Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… కనుక అధ్యక్షా… ఫుల్ బాటిల్‌నే మన అధికార చిహ్నం చేయడం మర్యాద…

August 28, 2024 by M S R

చుక్కలకే చుక్కలు చూపిస్తున్న తెలుగు రాష్ట్రాలు

1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతావస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి.

ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి.

Ads

ఏది నేరం?

మత్తు పదార్థాలు అన్నీ మాదకద్రవ్యాలు కావు. కొన్ని మత్తు ద్రవాలనో, ద్రవ్యాలనో ప్రభుత్వమే తయారు చేయించి, ప్రభుత్వమే అమ్మకాలను పెద్ద మనసుతో పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎక్కడ తాగాలో ప్రభుత్వమే చెబుతుంది. వారు చెప్పిన చోట, చెప్పిన వేళల్లో తాగితే నేరం కానే కాదు. తాగి బండి నడిపితేనే నేరం.

ఒకపక్క విపరీతంగా తాగించాలి. మరో పక్క ప్రజలను దారిలో పెట్టాలి. ఈ రెండు పరస్పర వైరుధ్యాల మధ్య ప్రభుత్వాలు ఎప్పుడూ నలిగిపోయి…చివరకు రసహృదయంతో లెక్కకు మించి చుక్కలు గుక్కలు గుక్కలుగా తాగించేవైపునే నిలబడాల్సి వస్తోంది. ఇదొక అసంకల్పిత ప్రతీకార మద్య మహా యజ్ఞంగా మనం విశాల హృదయంతో, తాత్విక దృష్టితో అర్థం చేసుకోవాలి.

తాగి బండి నడిపినవారి నుండి, తాగి బండి నడిపి ఎదుటివారిని చంపినవారి నుండి జరిమానాలు వసూలు చేయడం ప్రభుత్వ విధి. చీమా చీమా ఎందుకు కుట్టావు? కథలోలా చావుకు తాగుడు; ఆ తాగుడుకు ప్రభుత్వ విధానం, ఆ విధానం నైతికత…అంటూ కథను వెనక్కు తవ్వుకుంటూ వెళ్లడానికి భారతీయ శిక్షా స్మృతి ఒప్పుకోదు. స్మృతి అంటేనే గుర్తుండేది అని అర్థం. అదొక జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవడం వరకే. అంతకు మించిన చర్చలోకి వెళితే స్మృతికి మతి పోయి…గతి లేనిదవుతుంది.

సరదాలు- వ్యసనాలు

జంధ్యాల సినిమాలో ఒక పెళ్ళిచూపుల సందర్భం. అమ్మాయి గురించి ఆమె తరపువారు గొప్పగా చెప్పిన తరువాత…అబ్బాయి తరపున సుత్తివేలు చెప్పే మాట- “మా అబ్బాయి బంగారు. ఏ దురలవాట్లు లేవు. భోజనమయ్యాక ఒక జర్దా పాన్ తప్ప. పాన్ తరువాత ఒక సిగరెట్టు తప్ప. సిగరెట్టు తరువాత ఒక బాటిల్ తప్ప. బాటిల్ తరువాత …కొంపలు తప్ప…” ఇవతల అమ్మాయి తరుపువారు స్పృహదప్పి పడిపోతారు!

అలా ఏ వ్యసనమయినా ముందు సరదాకే మొదలై…తరువాత అలవాటు అయి…చివరికి దురలవాటు అవుతుంది.

డిసెంబర్ 31 రాత్రి తాగి నడిపేవారి బారిన పడకుండా ఫ్లయ్ ఓవర్లను మూసేసుకుంటాం కానీ…తాగడాన్ని ఆపలేము. మన అలవాట్ల తీవ్రత అలాంటిది.

న్యాయం- ధర్మం

న్యాయానికి చెవులు మాత్రమే పని చేస్తాయి. న్యాయంలో చూపు అప్రధానం. ధర్మం బ్రహ్మ పదార్ధం. కళ్లు, చెవులు, నోరు ఏ అవయవమూ ధర్మానికి సరిగ్గా పని చేయదు. ధర్మం ఎప్పుడూ ప్రవచనాల్లోనే వినపడుతూ ఉంటుంది. ఏటా ఒక్కో రాష్ట్రం 15, 20, 30 వేల కోట్ల రూపాయల మద్యం తాగేలా విధానాలను రూపొందించి…అమలు చేయడం న్యాయమా? ధర్మమా? అన్నది మరీ అన్యాయమయిన ప్రశ్న అవుతుంది. అలా అడగడం అత్యంత అధర్మమవుతుంది.

