గుర్తించాడని తెలిసి కూడా సరిదిద్దుకోకపోతే స్వయంకృతాపరాధమే. ఈ సూత్రం దేశ రక్షణ వ్యవహారాలకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది. అందుకు భారతదేశం కూడా మినహాయింపు కాదు.

మరి వ్యూహాత్మకంగా భారత్‌ బలహీనత ఏమిటీ…!? చికెన్‌ నెక్‌ ప్రాంతం. తెలుగులో చెప్పాలంటే కోడిమెడ ప్రాంతం.

సెవెన్ సిస్టర్స్ గా పిలిచే ఏడు రాష్ట్రాలను మిగిలిన భారత దేశంతో అనుసంధానించే ఏకైక, ఇరుకైన మార్గమే ఈ చికెన్‌ నెక్‌. కేవలం 22 కి.మీ. మాత్రమే వెడల్పుతో 60 కి.మీ. పొడవైన ఈ మార్గాన్నే సిలిగుడి కారిడార్‌ అని అంటారు. భారత్‌తో ఏ రంగంలోనూ దరిదాపులకు కూడా రాలేని బలహీన దేశమైన బంగ్లాదేశ్‌ కూడా చికెన్‌ నెక్‌ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం తాజా పరిణామం.

Ads

మరి ఈ బలహీనతను అధిగమించాలంటే… రక్షణ నిపుణులు చెబుతున్న ఏకైక పరిష్కార మార్గం…
కోడిమెడ ప్రాంతాన్ని సువిశాల కారిడార్‌గా చేయాలి… అందుకోసం బంగ్లాదేశ్‌ ఉత్తర భాగాన ఉన్న రంగ్‌పూర్‌ జిల్లాను భారత్‌ తనలో కలిపేసుకోవాలి…

అంతేకాదు … బంగ్లాదేశ్‌కు నైరుతీ దిశలో ఓ మూలకు విసిరేసినట్టు ఉన్న చిట్టగాంగ్‌ ప్రాంతాన్ని విడదీసి భారత్‌లో అంతర్భాగం చేయాలి . తద్వారా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను బంగాళా ఖాతం వరకూ విస్తరించాలి.

భారత్, బంగ్లాదేశ్, చైనాతో పాటు యావత్ దక్షిణాసియా లో చర్చనీయాంశంగా మారిన తాజా పరిణామాల వెనుక కథ కమామిషు ఇదీ…

చైనా కుయుక్తులు …యూనస్‌ కారుకూతలు
దౌత్య వ్యవహారాలకు సంబంధించి దేశాధినేతలు ఏదో మాట వరుసకు ఏదీ మాట్లాడరు. ప్రతి మాట… ఆ మాటలోని ప్రతి పదం వెనుక ఓ వ్యూహం ఉంటుంది. ఆ గుడార్థాన్ని గుర్తిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్‌ యూనస్‌ భారత్‌ను ఉద్దేశించి ఇటీవల కారుకూతలు కూశారు.

‘భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. చికెన్‌ నెక్‌ అనే ఇరుకైన ప్రదేశం ద్వారానే మిగిలిన భారత్‌తో అనుసంధానించి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే భారత్‌ వ్యూహాత్మక బలహీనతను ఆయన దెప్పిపొడిచారు.

అంతేకాదు ‘యావత్‌ బంగాళాఖతంపై బంగ్లాదేశ్‌ ఆధిపత్యం చలాయిస్తోంది. చైనా ఆర్థిక వ్యవస్థకు కొనసాగింపుగా ఉంది’అని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే చైనాతో కలిసి ఆ ప్రాంతంలో వ్యూహాత్మక, వ్యాపారాత్మక సంబంధాలు విస్తరిస్తాంమని చెప్పకనే చెప్పారు.

అసలు చైనా, బంగ్లాదేశ్‌ ఇరుగు పొరుగు దేశాలు కావు. ఆ రెండు దేశాల మధ్య భారత్‌ భూభాగం ఉంది. మరి చైనా ఆర్థిక వ్యవస్థకు బంగ్లాదేశ్‌ ఎలా కొనసాగింపు అవుతుంది. యూనస్‌ పక్కా పన్నాగంతోనే ఆయన ఈ వ్యాఖ్యాలు చేశారు. 22 కి.మీ. మాత్రమే వెడల్పు ఉన్న ఈ చికెన్‌ నెక్‌ను తెగ్గొడితే ఈశాన్య రాష్ట్రాలను భారత్‌ నుంచి విడదీయవచ్చన్న కవ్వింపే ఆయన మాటల వెనుక ఉన్న మర్మం.

