Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేటగాడు ఇప్పుడు జంతుప్రేమికుడు… అరుదైన జాతులకు సంరక్షకుడు…

May 5, 2023 by M S R

వేటగాణ్ని ప్రేమికుడిగా మార్చిన వేక్ అప్ కాల్ కథ!

బోయవాని వేటుకి గాయపడిన కోయిల పాట వింటుంటే.. వేటగాడిదెంత కరుడుగట్టిన మనస్తత్వం అనిపిస్తుంది కదా! కానీ, ఓ పక్షి వేటనంతరం.. ఓ కరడుగట్టిన వేటగాడి హృదయం చలించి.. మనిషిగా మారి… ఆ మహనీయుడే ఎన్నో జీవుల పాలిట దేవుడయ్యాడు. కోహిమాకు చెందిన రువుటో బెల్హో వేకప్ కాల్ స్టోరీలోకి ఓసారి విహంగ వీక్షణమై తెలుసుకుని వద్దాం పదండి.

భక్షకుడు-రక్షకుడయ్యాడు 64 ఏళ్ల రువుటో బెల్హో. నాగాలాండ్ లోని కోహిమాలో ఓ మినీ జూనే ఏర్పాటు చేసి.. ఇప్పుడు 60 జాతుల అరుదైన పక్షులు, జంతువులను కాపాడుతున్న ఓ సేవకుడయ్యాడు మనం చెప్పుకుంటున్న రిటైర్డ్ ప్రభుత్వోద్యోగైన బెల్హో. చిన్నప్పటి నుంచీ తన చుట్టూ ఉన్న ప్రకృతినీ.. అందులోని వన్యప్రాణులను చూస్తూ గంటలు, రోజులు, సంవత్సరాలు గడిపాడు.

Ads

కానీ, తన కుటుంబ నేపథ్యమంతా వేటే. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఆచారాన్ని కజిన్స్ తో కలిసి విల్లంబులు, వేట తుపాకులు చేతబూని వేటకు వెళ్లుతూ కొనసాగించేవాడు. అయితే. అదెంత తప్పో తెలుసుకోవడానికి తనకు చాలా సమయమే పట్టిందంటాడు బెల్హో. ఒకరోజు అప్పటికే పూర్తిగా అంతరించిపోతున్న ఓ జాతి పక్షిని కాల్చి చంపాడు. ఆ తర్వాతగానీ రువుటోకు అదెంత అరుదైన జాతి పక్షో అర్థమైంది. ఇంకేం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇకపై వేటాడొద్దని ఓ నిర్ణయం తీసుకున్నాడు. అయితే. అంతటితో ఆగిపోలేదు బెల్హో!

వేటాడకపోతే సరిపోతుందనేది మాత్రమే సరైన ప్రాయశ్చిత్తం కాదనుకున్నాడో ఏమో బెల్హో..?!! కొన్ని కట్టుకథల్లో చెప్పినట్టుగా ఓ దొంగ, దారి దోపిడీదారైన రత్నాకరుడు కాస్తా రామాయాణ్ని లిఖించిన వాల్మీకైనట్టుగా.. పచ్చి వేటగాడైన బెల్హో ఇప్పుడు వన్యప్రాణులు, పక్షిజాతి సంరక్షకుడయ్యాడు. అటవీ జంతువులు, అడవులు, పక్షులు అంతరించిపోవడం వల్ల పర్యావరణానికి కల్గే నష్టమేమిటో అవగతం చేసుకున్నాడు.

అలా ఓ వేటగాడు కాస్తా.. శంకర్ సినిమాలో అంతరించిపోతున్న పక్షిజాతి పట్ల ఆవేదన చెందే అక్షయ్ కుమార్ మాదిరిగా.. పక్షి సంరక్షుడి అవతారమెత్తాడు. వేటగాడు రువుటో కాస్తా… పక్షి ప్రేమికుడిగా పరివర్తం చెందడానికి చాలా సమయమే పట్టగా.. గత 20 ఏళ్ల నుంచి వేటగాళ్లు మార్కెట్ కు తీసుకొచ్చి విక్రయించే పక్షులను తానే కొనుగోలు చేసి వాటిని సంరక్షిస్తున్నాడు ఈ కోహిమా కోహినూర్ వజ్రం.

