హైదరాబాద్… ఐసీఐసీఐ బ్యాంకు శాఖ… ఓ పెద్ద మనిషి తన బ్యాంకు ఖాతా నుంచి పది లక్షలు డ్రా చేయడానికి చెక్కు రాసి… క్యాషియర్‌కు ఇచ్చాడు… క్యాషియర్ పక్కనే నిల్చున్నతను ఎంత అనడిగాడు… పది అన్నాడు ఈ పెద్ద మనిషి… ఆ పక్క లైన్‌లోకి రా అన్నాడు అతను… రా అనే ఏకవచనంతో ఆ పెద్ద మనిషికి ఎక్కడో చురుక్కుమంది…
ఆ చెక్కును అటూ ఇటూ చూసి, ఆ పెద్ద మనిషిని ఎగాదిగా చూసి… ఎందుకింత డబ్బు డ్రా చేస్తున్నవ్ అనడిగాడు… ఇంటి రిపేర్ల పని పెట్టుకున్నాను అన్నాడాయన… ఒకేసారి 10 లక్షలు డ్రా చేయడం ఏమిటన్నాడు సదరు బ్యాంకు ఉద్యోగి… అయ్యా, నా పైసలు, నా ఖాతా, నా అవసరం, నేను డ్రా చేస్తున్నాను కదా అని ఒద్దికగానే చెప్పాడు ఆ పెద్ద మనిషి…
ఐటీ వాళ్లకు రిపోర్ట్ చేస్తాం సరేనా అన్నాడు ఉద్యోగి… ఈ పెద్ద మనిషికి చర్రుమంది… ఐటీకి వద్దు బాబూ అన్నాడు కాస్త వెటకారం ఆటోమేటిక్‌గా వచ్చేసింది… అదేమిటి అన్నాడు ఉద్యోగి, ఈ మసలోడు భలే దొరికాడు నాకు అన్నట్టుగా ఉంది ధోరణి… ఐటీకి వద్దు, ఈడీకి పంపించు అన్నాడు ఈయన సర్కాస్టిక్‌గా… అదంతా వైట్ మనీ, బ్లాక్ అయితే బ్యాంకు సేవింగ్ ఖాతాలో ఎందుకు పెట్టుకుంటాను… నీకు కావాలంటే ఐటీ రిటర్న్ సాఫ్ట్ కాపీ పంపిస్తాను అన్నాడు…
Ads
సదరు ఉద్యోగి మొహం మాడిపోయింది… 9.5 లక్షలు తీసుకో, మిగతా 50 వేలు బయట ఏటీఎంలో గీక్కో… అని ఓ తరుణోపాయం చెప్పి, ఎందుకైనా మంచిదని తనకన్నా కాస్త పెద్ద హోదా ఉన్న మరొకతన్ని చూపించి, ఆయన్ని కలువు అన్నాడు… ఈయన తాపీగా వెళ్లి సదరు పెద్ద ఉద్యోగిని నమస్తే సార్ అన్నాడు… ఏమిటీ విషయం..? మళ్లీ జీరో నుంచి స్టార్ట్ చేశాడు ఈయన… ఆ పెద్ద ఉద్యోగి కూడా మళ్లీ ఎందుకు ఇంత డబ్బు డ్రా చేస్తున్నవ్ అనడిగాడు… ఈ బ్యాంకు ఉద్యోగులందరికీ ఈ ఏకవచన పైత్యం ఉన్నట్టుంది అనుకుని ఈ పెద్దాయన మళ్లీ మొత్తం రికార్డు వినిపించాడు…
నీకు లక్ష మాత్రమే కమీషన్ లేకుండా డ్రా చేసుకునే అవకాశం ఉంది… మిగతా 9 లక్షలకు లక్షకు 590 చొప్పున కట్ చేసుకుంటాం అన్నాడు… ఈ పెద్దాయన మొహం మాడిపోయింది… ఐనా క్యాష్ దేనికి..? చెక్కులతో, ఫోన్ పేతో లేదంటే ఏదైనా యూపీఐతో పేమెంట్స్ చేసుకోవాలి అన్నాడు, ఈమాత్రం తెలియదా అన్నట్టు మొహం పెట్టాడు… ఈ పెద్దాయనకు కాలింది… లక్షకు 590 రూపాయల కమీషన్ లేదా చార్జీలు చెల్లించడం ఏమిటో అర్థం కాలేదు… తనకు మరో జాతీయ బ్యాంకులో ఖాతా ఉంది… వాళ్లెప్పుడూ ఈ కమీషన్లు, చార్జీల తంతు చెప్పలేదు, కాకపోతే పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసే సందర్భంలో తన అవసరం ఏమిటో రాసిన ఓ లెటర్ తీసుకునేవాళ్లు…
అన్ని బ్యాంకుల్లోనూ ఈ చార్జీలు ఉంటాయి అని దబాయించాడు సదరు పెద్ద ఉద్యోగి… ఈ పెద్దాయనకు చర్రున మండింది… నా ఖాతా క్లోజ్ చేస్తాను అన్నాడు… సరే, నీ ఇష్టం, మూడు రోజులు పడుతుంది, ఐనా నగదు ఇవ్వలేం, నువ్వు ఏదైనా వేరే బ్యాంకు ఖాతా చెబితే అందులోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం అన్నాడు ఆ బ్యాంకు ఉద్యోగి చాలా నిర్వికారంగా… వెంటనే పని కావాలంటే ఏం చేయాలబ్బాయ్ అనడిగాడు ఈయన… సదరు ఉద్యోగి ఆర్టీజీఎస్ ఫామ్ ఇచ్చి, వివరాలు నింపి ఇవ్వు, నువ్వు కోరిన బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసేస్తాం…
నాకు వేరే ఏ బ్యాంకులో ఖాతా లేకపోతే..? అనడిగాడు ఈ పెద్దాయన… లక్షకు 590 అని మళ్లీ గుర్తుచేశాడు సదరు బ్యాంకు ఉద్యోగి… ఈ పెద్దాయన చాలా చిరాకుగా మొహం పెట్టి… పెద్ద పెద్ద దొంగలు బ్యాంకుల్ని దోచుకుని వెళ్తుంటే మీకు ఏమీ చేతకాదు, నాలాంటి ముసలోళ్లను సతాయించి, అడ్డగోలు చార్జీలు కట్ చేస్తారా అన్నాడు… సదరు ఉద్యోగి బ్యాంకు గోడకు వేలాడదీసిన మోడీ ఫోటో వైపు వేలు చూపిస్తూ… ఆయన పెట్టిన పెంట ఇది, వెళ్లి ఆయన్ని అడుగు అన్నాడు ఆ ఉద్యోగి… ఈ పెద్ద మనిషి కూడా మోడీకి నమస్కారం చేశాడు… గొప్ప పరిపాలనదక్షుడు, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో దిట్ట… ఇదుగో ఆర్టీజీఎస్ అంటూ వివరాలు రాసి, సదరు బ్యాంకు ఉద్యోగికి అందించాడు… తరువాత ఏం జరిగింది అనేది అప్రస్తుతం…
ఇదంతా నిజంగానే జరిగింది… నేనే కాదు, మరో అయిదారుగురు ప్రత్యక్ష సాక్షులు… ఒరేయ్, ఒరేయ్, ఆయన ఏం చదివితే ఏమిట్రా, ఆ డిగ్రీ కాగితాలు ఫేకో, నిజమో ఎవడికి కావాలిరా… ఎంత అద్భుతమైన పాలనో చూడండిరా… కరెన్సీ నోట్ల మీద అర్జెంటుగా గాంధీ బొమ్మను డిలిట్ కొట్టి, ఆయన బొమ్మను ప్రింట్ చేయాల్సినంత గొప్పోడు… లక్షకు 590 రూపాయల ఛార్జీలు అంటే మాటలా మరి…!! నోట్ల రద్దు దగ్గర్నుంచి ఇలాంటి కత్తెర పాలన దాకా… సారు గారు, ఢిల్లీ పాదుషా గారు..!!
Share this Article