సిద్ధాంతం చెబితే అర్థం కావడం కష్టం కాబట్టి…ఎంతటి సిద్ధాంతాన్నయినా ఒక ఉదాహరణతోనే చెప్పాలి. అప్పుడు అరటి పండు ఒలిచిపెట్టినంత సులభంగా అందరికీ అర్థమవుతుంది.

దేశవ్యాప్తంగా మద్యం మీద వార్షిక సగటు వ్యయ సూచీలో రెండు తెలుగు రాష్ట్రాలు అద్భుతమైన ప్రగతి సాధించాయి. “వార్షిక మద్య వ్యయ సూచీ” అనే పారిభాషిక పదం గంభీరంగా ఉండి కొందరికి అర్థం కాకపోవచ్చు. సామాన్యుల భాషలో చెప్పాలంటే మందు బాటిళ్లకోసం మనం పెట్టే ఖర్చు దేశంలోని ఏ రాష్ట్రమూ పెట్టలేకపోతోంది. కొన్ని దశాబ్దాలపాటు పంజాబ్, కేరళ ముందు మద్యవినియోగంలో ఏ రాష్ట్రమూ నిలబడలేకపోయేది.

అలాంటిది మనం ఒళ్లు గుల్ల చేసుకుని సంపాదించిన సొమ్మును మందు చుక్కలకు ధారపోస్తూ…ఆ రాష్ట్రాల మత్తు వదిలించి…పోటీలో వారిని చిత్తుగా ఓడించి…మనం మత్తు మహాయజ్ఞంలో మొదటి ఒకటి, రెండో స్థానాల్లో జోగుతున్నామంటే మాటలు కాదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా…మందు విషయంలో మాత్రం పోటీ పోటీయే! ప్రస్తుతానికి తెలంగాణాది మొదటి స్థానం. ఏపిది రెండో స్థానం. వచ్చే ఏడు స్థానాలు అటు ఇటు మారవచ్చు! ఇంకో రాష్ట్రానికి మొదటి రెండు స్థానాలు ఎప్పటికీ దక్కకపోవచ్చు.

ఇందులో సరదా ఉంది. వ్యసనం ఉంది. న్యాయముంది. చట్టముంది. నేరముంది. శిక్ష ఉంది. ధర్మముంది. ఆదర్శముంది. అభ్యుదయముంది. మద్యంమీద ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంతో సకల సామాజిక గతి సూత్రాలన్నీ పెనవేసుకుని విడదీయరానంత బలంగా ఉన్నాయి.
అదే- మన సమసమాజ నవసమాజ నిర్మాణంలో బ్యూటీ!

ఏ హార్వర్డ్ లేదా గచ్చిబౌలి ఇండియన్ బిజినెస్ స్కూల్- ఐఎస్ బి లాంటి మేనేజ్మెంట్ విద్యా సంస్థలు సరిగ్గా దృష్టి పెడితే ఇదొక గొప్ప వ్యాపార సూత్రం కాగలదు. విలువ ఆధారిత పన్ను(వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్) ఎలా వేయాలో చెప్పే పాఠం కాగలదు. అతి మామూలు 180 ఎమ్మెల్ క్వార్టర్ బాటిల్ ధర వంద రూపాయలు ఉంటే అందులో డెబ్బయ్ అయిదు రూపాయలు పన్నులే ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర పన్నులకు తోడు తాగే మందు బాటిల్ ధరకు చదువులు, స్పోర్ట్స్ లాంటి లోకోపకార సెస్సులేవో కూడా తోడవుతాయి.

వంద రూపాయల మద్యం తాగి బండి నడిపినందుకు కట్టాల్సిన అపరాధ రుసుము వెయ్యి రూపాయలు అయినప్పుడు…ప్రభుత్వాలకు మద్యం అమ్మకాల మీద ఆదాయం కంటే…తాగి నడిపినవారు కట్టే జరిమానాల డబ్బే పదింతలు ఎక్కువగా వస్తుంది. రావాలి కూడా. ఇది తాగినవాడికి కొల్లేటరల్ డ్యామేజ్. ప్రభుత్వానికి కొల్లేటరల్ అడ్వాంటేజ్ అండ్ ప్రాఫిట్!

