పట్టాలు తప్పని మానవత్వం
————————-
రైలు ప్రమాద వేళ…
బాలాసోర్ పెద్ద మనసు
———————————-
ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాదం మానవ తప్పిదమా? రైల్వే సిగ్నలింగ్ సిబ్బంది నిర్లక్ష్యమా? ఇవేవీ కాక కుట్రా? అన్న చర్చ జరుగుతోంది. రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదయినా పోయిన ఒక్క ప్రాణం కూడా తిరిగిరాదు. ఇటీవలి దశాబ్దాల్లో కనీ వినీ ఎరుగని ఘోరమయిన ప్రమాదం. జరగకుండా ఉండాల్సింది. జరిగింది. ప్రమాదం తీవ్రతకు పట్టాలు నామరూపాల్లేకుండా పోయినట్లు…పోయినవారిలో దాదాపు 150 ప్రాణాలు పేర్లు తెలియక …ఎవరివో కూడా తెలియడం లేదు. రిజర్వేషన్ బోగీల్లో పోయిన ప్రాణాలను మాత్రమే గుర్తించగలిగారు.
పోయినవారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. ప్రాణాలతో మిగిలినవారిలో చేతులు, కాళ్లు విరిగినవారు వందల మంది ఉన్నారు. ఈ గాయాలు ఇప్పటిలో మానేవి కావు. ఆ కన్నీళ్లు ఇప్పటిలో ఇంకిపోయేవి కావు. “భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం…దీనికి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం” అన్న ప్రకటనలు ఆత్మలకు వినపడవు. అంతరాత్మలకు అర్థం తెలిసినా పెదవి విప్పవు.
ఒడిశా బాలాసోర్ పట్టణం. అసలు పేరు బాలేశ్వర్. రాష్ట్రానికి ఉత్తరాన పశ్చిమ బెంగాల్ కు దగ్గరగా ఉన్న జిల్లా కేంద్రం. మహా అయితే ఒకటిన్నర లక్ష జనాభా. అక్కడికి నలభై కిలో మీటర్ల దూరంలో ఉన్న బహనగ బజార్ చిన్న రైల్వే స్టేషన్. అక్కడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగవు. ఒకే సమయంలో పక్క పక్క ట్రాక్ ల మీద రెండు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లు వెళ్లాలి. చీకటి పడుతున్న సాయంవేళ దాదాపు 130 కిలో మీటర్ల వేగంతో వెళ్లే ఒక రైలు మెయిన్ లైన్లోకి వెళ్లకుండా…పక్కన లూప్ లైన్లో ఆపి ఉంచిన గూడ్స్ రైలును ఢీకొట్టి మూడు నాలుగు బోగీలు పచ్చడయ్యాయి. కొన్ని బోగీలు సినిమాల్లోలా గాల్లోకి ఎగిరి పక్కన వెళుతున్న మరో సూపర్ ఫాస్ట్ రైలు మీద పడ్డాయి. ఇది ఒక ప్రమాదం కాదు. గోడ దెబ్బ, చెంప దెబ్బ అన్నట్లు ఏకకాలంలో రెండు రైలు ప్రమాదాలు.
Ads
చీకటి కమ్మిన వేళకు చీకట్లో కలిసిపోయిన ప్రాణాలు. పోతున్న ప్రాణాలు. పోలేక ఆర్తనాదాలు. ఎటు చూసినా మాంసం ముద్దలు….
ఆ సమయంలో బాహనగ బజార్ చిన్న ఊరి జనం, ఆపై బాలాసోర్ పట్టణం స్పందించిన తీరు మాటలకందనిది.
1. సెల్ ఫోన్ ను టార్చ్ లైట్లుగా వేసి…గాయపడ్డవారిని బైకుల మీద వెను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లారు.
2. నిచ్చెనలు వేసి పైకెక్కి ఇరుక్కున్న వారికి మంచి నీళ్లు ఇచ్చి ధైర్యం చెప్పారు.
3. రాత్రంతా శ్రమించి కనీసం 300 మంది పిల్లలను కాపాడి…తమ పొత్తిళ్లలో పెట్టుకున్నారు.
4. చేయగలిగినవారికి ఫోన్లు చేశారు.
5. చెప్పగలిగినవారికి క్షేమ సమాచారం చెప్పగలిగారు.
6. ఊరుకాని ఊరు. భాష కాని భాష. పట్టాలపై పడిపోయినవారిని, బోగీల్లో వేలాడుతున్నవారిని పలకరించారు. చేయగలిగిన పరిచర్యలన్నీ చేశారు.
7. బాలాసోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రైలు ప్రమాద క్షతగాత్రులకు రక్తం ఇవ్వడానికి బాలాసోర్ యువకులు స్వచ్చందంగా రాత్రంతా క్యూలో నిరీక్షించిన ఫోటో ఒకటి దేశమంతా వైరల్ అయ్యింది. అవ్వాలి కూడా.
8. బాలాసోర్ వల్ల బతికిన ప్రాణాలెన్నో?
9. బాలాసోర్ యువకుల రక్తదానం వల్ల కొత్తగా ఏర్పడ్డ రక్తసంబంధాలెన్నో?
బాలాసోర్ పోతున్న ప్రాణాలను బతికించడంతో పాటు…పోతున్న మానవత్వాన్ని కూడా బతికించింది. మానవత్వాన్ని మహోజ్వలంగా వెలిగించింది.
“పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని?
మూగ నేలకు నీరందనివ్వని వాగు పరుగు దేనికని?
పదపద మంటూ పలుకులేగాని కదలని అడుగు దేనికని?”
-సినారె గజల్
పరులకోసం పాటుపడిన బాలాసోర్ కు,
మూగరోదనకు నీరందించిన బాలాసోర్ కు,
పదపదమంటూ కదిలి సాయం చేసిన బాలాసోర్ కు…ఏమిస్తే రుణం తీరుతుంది? ఏమాటలు కృతజ్ఞతకు సరిపోతాయి?
పాదాభివందనాలు తప్ప.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article