…… ఈమె పేరు కొంగర సుధ… ప్రస్తుతం సౌతిండియన్ ఫిలిమ్ సర్కిళ్లలో మారుమోగుతున్న పేరు… అచ్చమైన తెలుగు మహిళ… అదీ రోజూ ఆందోళనలు జరుగుతున్న రాజధాని అమరావతి ప్రాంత బిడ్డ… ఊరు తూళ్లూరు… వయస్సు 48… అప్పుడెప్పుడో చెన్నైకి వలస వెళ్లిన కుటుంబం…
టైం… టైం వచ్చేదాకా ఎంత ప్రతిభ ఉన్నా, ఏం చేసినా కలిసిరాదు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ… ఆ టైం వచ్చినప్పుడు ఇక ఆకాశమే హద్దు అని చెప్పడానికి ఓ నిఖార్సయిన నిదర్శనం… ఎందుకంటే..? ఆమె ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దగ్గర ఆరేడేళ్లు అసోసియేట్ డైరెక్టర్‌గా చేసింది… పద్దెనిమిదేళ్ల క్రితమే… అంటే 2002లోనే మిత్ర్, మై ఫ్రెండ్ సినిమాకు స్క్రీన్ రైటర్ ఆమె… ఆ తరువాత 2010 దాకా… అంటే ఎనిమిదేళ్లు ఆమె పేరే వినిపించలేదు…
2010… తమిళంలో ద్రోహికి దర్శకత్వం చాన్స్ వచ్చింది… శ్రీకాంత్, విష్ణు… షమ్నా కాశిం అలియాస్ పూర్ణ, శ్రియ, పూనం బజ్వా… ఈ తారాగణంతో సినిమా… సరే, అది హిట్టయిందో, ఫ్లాపయిందో పక్కన బెడితే… 2016 దాకా మళ్లీ ఈమెకు ఏ అవకాశాలూ రాలేదు… అసలు ఫీల్డులో మహిళ దర్శకులే తక్కువ… ఎంకరేజ్ చేసేవాళ్లు ఉండరు…
Ads
2016లో ఆమె దశ కాస్త తిరిగింది… ఇరుద్ది సూత్రు… ఓ బాక్సింగ్ కోచ్ కథాంశంతో తమిళంలో తీసింది… హిందీలోనూ అదేసమయంలో సాలా ఖదూస్ పేరిట రిలీజ్ చేశారు… బెస్ట్ డైరెక్టర్‌గా ఆ సంవత్సరం ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా కొట్టింది… సినిమాకు కూడా మంచి అప్లాజ్ వచ్చింది… కానీ మళ్లీ ఏ కొత్త సినిమా తనకు దక్కలేదు…
2017లో అదే సినిమాను తెలుగులో తీసింది… వెంకటేశ్ హీరో… పేరు గురు… అంతే ఇక… ఆమెకు ఏ సినిమా దర్శకత్వం చాన్సూ రాలేదు… 2020… ఏదో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ అంథాలజీ ఫిలిమ్… అంటే ఐదారుగురు దర్శకులు విడివిడిగా తీసి, కలిపి కుట్టేసే వెబ్ సీరిస్… అందులో ఒక పార్ట్‌కు దర్శకురాలు ఆమె… మరో అంథాలజీ ఫిలిమ్ కూడా ఒప్పుకుంది… ఈలోపు ఒక మంచి కథను సినిమా తీసే చాన్స్ తలుపు తట్టింది… అదే ఎయిర్ డెక్కన్ ఏవియేషన్ సంస్థ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ బయోపిక్…
సూర్య లీడ్ రోల్‌కు వోకే అన్నాడు… తనే నిర్మాత… థియేటర్లలో కాదు, ఓటీటీలో విడుదలకు ప్లాన్… సాహసం… నిజానికి ఇప్పటిదాకా ఓటీటీల్లో రిలీజ్ అయిన ఏ సౌతిండియన్ సినిమా హిట్ కాలేదు… కానీ ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది… ఇదే థియేటర్లలో గనుక విడుదలై ఉంటే కలెక్షన్ల వర్షం కురిసేదేమో… దీన్నే ఆకాశం నీ హద్దురా పేరిట తెలుగులోనూ రిలీజ్ చేశారు… తెలుగు ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టారు…
ఇప్పుడు ఆమెకు టైం వచ్చింది… ఈ సినిమా తీసిన తీరు చూసి విజయ్ దేవరకొండ ఆమెను నాకూ ఓ సినిమా తీసిపెట్టాలి అంటూ బహిరంగంగానే అడిగాడు… అంటే అది ప్రశంస… అజిత్, విజయ్ తదితర తమిళ స్టార్ హీరోలు కూడా తమకు సినిమాలు చేయాలని అడిగారు… అందరూ స్టార్ హీరోలే… సూర్య వంటి ఓ మాస్ స్టార్ హీరోను ఓ బయోపిక్ ద్వారా, ఓ భిన్నమైన కథతో డీల్ చేయడం… పైగా ఎక్కడా కమర్షియల్ విలువలతో రాజీపడకుండానే… అందరికీ నచ్చే ఓ సినిమా ప్రజెంట్ చేసిన తీరుకు మంచి గుర్తింపు లభించింది… అయితే నిజంగానే వీటిలో ఎన్ని సినిమాలు పట్టాలెక్కుతాయి అనేది ఓ ప్రశ్న… అన్నీ పట్టాలు ఎక్కాలనే ఆశిద్దాం…
Share this Article