ఏ రాష్ట్రంలో అయినా ఇప్పుడు మంచి నీళ్ల బడ్జెట్ కంటే మద్యం మీద ఖర్చు కనీసం మూడు, నాలుగు రెట్లు అధికం. కొన్ని రాష్ట్రాలకు మద్యమే ప్రధానమయిన ఆదాయ వనరు. ఇందులో మంచి చెడ్డల గురించి మాట్లాడ్డం దండగ. మద్యం దానికదిగా ఒక పండగ.

మహా నగరాల్లో పగలూ రాత్రి తాగేవారు తాగుతూ ఊగుతూ జోగుతూనే ఉంటారు. తాగి నడిపి ప్రమాదాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. మధ్యలో అమాయకులు పోయేవారు పోతూనే ఉంటారు. ఉండేవారు తాగేవారు పెట్టే బాధలు భరించలేక ఎప్పుడు పోతారో తెలియక ఉంటూ ఉంటారు.

బాధలు మరచిపోవడానికి తాగేవారు; బాధ పెట్టడానికి తాగేవారు; బాధపడడానికి తాగేవారు; ఆనందం పట్టలేక తాగేవారు; ఆనందం కోసం తాగేవారు; మర్యాద కోసం తాగేవారు; మర్యాదగా తాగేవారు; అమర్యాదగా తాగేవారు; ఏమీ తోచక తాగేవారు, వ్యసనంగా తాగేవారు, ఎందుకు తాగుతున్నారో తెలియక తాగేవారు…ఇలా ఈ లిస్ట్ కు అంతులేదు. వీకెండ్ తాగకపోతే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెను గౌరవించి ఎక్కువ మంది వీకెండే ఎక్కువగా మిక్కిలి మక్కువగా తాగుతూ ఉంటారు.

తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్య వాచకం. తాగుడు/తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డి జె చప్పుళ్లకు ఎగురుతూ తాగడం- సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు.

ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష తడబడుతుంది. వ్యాకరణం మూగబోతుంది. భాషా శాస్త్రవేత్తలు, భాషోత్పత్తి శాస్త్రవేత్తలు సరిగ్గా దృష్టి పెడితే- తాగుబోతుల భాష, వ్యక్తీకరణ, అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్న ప్రత్యేకమయిన వ్యాకరణం, ఉచ్చారణ భేదాల్లాంటి ఎన్నో భాషాపరమయిన వినూత్న విషయాలు తెలిసేవి. తాగుబోతులకు- భాషకు; తాగుబోతులకు- ఆర్థిక రంగానికి; తాగుబోతులకు- సమాజ శ్రేయస్సుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల మీద జరగాల్సినంత పరిశోధనలు జరగకపోవడం నవనాగరిక సమాజానికే వెలితి! – పమిడికాల్వ మధుసూదన్ 9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆపరేషన్ సిందూర్‌లో 155 మంది పాకిస్థాన్ జవాన్ల బలి..!?
  • కాఫర్ డ్యామ్ కదా… పర్లేదు, అప్పుడప్పుడూ అలా జారుతూ ఉంటాయి…
  • ప్రశాంత్, వంగా, రాజమౌళి, మణిరత్నం…. ఈ ప్రేమకథ తీయగలరా..?
  • మార్వాడీ గో బ్యాక్..! సమాజంలో ఓ అలజడి రేపే కుటిలయత్నాలు..!!
  • దర్శనమివ్వని ఆ దేవదేవుడికి … బయటి నుంచే ఓ పే-ద్ద దండం పెట్టింది బిడ్డ..!!
  • ప్రజల కోసం చేసే పోరాటాలు, త్యాగాల వాస్తవ విలువ ఎంత..?!
  • సో వాట్..? నా నలుపే నా బలం…! తలెగరేసి చెబుతుంది అర్చన..!!
  • పెళ్లయిన 9 రోజులకే భర్త హత్య…! ఆ తరువాత ఆమె కథ ఏమైంది..?!
  • బిపాషా మగది..! నెట్‌లో ఓ పిచ్చి ‘కండల’ పంచాయితీ కలకలం..!
  • పెరోల్..! అన్ని బంధాల్నీ గౌరవించే ఓ అనుబంధాల బాధితుడి కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions