నిజమే… ఓ మిత్రురాలు చెప్పినట్టు… ఎంతసేపూ ఆ క్షుద్ర రాజకీయాలేనా..? ఇక వేరే జీవితమే లేదా..? ఆఫ్టరాల్ పాలిటిక్సు గురించి ఎవడికి పట్టింది..? ఈ జనరేషన్ అయితే అస్సలు పట్టించుకోదు, పైగా ఏవగించుకుంటుంది… సరే, సరే…. జీవితంలోని పంచమహాపాతకాలు ఏమిటేమిటో గానీ… షష్టి లేదా సప్తమ పాతకం మాత్రం ఆహార వృథా… ఆకలి అంచనా లేకుండా ఎక్కువ తక్కువ వండేసి, మిగిల్చి, ప్రిజ్జులో పడేసి, తెల్లారాక దాన్ని ఏం చేయాలో అర్థం గాక డస్ట్ బిన్లో పడేసే ఫుడ్డు అపరిమితం… అది గాక హోటళ్లలో, ఫంక్షన్ హాళ్లలో, పార్టీల్లో జరిగే వృథా మరీ ఎక్కువ… సో, వీలైనంతవరకూ… మరీ పాచిపోయిన ఫుడ్ తినేయడం కాదు గానీ, పారేయడానికి ప్రత్యామ్నాయం వెతకాలి… మనమే వినియోగించుకోవాలి… ఇది ఫస్ట్ పాయింట్, రెండో పాయింట్ ఏమిటంటే..? భారతీయ పాకశాస్త్రానికి, వంటశాలకు అతిపెద్ద శాపం యూట్యూబ్… వామ్మో, పిచ్చి పిచ్చి ప్రయోగాలతో అసలు వంటల ఒరిజినాలిటీని భ్రష్టుపట్టించి, ఈ తరాన్ని ‘రియల్ టేస్టు’లకు దూరం చేస్తున్నయ్… మూడో పాయింట్… ఇప్పుడు మనం చెప్పుకునేది…
యూట్యూబు ఫుడ్ వీడియోల్లో అత్యధికం ఇడ్లీ, దోశెలపైనే… ఇడ్లీయే తీసుకుంటే బటన్ ఇడ్లీ, పొట్టెక్కలు, కాంచీపురం ఇడ్లీలు వంటి ట్రెడిషనల్ ఇడ్లీల దగ్గర్నుంచి… ఈ మధ్య రాగి ఇడ్లి, కొర్ర ఇడ్లి, జొన్న ఇడ్లి, ఓట్స్ ఇడ్లి, మక్క ఇడ్లి, రవ్వ ఇడ్లి వంటి హెల్త్, టేస్ట్ కాన్షియస్ ఇడ్లీలు… స్టఫ్డ్ ఇడ్లి, కాజూ ఇడ్లి, మసాలా ఇడ్లి వంటి కొత్త కొత్త ప్రయోగాల దాకా…. అలాగే ఇడ్లిలోకి చేసుకునే పొడులు, సాంబారు, చట్నీ దాకా… బోలెడు వీడియోలు… అవన్నీ సరే, కానీ మిగిలిన ఇడ్లీలను ఏం చేయాలి..? ఇది కదా… సాంబార్ అయిపోయింది, చట్నీ అయిపోయింది, కానీ ఇడ్లీలు మిగిలాయి, ఓవెన్లో పెట్టలేం, మళ్లీ కుక్కర్లో పడేయలేం… ఆ చల్లటి ఇడ్లీలు తినలేం… మరేం చేయుట..? ఇడ్లీ కారంలో నెయ్యి వేసుకుని ఎంచక్కా లాగించొచ్చు కానీ చాలామందికి అలా ఇష్టముండదు… పారేస్తే పాతకం అంటున్నారు… మరి..? సైట్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే… మిర్చి ఇడ్లి, ఇడ్లి మంచూరియా, చిల్లీ ఇడ్లి, ఫ్రైడ్ ఇడ్లి అంటూ బోలెడు ప్రయోగాలు కనిపిస్తాయి… అన్నీ చేసే ఓపికే ఉంటే… ఎంచక్కా సాంబరు, చట్నీ చేసుకుని, సాంబారులో కాసేపు పడేస్తే సాంబార్ ఇడ్లి అవుతుంది, వేడిగా ఉంటయ్… కదా… సో, వేగంగా, సింపుల్గా చేసే రెసిపీ అవసరం…
Ads
దీనికి ఇడ్లి ఉప్మా బెటర్… మళ్లీ సైటు, ట్యూబును నమ్మితే… బఠాణీలు వేయండి, కాజూ వంటి డ్రై ఫ్రూట్స్ వేయండి, వేరే కూరగాయలు వేయండి, వేయించిన పల్లీలు వేయండి, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కుమ్మేయండి… ఇడ్లి పొడిని కలపండి… అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొండి… వీలుంటే ఉడికించిన పన్నీర్ ముక్కలు యాడ్ చేయండి….. ఇలా వంద చెబుతాయి అవి… ఇక సింపుల్ రెసెపీ ఏమున్నట్టు..? సో, ముందుగా ఆ ఫ్రిజ్జులో ఇడ్లీలను బయటికి తీసి, మామూలు టెంపరేచర్ వచ్చాక, ముక్కలు ముక్కలు చేయండి, కత్తులతో కాదు, చేతులతోనే… మరీ పొడిలా కాదు, పెద్ద ముక్కల్లా కాదు… తగినంత ఉప్పు కూడా కలిపేయండి… మిగతా పోపు తెలుసు కదా… నూనె, ఆవాలు, జిలకర… వద్దు, శెనగపప్పు జోలికి వద్దు… ఎంచక్కా పెసరపప్పు వేయండి… నానబెట్టిన అవసరమూ లేదు… ఉప్మా తింటుంటే పంటి కింద కటుక్కుమని తగలాలి… మిర్చి కూడా వద్దు, కారం వేయండి… ఓ ఉల్లిపాయను సన్నగా తరిగి వేసేయండి… కాస్త వేగినట్టు అనిపించాక ఈ నలిపిన ఇడ్లీలను వేసి కలపండి… అంతే… అంచుకు ఇడ్లి పొడి లేదా నిమ్మకాయ పచ్చడి, ఊరగాయ ఏదైనా వోకే… నిమ్మకాయ పిండండి, పైన సేవ్ చల్లండి వంటి సలహాలూ డోన్ట్ కేర్… పెండాబెల్లం అన్నీ కలిపితే దాని అసలు రుచి పోతుంది… ఇది ఎందుకు చెప్పుకోవడం అంటే… దాదాపు ప్రతి ఇంట్లో ఎప్పుడూ ఇడ్లీలు పోస్తూనే ఉంటారు, మిగులుతూనే ఉంటాయి, పారేస్తూనే ఉంటారు… అలా పారేయడం వద్దు, మన కడుపులోకే వేద్దాం అని చెప్పడానికి…!! అవునూ… దీనికి ఉప్మా అనే నామవాచకం తగిలించడం సబబేనా..?! ఓ పాత సినిమాలోని ఈ సీన్ చూడండి… ఆప్ట్…
https://www.youtube.com/watch?v=5Yg5Imi0AWE
Share this Article