నిజానికి ఇదొక నాటకం… ప్రతివాడూ ఏ సినిమాలో ఏముందో వెతకడం, ఓ పాయింట్ పట్టేసుకోవడం, గెలకడం, మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎమోషన్స్ రెచ్చగొట్టడం… మరీ అర్థంపర్థం లేని విషయాలనూ వివాదంలోకి లాగడం, ఓ లీగల్ నోటీస్ పంపించడం, తరువాత సంప్రదింపులు, బేరాలు గట్రా… అవి పెద్దగా పనిచేయడం లేదని ఈమధ్య కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశారు… ఆ సినిమా బాధ్యుడి మీద దాడి చేస్తే లక్ష, ఒక్కో దెబ్బకు వెయ్యి రూపాయలు… ఇలా రేట్లు, టారిఫ్ ప్రకటిస్తున్నారు… సోషల్ మీడియా, మీడియా ఉండనే ఉందిగా… మరింత పెట్రోల్ పోసి, మంటలు పెంచడానికి..! మరీ నీచం ఏమిటంటే… ఆమధ్య కర్నిసేన పద్మావత్ సినిమాను రచ్చలోకి లాగి, దీపిక పడుకోన్ ముక్కు కోస్తే 5 కోట్లు ఇస్తామని ప్రకటించడం..! ఆమె ఆ సినిమాకు నిర్మాత కాదు, దర్శకురాలు కాదు, కనీసం కథారచయిత కూడా కాదు… అయితేనేం, సెలబ్రిటీని భయపెడితే పర్పస్ నెరవేరుతుందని..!!
ఈమధ్యే ఎవడో విజయ్ సేతుపతి మీద దాడికి ప్రయత్నించాడు… ఇప్పుడు జైభీమ్ సినిమాను వివాదంలోకి లాగి, సూర్య మీద దాడిచేస్తే లక్ష రూపాయలు ఇస్తామంటూ వన్నియార్ సంఘం ప్రకటించింది… లీగల్ నోటీస్ పంపించింది… కావాలనే ఓ పాత్రకు తమ కులం పేరు ఆపాదించి, బదనాం చేశారనీ, కులం ఇజ్జత్ తీశారని ఆరోపణ… పీఎంకేకు చాలారోజులుగా పనేమీ లేదుగా, వెంటనే రంగంలోకి దిగి అన్బుమణి రామదాస్ విమర్శలకు దిగాడు… వన్నియార్ కులాన్ని అవమానించడమే గాకుండా, కావాలనే ఆంథోనీ అనే పోలీస్ అధికారి పేరును గురుమూర్తి అని మార్చారని అంటున్నాడు… చాలా అణకువగా ‘‘మాకు ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదు, అవి జస్ట్, పాత్రలు మాత్రమే, ఒరిజినల్ సంఘటనను సినిమాగా తీసినప్పుడు మార్పులు చేర్పులు సహజమే’’ అన్నాడు సూర్య… గుడ్… మరి సూర్యకు ఎందుకు మద్దతు పలకాలి..?
Ads
- ఓ కమర్షియల్, పాపులర్ హీరో దాదాపు ఓ పారలల్ సినిమాలో హీరోగా నటించడం… సగటు సౌతిండియన్ హీరో ప్రదర్శించే ఏ అవలక్షణాలూ కనిపించలేదు సినిమాలో… ఈ సినిమాకు సరిపడా టైం కేటాయించడం గ్రేట్, అదే కాల్షీట్లను కమర్షియల్ సినిమాకు కేటాయిస్తే కోట్లు వచ్చిపడేవి… ఎంతమంది హీరోలు ఇలాంటి పాత్రల్ని చేస్తారు..?
- ఇలాంటి సినిమాలు సక్సెస్ కావడం అరుదు… ఐనా సరే, తనే సొంతంగా నిర్మించాడు… జ్యోతిక-సూర్య జంట కొన్ని ఆసక్తికరమైన కథల్ని ఎంపిక చేసుకుని, సొంతంగానే సినిమాలు నిర్మించడం సాహసం ప్లస్ మంచి అభిరుచి…
- థియేటర్ల సిండికేట్ బెదిరించినా సరే… ఓటీటీల్లో సినిమాలు విడుదల చేసే విషయంలో స్థిరంగా నిలబడ్డాడు… లొంగిపోలేదు, వొంగిపోలేదు…
- తన సొంత పైత్యాన్ని ఎక్కడా సినిమా మీద రుద్దలేదు, దర్శకుడికి మంచి స్వేచ్ఛనిచ్చాడు… కథ, ట్రీట్‌మెంట్ విషయంలో…
- ఇరులార్ కుల సంక్షేమం కోసం కోటి రూపాయల్ని సీఎం స్టాలిన్ సమక్షంలో చంద్రు ట్రస్టుకు ఇచ్చాడు, కాకపోతే పార్వతమ్మ కథను ఆమెకు తెలియకుండా సినిమాగా తీశారనే నిజం ఒకింత బాధ కలిగించేదే… అలాగే దుర్భరమైన నివాసంలో ఉన్న ఆమెను ఆదుకుంటే బాగుండుననీ జనం అభిప్రాయపడ్డారు… సూర్య నిజంగానే ఆమెకు 10 లక్షలు ఇచ్చి, తప్పు దిద్దుకున్నాడు, అందరి నోళ్లూ మూయించాడు…
- తనకు స్పందించే హృదయం ఉంది, అభిరుచి ఉంది, సొసైటీ పట్ల కాస్తోకూస్తో కన్సర్న్ ఉంది… అదేసమయంలో ప్రయోగాలు చేయగల ధైర్యం ఉంది… అందుకే సూర్య వంటి హీరోలకు నైతిక మద్దతునివ్వాలి… ఈ మనోభావాల దందాలకు కాస్త అడ్డుకట్ట అవసరం… (ఎస్, నిజంగా ఒక సెక్షన్ మనోభావాలు దెబ్బతీసేలా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తే తప్పక ఖండించాల్సిందే, కానీ ఇక్కడ జైభీమ్ సినిమాలో ఆ దెబ్బ తినడాలు ఏమీలేవు… పీఎంకే రాందాస్ వాదన నిలబడేది కాదు…)
- నెటిజనం కూడా #isupportsuriya, #istandwithsuriya, #i_stand_with_suriya, #westandwithsuriya అంటూ పలు హ్యాష్ ట్యాగులతో భారీగానే సూర్యకు మద్దతు పలుకుతున్నారు సోషల్ మీడియాలో… గుడ్…
Share this Article