ఇవ్వాళ తెలుగు నెట్‌ను షేక్ చేస్తున్న గొంతు పార్వతి… కచ్చాబదాం పాటకన్నా తెలుగు ప్రేక్షకులు పార్వతి గొంతుకు నీరాజనం పడుతున్నారు… అందరూ, ప్రతి విషయంలోనూ యూట్యూబ్ చానెళ్లను ఆడిపోసుకుంటారు గానీ… ఈ కోకిలకు అద్భుతమైన ప్రాచుర్యం కల్పిస్తున్నారు… ఆమె గురించి ఏ వీడియో పెట్టినా సరే వైరల్ అయిపోతోంది… జీతెలుగు సరిగమప ప్రోగ్రాం కోసం ఎంపికైన ఆమె పాటకు పరవశించిన జడ్జిలు ఏం కావాలో కోరుకోవాలని అడగడం, ఆమె తన కోసం గాకుండా ఊరికోసం బస్సు వేయించాలని కోరడం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేసింది…
జడ్జిలు ఆర్టీసీ అధికారుల్ని అడగడం, వాళ్లు వెంటనే బస్సు వేయడం… తరువాత పార్వతి హోం టూర్, తండ్రితో ఇంటర్వ్యూ, పాత పాటల వీడియోలన్నీ యూట్యూబ్‌లో నిండిపోతున్నయ్… ఒకరిద్దరు యూట్యూబర్లు మనిషి కాకి, గొంతు కోకిల అంటూ థంబ్ నెయిల్స్ పెట్టడం మాత్రం నీచమైన అభిరుచి… అలాంటి కొన్ని చెత్త వ్యాఖ్యలు మినహా స్థూలంగా మీడియా ఆమెను బలంగా ప్రోత్సహించినట్టే లెక్క…
ఓ చిన్న ఊరు నుంచి, ఓ పేద కుటుంబానికి చెందిన గాయని పార్వతిని జీతెలుగు టీం ఎంపిక చేయడం బాగుంది… ఆమె తన ఫస్ట్ పాటతోనే అదరగొట్టేసింది… ఇక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పుకోవాలి… ప్రస్తుతం సింగర్స్ పరిస్థితేమిటో, సంగీత దర్శకుల ధోరణులు ఏమిటో కూడా ఓసారి మథనం జరగాలి… ముందుగా ఈ పాట ఓసారి వినండి… తరువాత మాట్లాడుకోవచ్చు…
Ads
స్టేజీ మీద ట్రాక్ సపోర్టుతో గానీ, ఆటో ట్యూన్ సపోర్టుతో గానీ… లేదా మంచి సౌండ్ సిస్టం, మైకుతో గానీ పాడినప్పుడు ఏ గాయనికైనా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది… కొన్ని లోపాలు కప్పబడిపోతయ్… జస్ట్, అవేవీ లేకుండా మామూలుగా ఓ ఫంక్షన్‌లో పాడినప్పుడు ఆమె గొంతు, వాయిస్ కల్చర్, బ్రీత్ కంట్రోల్, స్వరజ్ఞానం స్పష్టంగా అర్థమవుతయ్… చాలామంది ప్రస్తుత తెలుగు లేడీ సింగర్స్‌కన్నా ఈమె గొంతులో మాధుర్యం ఉంది… ఈ పాట కూడా వినండి ఓసారి,..
సో, ఆమెది సహజమైన ప్రతిభ… పుట్టుకతో వచ్చింది… అయితే..? ఇప్పుడు మ్యూజిక్ మార్కెట్‌లో గొంతు మాత్రమే కాదు… రూపం కూడా ప్రధానంగా చూస్తున్నారు ఈవెంట్ మేనేజర్లు, సంగీత దర్శకులు… అదొక పైత్యం… అదేమంటే ప్రేక్షకుల మీదకు తోసేస్తుంటారు నెపాన్ని… అదే నిజమైతే పార్వతికి ఇంత భారీ అప్లాజ్ ఎందుకొస్తున్నట్టు..? మంచి గొంతును ప్రజలు తప్పకుండా ప్రేమిస్తారు… చూద్దాం… ఈ సరిగమప ప్రోగ్రాం అయిపోయాక కూడా పార్వతిని ఎంత ప్రోత్సహిస్తారో చూద్దాం… ఇప్పుడు ఆహా ఓహో అంటున్న ప్రముఖులు ఆమెకు ఎంత చేయూతనిస్తారో చూద్దాం… ఆ గొంత మరింత మధురిమతో పల్లవించడానికి ఏ సాయం చేస్తారో చూద్దాం…!! ఆల్ ది బెస్ట్ పార్వతీ…
Share this Article