బంగ్లాదేశ్‌లో చైనా వైమానిక స్థావరం…!
అరుణాచల్‌ ప్రదేశ్‌పై పేచీ పెడుతున్న చైనా మూడేళ్ల క్రితం భారత్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు దుస్సాహసం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. భారత్‌పై నిఘా పెట్టేందుకు బంగ్లాదేశ్‌ భూభాగం తిష్ట వేయాలని తాజాగా పన్నాగం పన్నింది.

భారత్‌లోని చికెన్‌ నెక్‌ ప్రాంతానికి అత్యంత సమీపంలో బంగ్లాదేశ్‌లోని ‘లాల్‌ మునీర్‌హట్‌’ వద్ద చైనా వైమానిక స్థావరం ఏర్పాటుకు యూనస్‌ సూత్రప్రాయంగా ఆమోదించారు. ఇక భారత్‌ సరిహద్దు చికెన్‌ నెక్‌ ప్రాంతానికి సమీపంలో పాకిస్తాన్‌తో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాలని కూడా బంగ్లాదేశ్‌ భావిస్తుండటం గమనార్హం.

పాకిస్తాన్‌ (అప్పటి పశ్చిమ పాకిస్తాన్‌) నియంతృత్వ పాలనను వ్యతిరేకంగా బెంగాలీ మాతృభాష కలిగిన అప్పటి తూర్పు పాకిస్తాన్‌ ( ప్రస్తుత బంగ్లాదేశ్‌) ప్రజలు స్వతంత్ర దేశం కోసం ఉద్యమించిన కాలాన్ని మరచిపోయినట్టు యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వం నిద్ర నటిస్తోంది.

భారత్‌ అనుకూల షేక్‌ హసీనాను గద్దె దించేందుకే చైనా బంగ్లాదేశ్‌లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది. చైనా అనుకూల శక్తులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే బంగ్లాదేశ్‌ పూర్తిగా తనపై ఆధారపడేట్టు చేసేందుకే చైనా ఆ దేశంలో నిత్యం రావణ కాష్టాన్ని రగిలిస్తోంది.

మేల్కోనకుంటే మునుముందు పెనుముప్పే….
ఈ పరిణామాలు భారత్‌ రక్షణావసరాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయన్నది కాదనలేని నిజం. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదు గానీ భవిష్యత్‌లో భారత్, చైనా మధ్య పరిస్థితులు చేయిదాటితే… 1962నాటి పరిణామాలు పునరావృతమైతే భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.

అందుకే ఇప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రక్షణ నిపుణులు పట్టుబడుతున్నారు. యూనస్‌ వ్యాఖ్యలను అస్సోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ దీటుగా తిప్పికొట్టారు. ఇతర ఈశాన్య రాష్ట్రాల పాలకులు, ప్రధాన పార్టీలు కూడా బంగ్లాదేశ్‌ నక్క జిత్తులపై మండిపడుతున్నాయి.

భారత ప్రభుత్వం తక్షణ స్పందనగా బంగ్లాదేశ్‌ ఉత్పత్తులను భారత్‌ భూభాగం గుండా పశ్చిమ దేశాలకు ఎగుమతి చేసేందుకు గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. వాణిజ్యపరమైన చర్యలతో సరిపెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ తమ రక్షణ ప్రయోజనాల కోసం మరింత దూకుడు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

చికెన్‌ నెక్‌ ప్రాంతం గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన యూనస్‌… అసలు బంగ్లాదేశ్‌కు మూడు వైపులా భారతే ఉందనే విషయాన్ని మర్చిపోతే ఎలా అని మన రక్షణ నిపుణులు దీటుగా బదులిచ్చారు.
చికెన్‌ నెక్‌ను విస్తరించాల్సిందేనా…!

– బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌ జిల్లాతో గ్రేటర్‌ మేఘాలయ
చికెన్‌ నెక్‌ ప్రాంతం మన బలహీనతగా మిగిలిపోనివ్వకూడదని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌ ఉత్తర భాగాన ఉన్న రంగ్‌పూర్‌ జిల్లాను భారత్‌ హస్తగతం చేసుకోవాలన్నది వారి వాదన.

మన మేఘాలయను ఆనుకుని 2,400 చ.కి. మీ. విస్తీర్ణంతో ఉన్న ఆ జిల్లాను సైనిక చర్య ద్వారా భారత్‌లో కలిపేసుకుంటే చాలు… (ట్రంపు టారిఫ్ వార్‌లో చిక్కిన చైనా ఇప్పుడు ఇండియా మీదకు దూకుడుగా రాదు)…  మన చికెన్‌నెక్‌ ప్రాంతం సువిశాలం కారిడార్‌గా విస్తరిస్తుంది.

ఆ జిల్లాను మేఘాలయలో చేర్చడం ద్వారా ప్రస్తుతం కేవలం 22 కి.మీ. వెడల్పు ఉన్న చికెన్‌ నెక్‌ ప్రాంతాన్ని 100 కి.మీ. వెడల్పు చేయవచ్చు. సిలిగుడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు సువిశాలమైన జాతీయ రహదారుల కారిడార్, రైల్వే కారిడార్‌ నిర్మించవచ్చు.

చిట్టగాంగ్‌ను చేరిస్తే బంగళా ఖాతం వరకూ ఈశాన్య భారతం
ఈశాన్య రాష్ట్రాలకు సముద్రతీరం లేదు కాబట్టి బంగాళాఖాతంపై తమదే పెత్తనమని కూడా బంగ్లాదేశ్‌ పాలకుడు యూనస్‌ పెట్రేగిపోయారు. దీనికి భారత రక్షణ నిపుణులు ఓ పరిష్కారం సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌ నైరుతీ భాగంలో ఓ మూలకు విసిరేసినట్టు చిట్టగాంగ్‌ ప్రాంతం ఉంది.

ఆ ప్రాంతానికి ఉత్తరాన భారత్‌లోని త్రిపుర, పశ్చిమాన బర్మా, దక్షిణాన బంగాళాఖాతం సరిహద్దులుగా ఉన్నాయి. అసలు విషయం ఏమిటంటే… భారత్‌లోని త్రిపురకు, చిట్టగాంగ్‌ను దాటి బంగాళాఖాతం మధ్య కేవలం 15 కి.మీ. దూరమే ఉంది. భారత సైన్యం త్రిపుర నుంచి ఆ 15 కి.మీ. కిందకు దూసుకువస్తే చాలు… చిట్టగాంగ్‌ను శాశ్వతంగా బంగ్లాదేశ్‌ను విడదీయవచ్చు.

ఆ విధంగా భారత్‌ సైనిక చర్య ద్వారా చిట్టగాంగ్‌ను విడదీసి తనలో కలిపేసుకోవాలన్నది సైనిక నిపుణుల బలమైన వాదన. చిట్టగాంగ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి అనంతరం అవసరమైతే త్రిపుర రాష్ట్రంలో విలీనం చేయవచ్చు. 1947లో దేశ విభజన సమయంలో కూడా చిట్టగాంగ్‌ అప్పటి తూర్పు పాకిస్తాన్‌ ( ప్రస్తుత బంగ్లాదేశ్‌)లో చేరాలని భావించ లేదు.

ఇప్పటికీ ఆ ప్రాంతంలోని గిరిజనులు భారత్‌లోని త్రిపుర రాష్ట్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని త్రిపుర రాజవంశీకుడు , త్రిపుర మోర్చా వ్యవస్థాపకుడు ప్రద్యోత్‌ కిశోర్‌ దేబ్‌బర్మ ఇటీవల ప్రస్తావించడం గమనార్హం.

దాంతో ఈశాన్య రాష్ట్రాలను బంగాళా ఖాతం వరకూ విస్తరించవచ్చు. చిట్టగాంగ్‌ వద్ద పోర్టును అభివృద్ధి చేసి ఈశాన్య రాష్ట్రాల నుంచి నేరుగా ప్రపంచ దేశాలకు సరుకు రవాణా చేసుకోవచ్చు. అంతిమలక్ష్యం … బంగ్లాదేశ్‌ భవిష్యత్‌లో ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడాలన్న ఊహకే భయపడాల్సి వస్తుంది.

అసలు సాధ్యమా…!? భారత్‌ విధానమా…!? ఎందుకు సాధ్యం కాదూ…!?
ఈ ప్రతిపాదనలు వినడానికే కంగారెత్తిస్తున్నాయన్నది నిస్సందేహం. అసలు ఏ దేశంపై ముందుగా దాడి చేయదనే చరిత్ర, విధాన నిర్ణయం ఉన్న భారత్‌ పొరుగు దేశంలోని రెండు భూభాగాలను ఆక్రమించుకుని కలిపేసుకుంటుందా…!?

దౌత్యపరమైన యుద్ధమే తప్ప భారత్‌ నేరుగా పొరుగు దేశాలపై సైనిక చర్యకు సాహసిస్తుందా…!?
అందుకు యత్నిస్తే బంగ్లాదేశ్‌కు మద్దతుగా చైనా, పాకిస్తాన్‌ మనతో యుద్ధానికి దిగవా…!?
ప్రపంచ దేశాలు భారత్‌ను సమర్థిస్తాయా…!?
పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌నే ఇప్పటివరకు తిరిగి సాధించలేకపోయాం.. అలాంటిది బంగ్లాదేశ్‌లోని రెండు భూభాగాలను కలిపేసుకోగలమా…!?

ఇలాంటి ప్రశ్నలు లెక్కలేనన్ని తలెత్తుతాయి. అవన్నీ సహేతుకమైన ప్రశ్నలే. అయితే మాజీ సైనిక అధికారులు, రక్షణ రంగ నిపుణులు వ్యూహాత్మక వ్యవహారాల్లో ప్రపంచంలో ఏ రెండు ఉదంతాలను ఒకదానితో ఒకటి పోల్చకూడదు అని చెబుతున్నారు. పాలస్తీనాను క్రమంగా కబళిస్తూ విస్తరించిన ఇజ్రాయెల్‌ను ఉదాహరణ గా చూపుతున్నారు.

1972 వరకు స్వతంత్ర దేశంగా ఉన్న సిక్కిం భారత్‌లో విలీనం చేసిన వ్యూహాన్ని ప్రస్తావిస్తున్నారు. 1971లో అమెరికా కళ్లుగప్పి మరీ పాకిస్తాన్‌ నుంచి విడదీసి స్వాతంత్ర్య బంగ్లాదేశ్‌ ను ఏర్పాటు చేసింది భారతదేశమే కదా అని గుర్తు చేస్తున్నారు.

నాడు బంగ్లాదేశ్ కు పురుడు పోసిన భారతే ప్రస్తుతం ఆ దేశానికి గుణపాఠం నేర్పేందుకు “ఆపరేషన్” చేయాలని చెబుతున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల్లో చైనాను ఏకాకి చేయాలని భావిస్తున్న అమెరికా కచ్చితంగా భారత్‌కు పరోక్ష మద్దతునిస్తుందని… రష్యా కూడా భారత్‌ చర్యను దూకుడుగా వ్యతిరేకించదని నమ్మకంగా చెబుతున్నారు.

భారత్‌ సైనిక ఆపరేషన్‌కు ఆ మాత్రం సహకారం సరిపోతుందని అంటున్నారు. బంగ్లాదేశ్‌ మొత్తం సైన్యం కంటే కూడా … ఆ దేశానికి మూడు వైపులా ఉన్న భారత్‌ సరిహద్దుల్లో ఉన్న మన సైనిక బలగం ఎన్నో రెట్లు అధికమని గుర్తు చేస్తున్నారు. మూడు వైపుల నుంచి సైన్యం చొచ్చుకు వస్తే మూడు రోజుల్లోనే ‘ఆపరేషన్‌ రంగ్‌పూర్‌’ పూర్తవుతుందని రక్షణ రంగ నిపుణుడు, రిటైర్డ్‌ సైనికాధికారి గౌరవ్ ఆర్య ధీమా వ్యక్తం చేశారు.

చిట్టగాంగ్‌ను అయితే ఒక్క రోజులోనే విడదీయవచ్చని తేల్చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ దౌత్యనీతిని గుర్తు చేస్తున్నారు. ఏ విషయంలో అయినా ప్రపంచ దేశాలను అనుమతి అడిగితే ఇవ్వరు… కానీ చేయాల్సింది చేసేసి … తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిపోయింది …ఇక చర్చలకు సిద్దం అని అంటే ఎవరూ చేసేదేమీ ఉండదని చెబుతున్న సైనిక నిపుణుల అభిప్రాయం అత్యంత విలువైనది.

అంతగా అయితే వివాదాస్పద భూభాగంగా పరిగణిస్తారు…కానీ భారత్‌ ఆధీనంలోనే ఉంటాయన్నది మనకు కలసివచ్చే అంశమని చెబుతున్నారు. ఓ సారి ఆపరేషన్‌ ముగిసిన తరువాత చైనా, పాకిస్తాన్‌ కూడా ఇతర దేశాల ఒత్తిడితో ఆ విషయాన్ని విడిచిపెడతాయి తప్ప…బంగ్లాదేశ్‌ కోసం కోరికోరి ప్రపంచ దేశాలతో కయ్యానికి దిగవని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ చర్చలు, వాదోపవాదాలు ఎలా ఉన్నా సరే… భారత్‌ మాత్రం బంగ్లాదేశ్‌ పాలకుడు యూనస్‌ కారుకూతలను తీవ్రంగా పరిగణిస్తోంది. 1971లో బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి మూల కారణమైన భారత ‘రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) మరోసారి క్రియాశీలమైంది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి ఉన్న భారత రాష్ట్రాల్లో గవర్నర్లు / లెఫ్ట్‌ నెంట్‌ గవర్నర్లు ‘ఏదో బాధ్యతల్లో’ బిజీ అయ్యారు అన్నది మాత్రం వాస్తవం.

అది బంగ్లాదేశ్‌ను బెదిరించి దారికి తెచ్చుకునేందుకా…! అంతకుమించిన వ్యూహం ఉందా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది.. నిర్ణయం ఏదైనా సరే… అంతిమంగా భారత్‌ సురక్ష, వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణే ఏకైక ప్రాధాన్యం కావాలన్నది నిర్వివాదాంశం….. ( మిత్రుడు వడ్డాది శ్రీనివాస్ ఫేస్‌బుక్ వాల్ నుంచి సేకరణ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions