నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్ప మద్యపానం… దాంతోనే చెడిపోయాను, లేకపోతే మరింతగా ప్రజాసేవ చేసే అవకాశం లభించేది…. అని ఈమధ్య రజినీకాంత్ ఎక్కడో చెప్పాడు… నిజానికి తన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది మద్యపానం కాదనీ, ధూమపానం అనీ చెన్నై పండితులు అంటుంటారు… ఆరోగ్యమే సరిగ్గా ఉంటే, రాజకీయాల్లో క్లిక్కయిపోయి, తమిళనాడును బాగా ఉద్దరించేవాణ్నని తన వ్యాఖ్యల అంతరార్థం…
72 ఏళ్ల వయస్సు… బయట ఆఫ్ ది స్క్రీన్ రజినీని చూస్తే హీరో కాదు కదా, హీరో తండ్రి పాత్రకూ సరిపోడని అనిపిస్తుంది… కానీ ఈరోజుకూ తన క్రేజ్‌కు తిరుగులేదు… తనంటే అంత పిచ్చి ఫ్యాన్స్‌కు… ఈ వయస్సులో కూడా పాపులర్ హీరోలు వేసే కుర్ర కథానాయకుల వేషాలు వేస్తాడు… ఏదో చిన్న చిన్న స్టెప్పులు వేస్తాడు… కొంత గ్రాఫిక్స్ సహకారం తీసుకుని ఫైట్లూ చేస్తాడు… తన మ్యానరిజమ్స్ సరేసరి… ఇప్పటికీ సూర్య, విజయ్ రేంజులో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు… అదీ తాజా చర్చ…
ఎందుకంటే..? జైలర్ అనే సినిమా వస్తోంది కదా… దానికి ఏకంగా 110 కోెట్ల పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు… సినిమా బడ్జెట్ మొత్తం 220 కోట్లు కాగా అందులో సగం హీరో రెమ్యునరేషనే… గతంలో కూడా ఓ సినిమాకు ఇంతే తీసుకున్నాడట… ఈ సినిమాకు సంబంధించి మోహన్ లాల్ కు 8 కోట్లు, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లకు చెరో నాలుగు కోట్లు, తమన్నాకు మూడు కోట్లు, యోగి బాబుకు కోటి, రమ్యకృష్ణకు 80 లక్షలు ముట్టచెప్పినట్టు తెలుస్తోంది…
Ads
నిజానికి ఆ ప్రోమోల్లో కనిపిస్తున్న ఏకైక ఆకర్షణ తమన్నా డాన్స్… కావాలయ్యా, రా, దా అంటూ ఆమె వేసిన స్టెప్పులు బాగా పాపులర్ ఇప్పుడు… సరే, డాన్సుల్లో తమన్నాకు తిరుగేముంది..? తమన్నా పారితోషికం తప్పులేదు… యోగిబాబుకు, రమ్యకృష్ణకు అంత భారీ పారితోషికాలంటే ఆశ్చర్యమే… పైగా రజినీకాంత్ సినిమాలో మోహన్‌లాల్, శివరాజకుమార్, జాకీష్రాఫ్‌లకు పెద్ద సీన్ ఏముంటుంది… జస్ట్, కన్నడ, మలయాళం, హిందీ మార్కెట్లలో డిమాండ్ సొమ్ము చేసుకోవడం తప్ప వీరి ఎంపికలో వేరే ఈక్వేషన్ ఏమీ లేదు…
ఇక ప్రోమోలో ఉన్న మిగతా అంశాలన్నీ ఓ సగటు తమిళ కమర్షియల్ సినిమాలో ఉన్నవే… ఒక్కొక్క సినిమాకు 200 నుంచి 400 కోట్ల దాకా… ప్రభాస్ సినిమా అయితే ఏకంగా 500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారు… ఓటీటీ, టీవీ, ఓవర్సీస్, థియేటర్ రైట్స్ అన్నీ కలిపి బాగానే వస్తున్నా సరే, జైలర్ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగినా సరే… పెద్ద హీరోల సినిమాలు భారీ జూదంలా మారుతున్నయ్…
డిమాండ్ ఉన్న హీరోలయితే బిజినెస్ ముందే జరిగిపోతోంది, అందుకే ఇంత ఖర్చు చేస్తున్నాం అంటారు నిర్మాతలు… ఎలాగూ డిమాండ్ ఉంది కదాని హీరోలు తమ రేట్లను విపరీతంగా పెంచేశారు… దీంతో టికెట్ రేట్లు పెంచుకోవడానికి పైరవీలు, ప్రేక్షకుడిపై భారం… అందుకే మరి థియేటర్ వదిలేశారు చాలామంది ప్రేక్షకులు… ఐనా హీరోకు డిమాండ్ ఉంటే సినిమా ప్రాజెక్టు లాభదాయకం కావని ఏమీ లేదు… బ్రో సినిమాలో ఏకంగా పవన్ కల్యాణే నటించినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… ఈ సినిమాకు పవన్ 40 నుంచి 50 కోట్లు తీసుకున్నాడట… తన అంతకుముందు సినిమాలూ అంతే… చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించిన ఓ సినిమా కూడా ఫ్లాప్…
అంతెందుకు, ఖర్చు ఆకాశాన్నంటే ప్రభాస్ సినిమాలూ అంతే కదా… ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్… అంతకుముందు రాధేశ్యామ్ కూడా అంతే… ఐతేనేం, సాలార్, కల్కి వంటి మరింత భారీ సినిమాలు రాబోతున్నయ్… ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ సినిమా ఇప్పటికీ లేదు… సో, ఇవన్నీ చెప్పేది ఏమిటంటే రాబోయే రోజుల్లో మన సినిమాలకు ప్రధాన నష్టదాయకం కాబోయేది హీరోల పారితోషికాలే… ప్రేక్షకుడిని క్రమేపీ థియేటర్‌కు దూరం చేయబోయేవి కూడా ఇవే… కోడిపందేలు, గుర్రప్పందేలులాగా ఇప్పుడు భారీ నిర్మాతల తెరపందేలు…!!
Share this Article