ఆచి… కాస్త పాపులర్ బ్రాండే… మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే… అరకిలో పసుపు 90 రూపాయలు… బ్రాండెడ్ గాకుండా మామూలు పసుపు పొడి కావాలంటే మీ కిరాణా షాపుల్లో, మాల్స్‌లో ఇంకా తక్కువ ధరకు కూడా… 150కు కూడా దొరుకుతుంది… అదే జిజిరియా బ్రాండ్ లకడోంగ్ పసుపు ఆర్డర్ ఇచ్చారనుకొండి… 150 గ్రాములకు 699 రూపాయలు అమెజాన్‌లో… అంటే 4660 రూపాయలు కిలోకు…! ఎక్కడ 150 రూపాయలు… ఎక్కడ 4660 రూపాయలు…! ఒక ఊరి ప్రశస్తిని కార్పొరేట్ కంపెనీలు బ్రహ్మాండంగా దోచుకుంటున్నాయి… కాస్త వివరాల్లోకి వెళ్దాం…
లకడోంగ్ అనేది మేఘాలయలో ఓ చిన్న ఊరు… 35, 40 ఇళ్లు కూడా ఉండవు… 20 ఏళ్ల క్రితం ఆ ఊరితోపాటు పరిసరాల్లోని చిన్న చిన్న ఊళ్లు కోల్ మైనింగుకు వెళ్లడం స్టార్ట్ చేశారు… దాంతో వ్యవసాయం కుంటుపడింది… తరువాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అక్కడ మైనింగును బ్యాన్ చేసింది… ఇక దిక్కులేక మళ్లీ అందరూ వ్యవసాయం బాటపట్టారు… అక్కడ సయ్యీ అనే ఓ టీచర్… తన పూర్వీకులు తమకు పదే పదే చెప్పేవాళ్లు కదా, తమ ఊరికే ప్రత్యేకంగా చెప్పుకునే పసుపు రకాలు… అవి ఎందుకు కనిపించడం లేదు..?
Ads
అందరూ లాచీ అనే రకం పండిస్తున్నారు… దిగుబడి తక్కువ, రేటు తక్కువ, శ్రమ ఎక్కువ, పైగా ఆ రకం పసుపులో కుర్క్యుమిన్ శాతం తక్కువ… అందుకని ముసలాళ్లను అడిగి, ఎలాగోలా దాచిపెట్టబడిన సీడ్ సంపాదించి, 2013లో లకడోంగ్ అనే తమ ఊరి పేరిట ఆ పసుపు సాగు స్టార్ట్ చేసింది… మంచి దిగుబడి… అంతేకాదు, మామూలు రకాల పసుపులో మూడునాలుగు శాతం కుర్క్యుమిన్ ఉంటే ఎక్కువ… కానీ ఈరకంలో కుర్క్యుమిన్ శాతం ఏడు దాటి ఉంటోంది…
చిర్మిట్ వంటి రకాల్లో 10 శాతం దాకాా ఉంటుందంటారు.. దీనివల్ల ఆ పసుపుకు మంచి రంగు, మంచి వాసన… ఇది బయటి ప్రపంచానికి తెలిసింది… డిమాండ్ పెరిగింది… సయ్యీ కూడా అందరికీ అలవాటు చేసింది… మంచి ధర వస్తుండటంతో అందరూ ఆ రకానికి అలవాటు పడ్డారు… ఇదీ స్టోరీ…
నిజమే… పసుపును మనం ఔషధాల్లో వాడతాం, వంటకు వాడతాం, మొహానికి పూస్తాం, చాలా ఉపయోగాలు… గుండె జబ్బుల్ని తగ్గించగలదు, చర్మానికి మంచిది, కేన్సర్‌తో పోరాడగలదు… రోజూ పొద్దున్నే పసుపు టీ తాగితే రోగనిరోధకశక్తి పెరుగుతుంది… ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది… ఇలా… అన్నీ కరెక్టే… కానీ మరీ ఇంత ధరా..?
కాదు… అదంతా ఆ రైతులకు పోవడం లేదు… ఆ ఊరి పసుపు అంటూ కార్పొరేట్ సంస్థలు పసుపును అడ్డగోలు ధరలకు అమ్ముతున్నాయి… అదీ అసలు కథ… దందా… ఏది మామూలు పసుపో, ఏది లకడోంగో, ఏది చిర్మిటో ఎవరికి తెలుసు..? ఆన్లైన్లో ఎవడికిష్టం వచ్చిన ధర వాడిది… అంతేకాదండోయ్… ఓ కంపెనీ లకడోంగ్ మిర్చి అంటూ అమ్ముతుంది… మరొకడు లకడోంగ్ తేనె అంటాడు… ఆ ఊరి పేరుకున్న డిమాండ్ అది… డిమాండ్ ఉంటే చాలు, దోచుకోవడానికి మన కంపెనీలు రెడీ కదా… అదే జరుగుతోంది..!! ఓ పెద్దాయన్ని అడిగితే… ఎక్కువ కుర్క్యుమిన్ కావాలంటే వంటలో ఒక చెంచా బదులు ఒకటిన్నర చెంచాలు వాడు, సరిపోదా అన్నాడు…!!
Share this Article