నేడు రువుటో ఇల్లు పక్షులు, వివిధ జాతులు జంతువులకు ఓ సంతానోత్పత్తి కేంద్రంగా మారింది. 60 రకాల జాతుల జంతువులు, పక్షులకు ఓ సురక్షితమైన స్వర్గధామం బెల్హో ఇల్లు. వాటికి సమయానికి కావల్సిన ఆహారం.. ఆలనా, పాలనా అన్నీ ఇప్పుడు బెల్హోనే! రువుటో ఇంట్లోకి అడుగుపెడితే హార్న్‌బిల్స్ బెల్స్ మోగిస్తాయి. గుడ్లగూబలు గూళ్లల్లో దర్శనమిస్తాయి.

కోతులు కొమ్మలపై చిందులేస్తుంటాయి. చిలుకలు చెట్ల ఆకుల రంగుల్లో మిళితమైపోతాయి. జింకలు గెంతుతుంటే.. ఆకలేస్తున్న చిరుత కళ్లారా వాటిని చూసే దృశ్యాలు అడవిని తలపిస్తాయి. వివిధ రకాల పిల్లుల మ్యావ్ మ్యావ్ శబ్దాల్లో వైవిద్యం చెవులను రిక్కరించేలా చేస్తాయి. నల్ల తాబేళ్లు కనువిందు చేస్తాయి. ఇలా వివిధ రకాల జంతువులు, పక్షులతో సహవాసం చేస్తున్న బెల్హో ఇప్పటికీ అడవికి వెళ్తూనే ఉన్నాడు. కానీ, ఇప్పుడు వెళ్తున్నది వేటకు కాదు.. వన్యప్రాణుల సంరక్షణకు!

అడవికి వెళ్లినప్పుడు గాయపడ్డ జంతువులను, పక్షులను మాత్రమే తీసుకొచ్చే బెల్హో జంతు ప్రేమ చూసి.. అలాంటి సంఘటనలు ఎవరికైనా ఎదురైనప్పుడు వారు కూడా రువుటోకే వాటిని తెచ్చిస్తుండటానికి కారణం.. బెల్హో పక్షి ప్రేమపై తన ప్రాంతంలోని ప్రజల్లో ఏర్పడ్డ నమ్మకమే! తన జీతంలో నుంచి పొదుపు చేసుకున్న డబ్బు నుంచి.. జంతువులను సాకడంతో పాటు.. గాయపడ్డ వాటికి వైద్యం చేయిస్తూ.. అవి కోలుకునేంతవరకూ మినీ జూగా మార్చిన తన ఇంట్లోనే ఉంచుకుంటాడు రువుటో. అయితే, రువుటో కుటుంబం కూడా ఎక్కడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా బెల్హోకు సహకరిస్తుండటంతో.. ఎకరం స్థలంలో విస్తరించిన రువుటో మినీ జూ లో 35 రకాల పక్షులతో పాటు.. ఇతర జంతువులు సురక్షితంగా ఉన్నాయి.

వీటిని చూసేందుకు వచ్చే సందర్శకులకు మినిమం టిక్కెట్ గా పెద్దలకు 20 రూపాయలకు అమ్ముతూనే.. పిల్లలకు ఉచిత సందర్శనకు అనుమతిస్తాడు. ఆ వచ్చిన సొమ్మునూ పక్షులు, జంతువుల సంరక్షణ కోసమే ఉపయోగిస్తున్నాడు ఈ కోహిమా పక్షి ప్రేమికుడు. ఇంకా తన జూను విస్తరించాలని ఉన్నా.. భూముల ధరలు పెరగడంతో అదిప్పటికిప్పుడు సాధ్యపడటం లేదనే బెల్హో.. తానున్నంత కాలం మాత్రం అంతరించిపోతున్న జీవజాతిని తనకు అందుబాటులోకి వచ్చినంతలో సంరక్షిస్తూనే ఉంటానంటున్నాడు రువుటో బెల్హో!

బెల్హో గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా.. అటువైపుగా వెళ్లేవారు ఆ మినీ జూను సందర్శించాలన్నా… ఇదిగో ఈ ఈమెయిల్ bbelho27@gmail.com లో సంప్రదించవచ్చు… రమణ కొంటికర్ల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…
  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions