గత కొద్దిరోజుల్లో కాస్త ఆసక్తిని క్రియేట్ చేసిన సినిమా వార్త… ప్రాజెక్ట్ కె..! ఆ సినిమా షూటింగు కోసం హైదరాబాద్ వచ్చిన హీరోయిన్ దీపిక పడుకోన్‌కు సినిమా యూనిట్ పసుపు, కుంకుమ, గాజులతో స్వాగతం చెప్పారనే పాయింట్ కాదు… ఆమె వాటిని పెద్దగా పట్టించుకోదు కూడా… కాకపోతే సినిమాకు భిన్నమైన ప్రచారం దక్కాలంటే ఇలాంటివేవో చేయాలి కదా మరి… ఇంకా సరదాగా చెప్పుకోవాలంటే బహుశా ఆ స్వాగతం దీపికకు బదులు కంగనా రనౌత్‌కు సరిగ్గా సూటయ్యేదేమో… సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేసింది నిజానికి ప్రభాస్, అమితాబ్, దీపిక నటిస్తున్నారని కాదు… దర్శకుడిగా నాగ్ అశ్విన్ రెడ్డి పేరు… ప్లస్ ఆ సినిమాకు పెట్టబోయే బడ్జెట్… హీరో ప్రభాస్ మీద ఇప్పుడు దాదాపు వేయి, వేయిన్నర కోట్ల టర్నోవర్ ఆధారపడ్డ జోరు…
రెండొందల కోట్లు, మూడొందల కోట్లు… ఇలా రకరకాల ప్రచారం… ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ వెచ్చిస్తున్న తొలి సినిమా అనే ప్రచారం… ఇది అశ్వినీదత్ సొంత సినిమా… అల్లుడు దర్శకుడు… సైన్స్ ఫిక్షన్ సినిమా అని ట్రెయిలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది… ఆల్‌రెడీ షూటింగ్ స్టార్టయింది… ఇప్పుడు రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ పెద్ద సెట్ వేశారు… అవన్నీ వోకే… అశ్విన్ కోణానికి వెళ్దాం… ఎప్పుడో 2008లోనే ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా చాన్నాళ్లు శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే… తరువాత ఏదో షార్ట్ ఫిలిమ్… 2015లో నాని హీరోగా తీసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఎవరీ అశ్విన్ అనే దృష్టి మళ్లింది తనపై… తరువాత మళ్లీ చడీచప్పుడూ లేదు…
Ads
2018లో మహానటి… అదీ ఆ కుటుంబం నిర్మించుకున్న సొంత చిత్రమే… సూపర్ హిట్… అశ్విన్ పేరు ఎక్కడికో వెళ్లిపోయింది… మళ్లీ సైలెంట్… మధ్యలో జాతిరత్నాలు అనే ఓ సరదా చిత్రాన్ని నిర్మించారు తప్ప, ఆ సినిమా దర్శకత్వంలో అశ్విన్ వేళ్లు, కాళ్లు ఏమీ పెట్టలేదు… ఇప్పుడిక ప్రాజెక్ట్ కే… మామ బడా నిర్మాత, సీనియర్, అనుభవమున్నవాడు… భార్యకు సినిమా ఫీల్డ్ మీద మంచి అవగాహన ఉంది. ఫిలిమ్ మేకింగ్ మీద అమెరికాలో చదువుకుంది… స్వయంగా నిర్మాత… ఈ ప్రాజెక్ట్ కే వ్యవహారాలన్నీ ఆ కుటుంబమే చూసుకుంటుంది… ఓసారి ఫేమ్ వస్తే చాలు, ఇక ఎడాపెడా రీళ్లు చుట్టేసి, జనం మీదకు వదిలేసే దర్శకులున్న ఈరోజుల్లో అశ్విన్ డెఫినిట్‌గా ఓ డిఫరెంట్ కేరక్టరే… ఇంత భారీ బడ్జెట్ సినిమా కూడా సాహసమే… ఆల్ ది బెస్ట్…
ప్రభాస్ గురించి చెప్పుకోవాలి ప్రధానంగా… ఎంతలేదనుకున్నా ప్రస్తుతం ప్రభాస్ అనే పేరు మీద వేయి, వేయిన్నర కోట్ల పందెం నడుస్తోంది… బాహుబలి తరువాత ‘ఇక ఈ రేంజ్ తగ్గకుండా చూసుకోవాలి’ అనే ఫిలాసఫీని ఒంటపట్టించుకున్నాడు… సాహో పాన్ ఇండియా సినిమా… భారీ ఖర్చు… సినిమా జయాపజయాల గురించి వదిలేయండి, ప్రభాస్ దేశం మొత్తం గుర్తించగల నటుడిగా ఎస్టాబ్లిషయ్యాడు… ఇప్పుడు ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ షూటింగులు సాగుతున్నయ్… రాధేశ్యామ్ రిలీజ్‌కూ రెడీ… అన్నీ హిందీతోసహా అయిదు భాషల్లో రిలీజయ్యేవే… భారీ సినిమాలే… బాగా హైప్ క్రియేటవుతున్న సినిమాలే…
ఇక ప్రాజెక్ట్-కే బడ్జెట్ గురించి చెప్పుకున్నాం కదా… ఇవి గాకుండా స్పిరిట్ సినిమాకు సైన్ చేశాడు… ఇవన్నీ కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో విడుదలయ్యేవే… అసలే ఆడ లేడీస్ మినహా సౌత్ ఇండియన్ స్టార్స్, టెక్నీషియన్స్ అంటే హిందీ ఇండస్ట్రీకి చిరాకు, వివక్ష… ఎవరినీ రానివ్వరు, ఎదగనివ్వరు… హీరోలనైతే అస్సలు సహించరు… అలాంటిది బాహుబలితో స్టార్టయిన ప్రభాస్ హిందీ స్టార్‌డమ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది… మిగతా సౌతిండియన్ హీరోలు సైతం ప్రభాస్ జోరును విస్తుపోతూ చూస్తున్నారు… ఈ మొత్తం సినిమాల బడ్జెటే అయిదారొందల కోట్లు… ఇక బిజినెస్ అంచనా డబుల్… ఓటీటీ, టీవీ, ఓవర్సీస్ రైట్స్ గట్రా మొత్తం లెక్కేస్తే ఇప్పుడు ప్రభాస్ అతి పెద్ద పందెం పుంజు… రేస్ గుర్రం… ఎంత నోట్ల పంట పండిస్తాడో చూడాల్సిందే ఇక… హిందీ హీరోలు ఎలా కుళ్లుకుంటారో కూడా చూడాల్సిందే… ఆల్ ది బెస్ట్ ప్రభాస్…
Share this Article