Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదుగో ఇలాంటివే… ఇంకా మన జీవితంలోని పాజిటివిటీని బతికించేవి…

September 17, 2021 by M S R

తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావమఱదులన్నలు

మేనమామగారు, ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైన

దానుదర్లగ వెంటదగిలిరారు, యమునిదూతలు

ప్రాణమపహరించుక పోగ మమతతో బోరాడి మాన్పలేరు,

బలగమందఱు దుఃఖపడుట మాత్రమెకాని,

యించుకయాయుష్యమీయలేరు, చుట్టములమీది భ్రమదీసి చూరజెక్కి,

సంతతము మిమ్ము నమ్ముట సార్ధకంబు

……… అన్న శేషప్ప పద్యంలోని ఈ మాటలు వింటుంటే… దుబాయ్ ఆసుపత్రిలో 9 నెలల పాటు గడిపి ఇక పనైపోయిందనుకున్న ఆ పేషంట్ పాలిట వాళ్లే సాక్షాత్తూ ఆ భూషణ వికాసుడైన నారసింహుడయ్యారనిపించే కథ ఇది!

dubai

కట్ల గంగారెడ్డీది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం సుద్దపెల్లి. చాలామంది తెలంగాణా నుంచి వలస వెళ్లేవారిలాగే.. గంగారెడ్డీ పొట్ట చేతపట్టుకుని దుబాయ్ వెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తూ… గత ఏడాది 2020 డిసెంబర్ 25వ తేదీన అనారోగ్యంతో దుబాయ్ లో ఆసుపత్రి పాలయ్యాడు. మెడి క్లీనిక్ ఆసుపత్రి డాక్టర్లు పక్షవాతమని తేల్చేశారు. బ్రెయిన్ సర్జరీ కూడా చేయాల్సి ఉందనీ నిర్ధారించారు. అప్పటికే గంగారెడ్డీ పరిస్థితి మరింత విషమించి కోమాలోకి వెళ్లి… చావు అంచును చూసిన పరిస్థితి. ఎంతో ఆయుష్షున్నవాళ్లను కూడా ఒక్కోసారి కనీసం ఊహకు కూడా తెలియకుండా మృత్యురూపంలో లాక్కుని వెళ్లే విధి… గంగారెడ్డీకి ఇంకా భూమ్మీద నూకలు చెల్లున్నాయో ఏంటోగానీ.. కొంత వెనుకడుగు వేసింది. దాంతో ఆరు నెలలపాటు కోమాలో ఉన్న గంగారెడ్డి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు.

Ads

గత ఏడాది 2020 డిసెంబర్ 25 నుండి ఇప్పటి వరకు 9 నెలలు డాక్టర్లు చికిత్స చేస్కుంటూ వస్తున్నారు. అయితే తండ్రి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా పర్లేదని తెల్సుకున్న తన కొడుకు మణికంఠ.. తండ్రి గంగారెడ్డిని ఎలాగైనా ఇండియా తీసుకురావాలని భావించాడు. కానీ దుబాయ్ ఆసుపత్రిలో తండ్రిని డిశ్ఛార్జ్ చేయాలంటే ఏకంగా 3 కోట్ల 40 లక్షల రూపాయలు చెల్లించాలి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగా కొన్ని గల్ఫ్ కార్మికసంఘాలు దేశంగాని దేశంలో చేస్తున్న కృషి అనిర్వచనీయం కాగా… అదిగో అలాంటి దుబాయిలో సామాజిక సేవనందిస్తున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) అధ్యక్షుడు గుండల్లి నర్సింహను గంగారెడ్డి కుమారుడు మణికంఠ.. తన స్నేహితుడు ఇబ్రహీంతో కలిసి తన తండ్రిని తమ ఊరికి తీసుకెళ్లేందుకు సాయపడాలని కోరారు.

అయితే అదేమంత చిన్న విషయం కాదు. కానీ, ప్రయత్నం మానవ లక్షణం. అందుకే నర్సింహ మానవీయ హృదయం వెంటనే స్పందించింది. నర్సింహా పేషంట్ గంగారెడ్డి చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు పలుమార్లు వెళ్లి.. అక్కడి హాస్పిటల్ అధికారులు, పోలీస్ అధికారులతో మాట్లాడుతూనే.. మరోపక్క కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (దుబాయి) అధికారులతోనూ పరిస్థితిని వివరించే యత్నం చేశాడు. పేషంట్ ఆరోగ్య పరిస్థితి ఎంత దయనీంగా ఉంది.. ఇండియాలో వాళ్ల కుటుంబ పరిస్థితులేంటన్నవి మానవత్వమున్న ఎవరైనా కరుణించకతప్పలేని విధంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికార యంత్రాంగాన్ని కన్విన్స్ చేశాడు. హాస్పిటల్ యాజమాన్యం వేసిన 9 నెలల బిల్లు ఇంచు మించు అక్షరాలా మూడు కోట్ల నలబై లక్షల రూపాయలను కూడా మాఫీ చేయించాలని కోరాడు. అయితే గంగారెడ్డీ కొడుకు మణికంఠ అడగ్గానే నర్సింహ ఏవిధంగానైతే స్పందించాడో.. దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారుల్లోనూ అదే ప్రతిస్పందన కనిపించింది. పైగా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి (GWPC) సంస్థ మీద భరోసా ఉంచి.. గంగారెడ్డీని ఇండియా పంపేందుకు కావల్సిన ఫార్మాలిటిస్, ఇతర పేపర్ వర్క్ అంతా పూర్తిచేయాలని గుండెల్లి నర్సింహను కోరారు.

dubai

గుండెల్లి నర్సింహ ఆ పనంతా పూర్తి చేసి.. ఇండియన్ కౌన్సిల్ లేట్ అధికారులకు తెలపడంతో.. ఇండియన్ కాన్సులేట్ అధికారులు ప్రయాణించటం కోసం ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సుని కూడా మాట్లాడ్డంతో పాటు.. పేషంట్ గంగారెడ్డి వెంట అతని ట్రీట్మెంట్ కోసం ఒక నర్సు సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు దుబాయ్ లోని కాన్సలేట్ అధికారుల పూర్తి సహాయ, సహకారాలతో హాస్పిటల్ యాజమాన్యం వేసిన బిల్లు మూడు కోట్ల నలబై లక్షల రూపాయలను కూడా మాఫీ అయి.. ఈ రోజు గంగారెడ్డి ఇండియాకు చేరుకున్నాడు. అయితే పేషంట్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి పేషంటుని నేరుగా తమ తీసుకెళ్లకుండా పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. దుబాయిలోని మెడి క్లినిక్ సిటీ హాస్పిటల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు ఎయిర్ అంబులెన్స్ తో పాటు.. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నిమ్స్ హాస్పిటల్ వరకు ఎయిర్ అంబులెన్స్ కు అదనంగా అయిన ఖర్చు అక్షరాలా నాలుగు లక్షల నలభై వేల రూపాయలను కూడా దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులే సమకూర్చడమంటే మాటలు కాదు. కానీ నర్సింహ కృషి ఫలించింది. తండ్రి గంగారెడ్డిని సొంతూరుకు తీసుకొచ్చుకోవాలనే కొడుకు మణికంఠ కల సాకారమైంది.

మాట్లాడుకోవడానికీ… చెప్పుకోవడానికీ.. రాసుకోవడానికీ కనిపించినంత సులువైన విషయమేంకాదిది… ఇలాంటి స్టోరీలు విన్నప్పుడే… శేషప్ప శతకంలోని ఇదిగో ఇలాంటి ఎన్నైనా పద్యాలు గుర్తుకువస్తూనే ఉంటాయి. తల్లి గర్భమునుండి ధనముదేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణ మన్నమెకాని, మెఱుగు బంగారంబు మ్రింగబోడు, విత్తమార్జనజేసి విఱ్ఱవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొందుగా మఱుగైన భూమిలోపలబెట్టి దానధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ? తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు? అంటాడు శేషప్ప! ఏ శేషప్పో, వేమనో, బద్దెనో చెప్పిన పద్యాల నీతులను గ్రహించే స్థితిలో లేకపోయినా.. ఇదిగో ఇలాంటి మానవీయ కథనాలు విన్నాకైనా… పేదలు, పెద్దలన్న తేడా లేకుండా జలగల్లా పీక్కుతినే సంస్కృతికి మన కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎప్పుడు చెక్ పెడతాయా అన్నదే మళ్ళీ బూర్జ్ ఖలీపా టవరంత డౌట్!……………. రమణ కొంటికర్ల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions