Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

DeepSeek … ఈ సెన్సేషనల్ క్రియేషన్ వెనకా ముందూ ఇదీ కథ…

January 30, 2025 by M S R

.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత పరాయి దేశాల దెబ్బకు కుంగి కృశించిపోయిన చైనా తన దేశ సంస్కృతిని , భాషను , ప్రాచీన నాగరికతను కాపాడుకుంటూ ఎలాగైనా ప్రపంచంలోని అగ్రదేశాలలో ఒకటిగా తల ఎత్తుకుని నిలబడాలని సంకల్పించుకుంది.

ఆశయాన్ని సాధించేముందు ప్రపంచ దేశాలలో సాంకేతిక నైపుణ్యంలో అగ్రగామిగా ఉన్న దేశం అమెరికా అని గుర్తించి ఆరు నూరైనా అమెరికాను విజ్ఞాన , వ్యాపారరంగాలలో ఓడించాలని దీక్షపూనుకుంది . ఈ పోటీతత్వానికి పరాకాష్ఠ ఇటీవల అమెరికాలో పెద్ద కంపెనీలను కుదిపేసిన చైనా కృత్రిమ మేధ- ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సంస్థ “డీప్ సీక్” ఉదంతం.

Ads

అమెరికా స్టాక్ మార్కెట్లో ఉన్న పరిణామాలను గణిత సూత్రాలతో పసికట్టడానికి జిమ్ సిమ్మన్స్ అనే ఒక గణిత శాస్త్రవేత్త రెనసాన్స్ టెక్నాలజీస్ సంస్థను 1982 ప్రారంభించాడు. సాధారణంగా గణిత , భౌతిక శాస్త్రానికి మాత్రమే అవసరపడే సాంకేతిక మెళకువలను స్టాక్ మార్కెట్ లోని విపరీతమైన మార్పులకు విజయవంతంగా వాడేసరికి యావత్ వ్యాపారలోకం హడలిపోయింది. దాని ప్రభావం నేటికీ కనపడుతోంది.

లక్షలమంది ఫిజిక్స్ , మాథెమాటిక్స్ , కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ నైపుణ్యాన్ని వాడుకుని స్టాక్ మార్కెట్ ఎలా మారుతుంది , మారితే దేన్ని కొనాలి , ఎంత కొనాలి , ఎంత అమ్మాలి అని అహోరాత్రాలు కొత్తకొత్త సూత్రాలను కనుకుక్కుంటూ ఉంటారు. కృత్రిమ మేధను వాడుకుని పెద్ద సంస్థలకు సరైన స్టాక్ మార్కెట్ పెట్టుబడుల మార్గాలను వెతకడాన్ని అల్గరిథమిక్ ట్రేడింగ్ (algorithmic trading) అంటారు .

చైనాలో పుట్టిపెరిగిన లియాంగ్ వెన్ఫెంగ్ హై ఫ్లయెర్ (High Flyer) హెడ్జ్ ఫండ్ సంస్థకు అధినేత. విద్యార్థిగా ఉన్నరోజుల్లో 2007-08 మార్కెట్ క్రాష్ గురించి , జిమ్ సిమ్మన్స్ గురించి తెలుసుకుని అల్గరిథమిక్ ట్రేడింగ్ చెయ్యాలని ఈ సంస్థను 2016లో మొదలుపెట్టాడు. ఈ సంస్థ మెల్లగా వృద్ధిలోకి రావడంతో లియాంగ్ దృష్టి కృత్రిమ మేధ పరిశోధనలవైపు మళ్లింది. డీప్ సీక్ సంస్థను 2023లో స్థాపించి వారి హై ఫ్లయెర్ కంపెనీలో ఒక భాగం చేశాడు.

కృత్రిమ మేధ పరిశోధనల్లో మొన్నటివరకు అమెరికాదే ఏకఛ్చత్రాధిపత్యం . ఈ ఒక్క రంగమే కాదు , మానవ పురోగతికి సంబంధించి ఏ సాంకేతికరంగంలోనైనా సుమారు 50 ఏళ్ల ముందే ఏదో ఒక అమెరికా యూనివర్సిటీలోనో లేదా అమెరికా సైన్స్ ఫిక్షన్ రచయితల స్వప్నాల్లోనో కచ్చితంగా బీజాలు పడే ఉంటాయి.

దీనికి కారణాలు :-
1. విపరీతమైన సంపద
2. తెగింపు
3. మానవ మేధస్సు నుండి పుట్టే ఊహలను నిజం చేసుకోవడానికి ఆ సంపద తోడ్పడేలాగా వారి సమాజాన్ని నిర్మించుకోవడం.

దీనికి తోడు భూమ్మీద కొద్దో గొప్పో టాలెంట్ ఉన్న మనిషిగా పుడితే తెలిసీ తెలియకుండానే అమెరికా మనల్ను అటు లాగేసుకుంటుంది . ఆ దేశపు స్వభావమే అంత . ఇలా ప్రపంచాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న అమెరికా ఇన్నోవేషన్ కు ఒక చైనా కంపెనీ చెక్ పెట్టడం ప్రశంసనీయమైన విషయమే . అది కూడా కృత్రిమ మేధలో అవడం ఇంకా ఆశ్చర్యకరం.

అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ.ఐ. దిగ్గజాలు కేటాయించిన ఖర్చులో పదోవంతు వాడి ఒక్క ఏడాదిలోనే డీప్ సీక్ సంస్థ తయారు చేసిన ఓపెన్ సోర్స్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్- R1 అందరి ప్రశంసలు పొందుతోంది .

సాధారణంగా కొత్తగా విడుదల చేసే ఏ ఏ.ఐ. మోడల్ అయినా హయ్యర్ ఎండ్ వర్షన్ వాడాలంటే ప్రీమియం ప్యాకేజీ లేదా టోకెన్స్ తీసుకోండి అని Open ai , google gemini ai తదితర సంస్థలు ప్రచారం చేస్తాయి. వాటి ధరలు కూడా భారీగానే ఉంటాయి. కానీ డీప్ సీక్ దీనికి భిన్నంగా కొత్తగా తయారుచేసిన R1 మోడల్ ను తక్కువ ధరకు విడుదల చేసింది.

ఆ దెబ్బతో అమెరికాలోనే చాల మంది ఈ డీప్ సీక్ యాప్ ను వాడుతున్నారు . దాంతో ప్రస్తుతానికి ఏ.ఐ.కి సంబంధించిన అమెరికా కంపెనీల స్టాక్స్ బాగా నష్టపోయాయి . హుటాహుటిన అమెరికా ప్రభుత్వం , వ్యాపార రంగం ఈ ఏ.ఐ. రేసులో ఎలాగైనా ముందుండాలని చైనాలో ఏ.ఐ. పరిశోధనలకు ఉపయోగపడే ఎన్వీడియా చిప్స్ ఎగుమతి తగ్గించాలని ఆలోచిస్తున్నారు . కానీ అలా ఆపితే చైనాకు ఉన్న విపరీతమైన పోటీతత్వంతో చిప్ డిజైన్ లో కూడా ముందుకు దూసుకుపోతుందేమో అని కొందరి వాదన!

స్టాక్ మార్కెట్ ను పక్కన పెడితే ఈ ఏ.ఐ. పరుగంతా జరుగుతోంది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటిలిజెన్స్- AGI కోసమే . ఎప్పుడైతే కృత్రిమ మేధస్సు మనిషి ఆలోచన, విచక్షణా శక్తిని , తెలివితేటలను దాటుతుందో అప్పుడు మానవ సమాజం పూర్తిగా మారిపోతుందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. దీనికోసమే Open AI , Google , Microsoft ఎంతో డబ్బు ఖర్చుపెడుతున్నారు .

వారి సాఫ్ట్ వేర్ పరిశ్రమకు అవసరమైన హార్డ్ వేర్ ఎన్వీడియా వంటి సంస్థలు అందిస్తాయి. కాబట్టి వాటి విలువ కూడా పెరుగుతోంది . ఈ సంస్థలన్నీ అమెరికావి కావడంతో వారి ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తోంది. కానీ ఒక్కసారిగా రేసులో వేరే దేశంవారు చాలా తక్కువ ఖర్చుతో లక్షలకోట్ల అమెరికా పరిశోధనకు ధీటుగా వచ్చేసరికి అమెరికాకు తలప్రాణం తోకకు వచ్చినంతపనవుతోంది. కానీ చైనా ఇదివరకులా ఏమైనా అడ్డదారుల్లో వెళ్లి ఈ పోటీలో ముందుకు వస్తోందా! అనే ప్రశ్నలు కూడా అందరిలో ఉన్నాయి.

ఈ పరుగుపందెంలో ఇంకో చిక్కుంది. AGI రాకతో నానో టెక్నాలజీ, స్పేస్ ట్రావెల్, వైద్యం, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లీన్ ఎనర్జీ లాంటి ఏయే రంగాల చిక్కుముళ్ళు విప్పడానికి శాస్త్రవేత్తలు నేడు తలమునకలుగా కష్టపడుతున్నారో ఆయా సమస్యలను AGI తనకు తానే పరిష్కరించుకొని వాటిని అధిగమించి ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని సృష్టిస్తుందన్నది ఏ.ఐ. శాస్త్రవేత్తల అభిప్రాయం . దాన్నే టెక్నలాజికల్ సింగ్యులారిటీ (technological singularity) అని అంటారు.

కానీ ఆ కొత్త శకంలో మనిషిని దాటిన మేధ ఉంటుంది కాబట్టి మనకు ఎంతవరకు లోబడి, మనకు అనుగుణంగా ప్రవర్తిస్తుందన్నది ఈ రోజు జరుగుతున్న ఏ.ఐ. పరిశోధనల్లో ఉన్న శాస్త్రవేత్తల దృక్పథం మీదే ఆధారపడి ఉంటుంది.

డబ్బును మనం అనుకున్న పనికి సరిపోయేలా చేసుకోవాలేకానీ… డబ్బే మనల్ని నియంత్రించకూడదన్నది బహుశా ఈ చైనా కంపెనీ ప్రపంచానికి నేర్పుతున్న పాఠం.

ఇక మన భారతదేశం దగ్గరికి వస్తే గత కొన్నేళ్లలో డీప్ సీక్ లాగే ప్రపంచమంతా మన పేరు మారుమోగేలా చేసింది అంతరిక్షరంగంలో ఇస్రో. (మరికొన్ని ప్రైవేట్ స్పేస్ సంస్థల పరిశోధనలు కూడా) మన దేశ ప్రజాస్వామ్యపు విలువలను, అపారమైన జన సంపదను , సంస్కృతిని , భాషలను అర్థం చేసుకుని మన దేశం నిపుణులు ఈ పరుగుపందెంలో వేరే దేశాలవారిలా కాకుండా హుందాగా, చిత్తశుద్ధితో, ఇష్టంతో పరుగెడితే మనకున్న పోటీతత్వానికి ఏదైనా కొత్తగా సాధిస్తామేమో!

-పమిడికాల్వ సుజయ్
sujaypamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions